Skip to content
బిజినెస్ › వార్తలు

విషవాయువుల చెరలో హోటల్‌ వంట కార్మికులు

Prajapaksham 18 Nov 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
విషవాయువుల చెరలో హోటల్‌ వంట కార్మికులు

కడుపు నింపే.. అన్నం వండే చేతులే వేడికి, విషవాయువులకు బలవుతుంటే: ఆ కార్మికుల కన్నీళ్లను తుడిచేదెవరు?. నలుగురికి రుచికరమైన భోజనాన్ని అందించే హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలల్లో పనిచేసే కార్మికుల జీవితాలు మాత్రం పొగ, సెగ, ఉక్కపోత మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఆహార పరిశ్రమలో పనిచేసే వీరికి కనీస ఆరోగ్య రక్షణ, సురక్షిత పని వాతావరణం, ఉద్యోగ భద్రత ఎంతవరకు అందుతున్నాయన్నది ప్రశ్నార్థకం.

మన దేశంలో కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. వివిధ అంచనాల ప్రకారం, దేశంలోని మొత్తం కార్మికుల్లో సుమారు 90 శాతానికి పైగా ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. వీరిలో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నపాటి ఆహార విక్రయ కేంద్రాలు, నిర్మాణ రంగం, వ్యవసాయం, గృహ కార్మికులు తదితర తరగతులున్నారు. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు కొంతమేరకు వేతన భద్రత, సెలవులు, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు అందే అవకాశం ఉండగా, అసంఘటిత కార్మికుల్లో చాలామందికి అలాంటి సదుపాయాలు అందడం లేదు.

కార్మికుల హక్కుల కోసం ట్రేడ్‌ యూనియన్లు ఎన్నో పోరాటాలు చేసి చట్టబద్ధమైన ప్రయోజనాలను సాధించాయి. అయితే, అసంఘటిత కార్మికులకు అదే స్థాయిలో ప్రాతినిధ్యం, సంఘటిత శక్తి, న్యాయపరమైన అండ లభించడం లేదు. సమస్యలు ఎదురైనప్పుడు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అనేక చోట్ల కనిపిస్తున్నాయి. కనీస వేతనం, నిర్ణీత పని గంటలు, వారాంతపు సెలవు, ఓవర్‌టైమ్‌ వేతనం, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా వంటి హక్కులు అందరికీ అందాల్సి ఉన్నా, వాటి అమలులో లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన విధానాలు ప్రకటనలకే పరిమితం కాకూడదు. కేంద్ర ప్రభుత్వం 44 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా సమీకరించింది. వీటి ద్వారా కార్మికులకు ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కార్మిక సంఘాలు ఉద్యోగ భద్రత, సమ్మె హక్కు, సామాజిక భద్రత, యాజమాన్యాల బాధ్యతల విషయంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల హక్కులు క్షీణించకుండా, మారుతున్న చట్టాల అమలులో వారి ప్రయోజనాలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

గ్యాస్‌ వంటశాలల్లో విషవాయువులు

నగరాలు, పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలల్లో పనిచేసే కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై వెలువడిన తాజా అధ్యయనం ఆందోళనకరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. గ్యాస్‌ ఆధారిత వంట పరికరాల నుంచి వెలువడే వేడి, వాయు కాలుష్యం కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తగిన వెంటిలేషన్‌, పొగను బయటకు పంపే వ్యవస్థలు ఉన్నచోట్ల కూడా కొన్ని వంటశాలల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయులకు చేరుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

పిఎస్‌ఇ హెల్తీ ఎనర్జీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ఎన్‌వైయు గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ తదితర సంస్థల పరిశోధకులు వాణిజ్య వంటశాలల్లో ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యతపై అధ్యయనాలు నిర్వహించారు. గ్యాస్‌ స్టవ్‌ల వినియోగం వల్ల నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య కారకాలు గాలిలో పెరిగే ప్రమాదం ఉందని, కొన్ని పరిస్థితుల్లో బెంజీన్‌ వంటి హానికర పదార్థాల ఉనికి కూడా ఆందోళన కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తగిన గాలి ప్రసరణ లేని వంటశాలల్లో పనిచేసే సిబ్బందికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.

అధ్యయనంలో పరిశీలించిన వంటశాలల్లో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌ను దాటినట్లు, కొన్ని సందర్భాల్లో 37 డిగ్రీలకుపైగా నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి, అత్యధికంగా 50 డిగ్రీలకు చేరినట్లు పేర్కొన్నాయి. వంటశాలల్లో మండే గ్యాస్‌ మంటలు, నిరంతర వంట ప్రక్రియ, వేడి గాలిని బయటకు పంపే వ్యవస్థల లోపాలు ఈ పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో గంటల తరబడి పనిచేయడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోవడం, అలసట, తలతిరగడం, వేడి సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది.

నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వంటి వాయు కాలుష్య కారకాలకు నిరంతరం గురికావడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావచ్చు. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురికావడం ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. వంటశాలల్లో రద్దీ తక్కువగా ఉండే సమయాల్లోనూ కాలుష్యం అధికంగా ఉంటే, ఉదయం శుభ్రపరిచే సిబ్బంది, ముందస్తు తయారీ పనులు చేసే కార్మికులు కూడా ముప్పును ఎదుర్కొంటారు.

ప్రభుత్వాలు హోటళ్లు, రెస్టారెంట్లలో కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించాలి. వంటశాలల ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత, అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లు, విద్యుత్‌ పరికరాల భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఉల్లంఘనలకు పాల్పడే యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో చిన్న వ్యాపార సంస్థలు సురక్షిత పరికరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సాంకేతిక సహాయం అందించాలి.

అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించే చర్యలను వేగవంతం చేయాలి. కార్మికుల నమోదు, సంక్షేమ పథకాలపై అవగాహన, ఫిర్యాదుల పరిష్కారానికి సులభమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హోటల్‌ కార్మికులు తమ సమస్యలను నిర్భయంగా వెల్లడించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఉపయోగపడతాయి. సంఘటిత కార్మిక సంఘాలు కూడా తమ పరిధిని విస్తరించి, అసంఘటిత కార్మికులను సంఘటితం చేయడానికి ముందుకు రావాలి. వారి సమస్యలను తమ పోరాటాల్లో భాగం చేసుకోవాలి.

ట్యాగ్‌లు: business news