ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు ?
Telanagana Paddy Cultivation
రచయిత: మేరుగు రాజయ్య
తెలంగాణలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ వరి పంటలు అక్టోబర్ చివరి నుండే కోతలు ప్రారంభమైనవి. ఇప్పటికే పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం అంటే వ్యయప్రయాసం అయింది. ప్రభుత్వ పరంగా సకాలంలో విధానపరమైన నిర్ణయాలు లేక వరి ధాన్యం రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోసిన వరి ధాన్యాన్ని నిల్వచేసుకునే సదుపాయం, ఆరబెట్టుకునే సౌకర్యాలు లేక తప్పని పరిస్థితులలో మధ్య దళారులకు అమ్ముచున్నారు.
మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ.95 అమ్ముచున్నారు. కానీ క్వింటాల్ వరి ధాన్యం రూ.2200లకే కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఏటా రెండుసార్లు ఖరీఫ్, రబీ సీజన్‌లకు వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తారు. ఆ మద్దతు ధరలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు జరుగుతాయి.
చాలాకాలంగా తెలంగాణలో ఐకెపి (ఇందిరా క్రాంతి పథకం) సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నవి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్‌ఈఆర్‌పీ) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. గ్రామ స్థాయిలో రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఐకెపి (ఇందిరా క్రాంతి పథం) సెంటర్ల వలన రైతులకే కాకుండా దేశ ప్రయోజనాలు కూడా ఉన్నవి. నిత్యావసర వస్తువుల చట్టం 1955 సెక్షన్ 3 ప్రకారం భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిన అధికారాలను అనుసరించి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్స్, డీలర్లు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని లెవీ కింద 75 శాతం ‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌సిఐ)కు సరఫరా చేయాలి. ఈ మిల్లింగ్ లెవీ పథకం రైతులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటుగా ‘నేషనల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్’ (ఎన్‌పిడిఎస్) ద్వారా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం చౌకధరల దుకాణాల్లో ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కరువు కాటకాలను ఎదుర్కోవడానికి ఆహార భద్రత గురించి నిల్వ చేయడం జరుగుతుంది. ఇక రైస్ మిల్లర్స్, డీలర్లు 75 శాతం లెవీ బియ్యం కింద ‘ఎఫ్‌సిఐ’కి ఇవ్వగా మిగిలిన 25 శాతం బియ్యాన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇస్తూ బహిరంగ మార్కెట్‌లోను, ఇతర రాష్ట్రాల్లోను అమ్ముకునే అవకాశం ఉంది. కాని రైతులకు మాత్రం ధాన్యం కొనుగోలులో రూపొందించిన విధానాలు కఠినంగా ఉన్నవి. ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించిన నాణ్యత, ప్రమాణాలు కర్భనం/ఇన్ ఆర్గానిక్ మరియు సేంద్రీయత/ఆర్గానిక్ 1.0 శాతం ఉండాలి. దెబ్బతిన్న, రంగు మారిన, మొలకెత్తిన, వీవిల్డ్ ధాన్యాలు 3.0 శాతం, అపరిపక్వమైన, కుంచుకుపోయిన, ముడుచుకున్న ధాన్యాలు 3.0 శాతం, దిగువతరగతికి వచ్చిన ధాన్యాలు 7.0 శాతం, తేమ 17.0 శాతం పరిమితులను విధించారు. వడ్ల నుండి వచ్చిన బియ్యం తీపిగా, పొడిగా, ఆరోగ్యంగా మంచి ఆహార విలువ, ఏకరీతి రంగు, మంచి పరిమాణం కలిగి ఉండాలి. అలాగే రైతులు ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే అధికార యంత్రాంగం అందుబాటులో తప్పకుండా ఉండాలి.
2025 తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 147 లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. భారత్‌లో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. బియ్యం ఎగుమతులలో ప్రపంచంలోనే భారత్‌కు అగ్రస్థానం ఉంది. 2024లో బియ్యం ఎగుమతి ద్వారా 12.47 బిలియన్ డాలర్లకు పైగా (రూ.1,04,000 కోట్లు) విదేశీ మారకాన్ని ఆర్జించింది. 2026 ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య కాలంలో రూ.45,739 కోట్ల ఆదాయాన్ని పొందింది. రైతుల వ్యవసాయం వలన ప్రజలకు ఆహార భద్రతతో పాటుగా ఎగుమతుల ద్వారా కూడా విలువైన విదేశీ మారకంతో దేశాభివృద్ధి జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగానికి, రైతులకు సమయానుకూలంగా, ముందస్తుగా, ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పండిన వరి ఇతర ధాన్యాలకు కనీస మద్దతు ధరలతో కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్‌ఎక్యూ), నాన్ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నిర్ణయం, తూకంలో కోతలు లేకుండా, సత్వర పైకం చెల్లింపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కూడా చేయాలి. ఐకెపి కేంద్రాలలో కూడా రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు ‘కస్టోడియన్స్’గా విధులను నిర్వహింపచేసి రైతులకు సంరక్షకులుగా ఉండాలి. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (డిఆర్‌డిఎ), జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డిఒలు, ఎమ్మార్వోల పర్యవేక్షణలను సాగించాలి.
రోజువారీగా పౌర సరఫరాల కమిషనర్ వీడియో సమావేశాలను నిర్వహిస్తూ పురమాయించాలి. రైతులకు వరి ధాన్యం నింపుకోవడానికి గోనె సంచులను, వర్షం నుండి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్‌లను అందుబాటులో ఉంచాలి. లోడింగ్ అన్‌లోడింగ్ సౌకర్యాలను, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం మొదలగు కష్టనష్టాలను విన్నవించుకోవడానికి ‘హెల్ప్‌లైన్’ నంబర్‌ను ఇచ్చి ఫోన్ చేసే రైతులకు సహకరించే విధంగా ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ వ్యాప్తంగా వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.