Telangana Jobs Alert: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆరోగ్య శాఖలో 2,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం..
టీ క్యూర్ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
Telangana Jobs Alert: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో దఫా భారీ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,929 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో 996 పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి మంజూరు చేయగా.. మిగిలిన 1,933 పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది. అనుమతులు పూర్తయిన వెంటనే త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 996 పోస్టుల వివరాలను పరిశీలిస్తే.. 198 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 308 ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2, 290 టెక్నీషియన్ ఖాళీలు ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు బయోమెడికల్ ఇంజనీర్లు, ఫిజియోథెరపిస్టులు, రేడియోగ్రాఫర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం (ANM) పోస్టులను కూడా నింపనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (IMS), వైద్య విద్య సంచాలకులు (DME), ఆయుష్, ఎంఎన్జే (MNJ) వంటి పలు కీలక విభాగాలలో ఈ నియామకాలను చేపట్టనున్నారు.
మరోవైపు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న 1,933 ఖాళీలలో 716 అసిస్టెంట్ ప్రొఫెసర్, 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 194 స్టాఫ్ నర్సు, 96 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. క్లియరెన్స్ రాగానే వీటికీ దరఖాస్తు ప్రక్రియలను ప్రారంభించనున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ద్వారా, మిగిలిన వైద్య విభాగపు పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (MRB) ద్వారా భర్తీ చేస్తారు.
ప్రస్తుతం ఎంఆర్బీ నేతృత్వంలో 2,711 పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశలో ఉంది. అందులో 1,931 ఎంపీహెచ్ఏ (మహిళ) పోస్టుల ప్రక్రియ పూర్తయి తుది జాబితా విడుదలకు సిద్ధంగా ఉండగా, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 4 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలన జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు ఒక్క వైద్యశాఖలోనే 13,401 పోస్టులను భర్తీ చేయడం గమనార్హం.