Skip to content
తెలంగాణ › వార్తలు

మరుగునపడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు యాదగిరిరావు

Prajapaksham 10 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మరుగునపడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు యాదగిరిరావు

ఉజ్జిని రత్నాకర్‌ రావు.

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జనగాం ప్రాంతంలో ఒక కీలక పాత్ర వహించిన చకిలం యాదగిరిరావు 2001 నవంబర్‌ 10న చనిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో జనగామ ప్రాంతంలో 1946-48 లో చకిలం యాదగిరిరావు ఒక ప్రధానమైన విరోచితమైన మరియు చారిత్రాత్మక పాత్ర పోషించారు. 1946-48 లో జోనల్‌ కమాండర్‌ గా పనిచేశారు. ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ రజాకారుల శిబిరం ఉండేది. రజాకార్లు ప్రతిరోజు అమాయక నిరాయుధ గ్రామస్తులపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. భారత సైన్యం నుండి విరమించిన తన సొంత సోదరుడైన కృష్ణారావును 1948 మార్చ్‌ 25న నామవరం గ్రామంలో రజాకార్లు కాల్చి చంపారు. ఈ వార్త తెలుసుకున్న చకిలం యాదగిరిరావు తీవ్రమైన మానసిక వేదనకు గురై.. రజాకార్లకు గుణపాఠం నేర్పాలని తన గ్రామ దళాలను, కేంద్ర దళాలను అప్రమత్తం చేశారు. 1948 లో బైరాన్‌ పళ్లి గ్రామంలో రజాకర్లకు గ్రామదళాలకు మధ్య అనేక ఎదురు కాల్పులు జరిగాయి. గ్రామ దళాల దాడుల్లో పదుల సంఖ్యలో రజాకార్లు, పోలీసు సిబ్బంది హతమయ్యారు. ఈ అవమానాన్ని సహించలేని నిజాం ప్రభుత్వం, సైనిక ట్యాంకులు ఆత్యాధునిక ఆయుధాలతో కూడిన తన భారీ సైన్యాన్ని పంపింది.1948 ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున గ్రామాన్ని అన్ని వైపులా నుండి లొంగిపోయేలా చేశారు. ప్రత్యర్థి బలం తెలియని గ్రామ దళాలు, బురుజు పై నుండి కాల్పులు ప్రారంభించాయి. సైనిక ట్యాంకులు, బురుజులు బద్దలు కొట్టి దళ సభ్యులందరినీ హతమార్చాయి. సైన్యం గ్రామంలోకి ప్రవేశించి బైరంపల్లి, కుటికల్లు గ్రామాలలో 108 మందిని కాల్చి చంపారు. ఇందులో నుండి తప్పించుకున్న దళనాయకులలో యాదగిరిరావుతో పాటు నలుగురే మిగిలారు.ఈ ఘటనతో యావత్‌ భారతదేశం దిగ్భ్రాంతికి గురైం ది. దీనిపై భారత పార్లమెంటులో పెద్ద దుమారం రేగింది.

యాదగిరి రావు జీవితంలో ముఖ్యమైన సంఘటనలు :
సూర్యాపేట తాలూకాలోని ముక్కుడు దేవపల్లి గ్రామానికి చెందిన చకిలం చూడమ్మా- శ్రీనివాసరావుల పెద్ద కుమారుడు యాదగిరిరావు. వీరిది ఒక మధ్య తరగతి ఉన్నత కుటుంబం. వీరు 1923 సంవత్సరంలో వీరి మేనమామ గారింట మరిపెడ (మహబూబాబాద్‌ తాలూకా) గ్రామంలో జన్మించారు. మహబూబాబాద్‌లో 5 తరగతి వరకు చదువుకున్నారు. ఆ గ్రామము దేశ్ముఖ్‌ నియంత్రణలో ఉండేవి. వారి కార్యకలాపాలు ఆయనకు నచ్చలేదు. ఆయన సంపూర్ణ సమానత్వం పై ఆధారపడిన సమాజాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తన చదువును వదిలి రాజకీయాల్లో చేరారు. 18 ఏళ్ల వయసులో ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 అరెస్టు అయ్యారు.

