Skip to content
జాతీయం › వార్తలు

Maharashtra Politics: మళ్లీ ఒక్కటవనున్న ఎన్సీపీ ? శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల విలీనంపై ఉత్కంఠ.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది..

jagan 09 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Maharashtra Politics: మళ్లీ ఒక్కటవనున్న ఎన్సీపీ ? శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల విలీనంపై ఉత్కంఠ.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది..

NCP Politics

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన రెండు వర్గాల విలీనంపై చర్చలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అజిత్ పవార్ మరణాంతరం మారుతున్న రాజకీయ సమీకరణాలు, పార్టీ నాయకత్వంపై పెరుగుతున్న అంతర్గత కలహాలు ఈ చర్చలకు ఆజ్యం పోస్తున్నాయి. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య ఇటీవల జరుగుతున్న వరుస సమావేశాలు, ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అజిత్ పవార్ వర్గం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే వెల్లడించిన విషయాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అజిత్ పవార్ కనుక జీవించి ఉంటే, 2026 ఫిబ్రవరి 12 నాటికి రెండు ఎన్‌సిపి వర్గాలు విలీనమయ్యేవని ఆయన పేర్కొన్నారు. శరద్ పవార్ వర్గానికి చెందిన కీలక నాయకులతో చర్చలు జరిపిన అనంతరం అజిత్ పవార్ ఒక విలీన సూత్రాన్ని కూడా సిద్ధం చేశారని, అయితే 2026 జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించడంతో ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని తట్కరే వెల్లడించారు.

ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం.. కుటుంబ నియంత్రణపై అసంతృప్తి

ఇటీవల ఢిల్లీలో ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే సహా అజిత్ వర్గానికి చెందిన ఆరుగురు సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవడం కలకలం రేపింది. అజిత్ పవార్ మరణం తరువాత పార్టీ పగ్గాలు ఆయన భార్య సునేత్రా పవార్‌కు దక్కడం, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం జరిగాయి. దీనితో పాటు సంస్థాగత వ్యవహారాల్లో పార్థ్ పవార్ ప్రభావం పెరగడంపై ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే వంటి సీనియర్ నేతలు అసౌకర్యంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ మళ్లీ శరద్ పవార్ అనుభవజ్ఞులైన నాయకత్వంలో పనిచేయాలని వీరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సునేత్రా పవార్, పార్థ్ పవార్ వర్గం మాత్రం ఈ విలీనాన్ని తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆసుపత్రి భేటీలు, ప్రధాని మోదీ ఫోన్ కాల్

ఛాతీ నొప్పితో శరద్ పవార్ ఆసుపత్రిలో చేరిన సమయంలో అజిత్ వర్గ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ఆయనను పరామర్శించడం, డిశ్చార్జ్ అయిన తర్వాత పార్థ్ పవార్ సిల్వర్ ఓక్ నివాసానికి వెళ్లడం విలీన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అలాగే శరద్ పవార్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీయడం, దేశం గురించి ఆందోళన చెందవద్దని కోరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంతో సంబంధాలు మెరుగుపడే సంకేతంగా విశ్లేషకులు దీనిని భావిస్తున్నారు.

రోహిత్ పవార్ స్పష్టత.. బీజేపీ వ్యూహం

మరోవైపు, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎమ్మెల్యే రోహిత్ పవార్ విలీన వార్తలను ఖండిస్తూ, బీజేపీ తమ కుటుంబంలో, పార్టీలో విభజన తెచ్చిందని విమర్శించారు. తమ పార్టీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి భవిష్యత్ రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐక్య ఎన్‌సిపిని ఎన్‌డిఎలో చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల తర్వాతే ఎన్‌సిపి విలీనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.