Skip to content
తెలంగాణ › వార్తలు

TG RERA: రియల్ ఎస్టేట్ సంస్థలకు టీజీ రెరా భారీ షాక్.. ఎనిమిది నిర్మాణ సంస్థలపై కొరడా.. కొనుగోలుదారులకు రూ. కోట్లలో రిఫండ్, జరిమానాలు

jagan 17 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
TG RERA: రియల్ ఎస్టేట్ సంస్థలకు టీజీ రెరా భారీ షాక్.. ఎనిమిది నిర్మాణ సంస్థలపై కొరడా.. కొనుగోలుదారులకు రూ. కోట్లలో రిఫండ్, జరిమానాలు

TG RERA

TG RERA: తెలంగాణలో నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) మరోసారి కొరడా ఝుళిపించింది. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం, ముందస్తు అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల విక్రయాలు, సకాలంలో ఫ్లాట్ల అప్పగింతలో వైఫల్యాలపై తీవ్రంగా స్పందించిన రెరా.. ఎనిమిది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కొనుగోలుదారులకు భారీగా నగదును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, అలాగే నిబంధనల ఉల్లంఘనకు గాను జరిమానాలు చెల్లించాలని స్పష్టం చేసింది.

టీజీ రెరా ఆదేశాల పూర్తి వివరాలు:

సనాలి ఐటీ పార్క్స్ (మంచిరేవుల): మంచిరేవులలోని ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టుకు సంబంధించి రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే అమ్మకాలు, బుకింగ్స్ చేపట్టినందుకు సనాలి ఐటీ పార్క్స్ సంస్థకు రూ.25 లక్షల భారీ జరిమానా విధించింది. అనుమతులు లేకుండా ఎలాంటి విక్రయాలు జరపవద్దని స్పష్టం చేసింది.

శ్రీ ఆదిత్య స్క్వేర్స్: ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడంలో విఫలమైనందున బాధిత కొనుగోలుదారుడికి రూ.17 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని రెరా ఆదేశించింది.

త్రిపుర కన్‌స్ట్రక్షన్స్: నిర్మాణ జాప్యం కారణంగా కొనుగోలుదారుడు చెల్లించిన రూ.41.85 లక్షల మొత్తాన్ని పూర్తిగా రిఫండ్ చేయాలని స్పష్టం చేసింది.

వాసవి రియల్టర్స్: కొనుగోలుదారుడికి చెల్లించాల్సిన రూ.49.50 లక్షలపై 2025 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 10.85 శాతం వార్షిక వడ్డీని కలిపి చెల్లించాలని రెరా తీర్పునిచ్చింది.

ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్: సకాలంలో ఫ్లాట్ అప్పగించనందున కొనుగోలుదారుడికి రూ.27.16 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టు (మియాపూర్): మియాపూర్‌లోని అరైన్ ఎమరాల్డ్ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను తక్షణమే కొనుగోలుదారుడికి తిరిగి అప్పగించాలని సంబంధిత నిర్మాణ సంస్థను రెరా ఆదేశించింది. ఈ క్రమంలో రూ.6.58 లక్షల బకాయిలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన వాదనలను అథారిటీ పూర్తిగా తిరస్కరించింది.

బీవీఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్: బాధిత కొనుగోలుదారుడికి రూ.7 లక్షల మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.

భువంతేజ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: ప్రాజెక్టు అప్పగింతలో వైఫల్యం కారణంగా కొనుగోలుదారుడికి రూ.26 లక్షలు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.

ఒకవేళ నిర్దేశిత గడువులోగా ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే, రెరా చట్టంలోని సెక్షన్ 63 కింద సదరు నిర్మాణ సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, రోజువారీ అదనపు జరిమానాలు విధిస్తామని టీజీ రెరా తీవ్రంగా హెచ్చరించింది.