Skip to content
తెలంగాణ › వార్తలు

ఎల్‌ నినో ముప్పు.. విద్యారంగంపై ప్రభావం..

Prajapaksham 11 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఎల్‌ నినో ముప్పు.. విద్యారంగంపై ప్రభావం..

water crisis

కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

ఏ వస్తువైనా మార్కెట్లో కొనగలం.. అవసరమైతే ప్రభుత్వాన్ని అడిగి సాధించుకోగలం. కానీ నీటిని మాత్రం మనం ఫ్యాక్టరీల్లో తయారుచేయలేం. ఆకాశం కరుణించి వర్షం కురిస్తేనే జీవకోటికి ప్రాణాధారం లభిస్తుంది. ప్రకృతిలో చోటుచేసుకునే వాతావరణ మార్పులు నేరుగా మానవ జీవన విధానాన్ని శాసిస్తాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తోంది. ముఖ్యంగా పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ‘ఎల్‌ నినో’ ప్రభావం భారతదేశ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ పరిస్థితి కేవలం తాగునీరు, సాగునీటి కొరతకే పరిమితం కాకుండా.. వ్యవసా యం, ప్రజారోగ్యం, విద్యార్థుల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపనుంది.
బాసర ట్రిపుల్‌ ఐటి ఒక హెచ్చరిక
వాతావరణ మార్పుల తీవ్రతకు విద్యాసంస్థలు ఏ విధంగా ప్రభావితమవుతాయో చెప్పడానికి బాసర ట్రిపుల్‌ ఐటి (ఆర్‌జియుకెటి) పరిస్థితే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ నీటి కొరత తీవ్రమవడంతో విద్యార్థులను ఇళ్లకు పంపి, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కూడా కళాశాలలు నీళ్ళు లేక ఆన్లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి.
ఇది కేవలం ఒక సంస్థకు పరిమితమైన సమస్య కాదు. రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఎదుర్కోబోయే విపత్తుకు ముందస్తు హెచ్చరిక. రానున్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెల ల్లో టెన్త్‌, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నాయి. అలాగే వివిధ ప్రవేశ పరీక్షల
(జెఇఇ, నీట్‌, ఎంసెట్‌ మొదలైనవి) కోసం వేలాది మంది విద్యార్థులు కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందుతున్నారు.ఇలాంటి కీలక సమయంలో నీటి కొరత, విద్యుత్‌ కోతలు ఏర్పడితే విద్యార్థుల విద్యా సంవత్సరం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఎల్‌ నినో ప్రభావంతో చలికాలం ముగియకముం దే ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. వడదెబ్బ కారణంగా డీహైడ్రేషన్‌, నీరసంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. వేలాదిమంది విద్యార్థులు కలిసి ఉండే సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ విద్యాలయాలు, యూనివర్సిటీ క్యాంపస్‌లలో నిత్యావసరాలకు నీటి సరఫరా నిలిచిపోతే స్నానాలు లేక అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఎల్‌ నినో ముప్పు ముంచుకొస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో నీటి కొరత తలెత్తకుండా విద్యాశాఖ, గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగం, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రస్తుత నీటి వనరుల (బోర్‌వెల్స్‌, మిషన్‌ భగీరథ/మంచినీటి కనెక్షన్లు) స్థితిగతుల పై తక్షణమే ‘వాటర్‌ ఆడిట్‌’ నిర్వహించాలి. ఎండాకాలంలో ఏయే ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయో ముందే మ్యాపింగ్‌ చేయాలి. హాస్ట ళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కు తగినట్లుగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, భూగర్భ సంపుల నిల్వ సామర్థ్యాన్ని సమీక్షించి, అవసరమైన చోట అదనపు సింటెక్స్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ స్థానిక తాగునీటి గ్రిడ్‌ కనెక్షన్లు నిరంతరాయంగా పనిచేసేలా చూడాలి. పైప్‌లైన్‌ లీకేజీలను తక్షణమే అరికట్టాలి. తీవ్ర నీటి కొరత ఉండే ప్రాంతాల్లోని పాఠశాలలు, హాస్టళ్లను స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీల తాగునీటి ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎండిపోయిన లేదా పూడిక పేరుకుపోయిన బోర్‌ బావులను ఫ్లషింగ్‌ చేయించాలి.
అవసరమైతే మోటార్ల సామర్థ్యాన్ని పెంచడం లేదా పైపులను మరింత లోపలికి దించడం వంటి పనులు జనవరి లోపే పూర్తి కావాలి. స్కూళ్లు, హాస్టళ్లలో అనేక చోట్ల ఆర్వో ప్లాంట్లు చిన్నచిన్న మరమ్మతులతో మూలనపడ్డాయి. వాటన్నింటినీ గుర్తించి తక్షణమే పునరుద్ధరించాలి.
వ్యర్థ నీటి పునర్వినియోగంపై దృష్టిపెట్టాలి
హాస్టళ్లలో విద్యార్థులు స్నానాలు చేసిన నీరు, కిచెన్‌లో గిన్నెలు కడిగిన నీరు వృథాగా పోకుం డా.. వాటిని చిన్నపాటి ఫిల్టర్‌ బెడ్స్‌ ద్వారా మళ్లిం చి, టాయిలెట్ల ఫ్లషింగ్‌కు, క్యాంపస్‌ లోని మొక్కలకు ఉపయోగించాలి. దీనివల్ల తాగునీటిపై ఒత్తిడి 40శాతం వరకు తగ్గుతుంది. పాఠశాలల్లో విద్యార్థులు ట్యాప్స్‌ సరిగ్గా బంద్‌ చేయకపోవడం వల్ల వందలాది లీటర్ల తాగునీరు వృథా అవుతుంది. వీటికి బదులుగా వాటంతట అవే ఆగిపోయే
‘పుష్‌ -బటన్‌’ ట్యాప్స్‌ అమర్చాలి. రాబోయే రోజు ల్లో ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గ్లూకోజ్‌, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బోర్డు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద విద్యార్థుల కు చల్లని, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచే బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించాలి. ఎండల తీవ్రత పెరిగితే పాఠశాలల వేళలను (బడి సమయాలను) ముందే సవరించాలి.
ఎల్‌ నినో అనేది ప్రకృతి సృష్టించే విపత్తు. దీన్ని పూర్తిగా ఆపడం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. కానీ, దీని ప్రభావాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించడం కచ్చితంగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు లేదా హెచ్చరికలు ప్రజలను, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉండకూడదు.
ముందస్తు ప్రణాళిక లు, నీటి సంరక్షణ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ ద్వారానే మనం ఈ సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలం.
విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటం, ప్రజల సురక్షిత జీవనానికి హామీ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.

ట్యాగ్‌లు: Telangana water crisis