1943లో సూర్యాపేట తాలూకాలోని దేశాయ్‌ గూడెం గ్రామంలో ఆయన బుర్రకథ నిర్వహించి జర్మనీ మరియు జపాన్లకు వ్యతిరేకంగా ప్రసంగించారు. దాని ఫలితంగా ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఆంధ్ర మహాసభ లో ముఖ్య కార్యకర్తగా కార్యక్రమాలలో పాల్గొంటూ.. మహాసభ ఆదేశాల మేరకు చకిలం యాదిగిరి రావు, చకిలం తిరుమల్‌ రావు మరియు డి వి రాఘవేంద్రరావుతో కలిసి సూర్యాపేట తాలూకాలో వ్యవసాయ కౌలుదారుల రక్షణ, వ్యవసాయ కూలీల వేతనాల పెంపు మరియు ఉచిత బలవంతపు చాకిరీ నిర్మూలన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. సూర్యాపేట ప్రాంతంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మైడం చెరువు వివాదంలో లంబాడీలను సంఘటీతం చేసి, భూస్వాములకు వ్యతిరేకంగా వారి హక్కులను పరిరక్షణ కోసం పోరాడారు.1945-46లో కమ్యూనిస్టు పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేశారు.

పెంబర్తి పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం నిజాం ప్రభుత్వం అన్ని పోలీస్‌ స్టేషన్లలో భద్రతను అప్రమత్తం చేసింది. 1946 లో ఆయన పాలకుర్తి పోలీస్‌ స్టేషన్‌ పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసి, హైదరాబాదులోని సెంట్రల్‌ జైలులో బంధించి, అక్కడి నుంచి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. న్యాయమూర్తి తనకు 7 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.2000/- జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిస్తున్నారని తెలియగానే, ఆయన నల్లగొండ జైలు నుంచి తప్పించుకొని జనగాం ప్రాంతంలో సాయుధ పోరాట నాయకుడిగా అవిర్భవించారు.

చకిలం యాదగిరిరావుకు నల్ల నరసింహులు, నెల్లుట్ల వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, బి.యన్‌.రెడ్డి, ధర్మ బిక్షం, పెండ్యాల రాఘవరావు, ఓంకార్‌ మొదలగు వారు సాయుధ పోరాటంలో సహితులుగా ఉండేవారు. యాదగిరి రావు దళంలో ఏసి రెడ్డి నరసింహారెడ్డి, కాసాని నారాయణ మొదలగు వారు సభ్యులుగా పనిచేశారు.1949 నుండి 1952 వరకు వివిధ జైల్లాలో శిక్ష అనుభవిస్తూ స్వాతంత్య్రానంతరం1952 లోమద్రాసులోని కేంద్ర జైలు నుండి యాదగిరిరావు విడుదలయ్యారు. ఆయన జనగామ తాలూకాలోని గొల్లపల్లి గ్రామానికి 1959 మరియు 1970- మధ్య రెండు పర్యాయాలు సర్పంచ్‌ గా 1964- 69 మధ్య జనగాం పంచాయతీ సమితికి ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1965 వ సంవత్సరంలో యాదగిరిరావును భారత రక్షణ చట్టం కింద అరెస్టు చేసి, విశాఖపట్నంలోని కేంద్ర జైలులో, ఆ తరువాత ముషీరాబాద్‌ జిల్లా జైలు ఉంచి 1966 లో విడుదల చేశారు.

ఆయన తన జీవిత చరమాంకాన్ని హన్మకొండలోని తన స్వగృహంలో గడిపారు. 2001 నవంబర్‌ 10న యాదగిరిరావు తన 78వ ఏటా తు విశ్వాస విడిచారు. వీరికి చకిలం ఉపేందర్‌ రావు, చకిలం నాగేందర్‌ రావ్‌ ఇద్దరు కుమారులు ఉన్నారు. నైజాం రాచరిక వ్యవస్థకు.. భూస్వామ్య, దేశ్ముఖ్‌ జాగీర్దారి నిరంకుశ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధున్ని వారి 25 వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం.మరుగున పడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు చకిలం యాదగిరి రావు గారి పోరాట స్ఫూర్తిని నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.

ట్యాగ్‌లు: Telangana