Skip to content
జాతీయం › వార్తలు

ఓటు చోరీ పై కాంగ్రెస్ మరో భారీ యాక్షన్ ప్లాన్.. ప్రతి పోలింగ్ బూత్‌కు ఓటు రక్షక్ నియామకం..

Krishna Rao 17 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఓటు చోరీ పై కాంగ్రెస్ మరో భారీ యాక్షన్ ప్లాన్.. ప్రతి పోలింగ్ బూత్‌కు ఓటు రక్షక్ నియామకం..

Congress

దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై తన పోరాటాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించిన వ్యవహారంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టడంతో పాటు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక కార్యకర్తను నియమించి, తొలగించిన ఓట్ల వివరాలను పరిశీలించనుంది. అనంతరం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు ఈ వివరాలను వివరించనుంది.

నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయాల కేంద్రంగా ‘సంవిధాన్ రక్షా’ పేరుతో ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలతో రాజ్యాంగ పరిరక్షణ, ఓటు హక్కు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

మరోవైపు, ఇప్పటికే ప్రకటించిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 25, 26 తేదీల్లో జరగాల్సిన నాలుగో దశ కార్యక్రమాలను వాయిదా వేసింది. వాటికి బదులుగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలను ప్రధాన కార్యక్రమంగా చేపట్టనుంది.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్య నేతలకు సర్క్యులర్ జారీ చేశారు.

ప్రతి బూత్‌కు ఒక ఓటు రక్షక్

ఓటర్ల జాబితాలో తొలగించిన పేర్లను పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్‌కు కనీసం ఒక ‘ఓటు రక్షక్’ను నియమించాలని మండల అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది.

బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ కమిటీ సభ్యులు, యువజన విభాగాలు, పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలతో పాటు ప్రచార పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న సామాన్య పౌరులను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు.

నవంబర్ 22 నుంచి 30 వరకు ఈ ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. తొలగించిన ఓట్ల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, రోజువారీ పురోగతిని నమోదు చేయాలని పార్టీ ఆదేశించింది. ఈ ప్రక్రియను మండల అధ్యక్షులు ప్రతిరోజూ పర్యవేక్షించనున్నారు.

గ్రామాల్లో ఓటు బచావో.. దేశ్ బచావో చౌపాల్స్

బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత గ్రామస్థాయిలో ప్రజా సమావేశాలు నిర్వహించనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 15 వరకు ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ పేరుతో చౌపాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ సమావేశాల్లో ఓటర్ల జాబితా పరిశీలనలో వెలుగుచూసిన అంశాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటు హక్కు పరిరక్షణ వంటి అంశాలపై చర్చించనుంది.

నవంబర్ 22లోగా శిక్షణ పూర్తి చేయాలి

ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ముందుగానే పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నవంబర్ 17లోగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు జిల్లా కమిటీలతో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో ఎంతమంది కార్యకర్తలను రంగంలోకి దించాలి? వాలంటీర్లను ఎలా నియమించాలి? వారికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి? అనే అంశాలపై ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారు.

నవంబర్ 22లోగా జిల్లా స్థాయి సమావేశాలు, వాలంటీర్ల నియామకాలు, కార్యకర్తల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్‌కు శిక్షణ పొందిన వాలంటీర్‌ను నియమించినట్లు నవంబర్ 21 సాయంత్రంలోగా జిల్లా కమిటీలకు మండల అధ్యక్షులు సమాచారం ఇవ్వాలి.

ఇందుకోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా రూపొందించిన www.iamvoterakshak.in పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలి? రోజువారీ తనిఖీల వివరాలను అందులో ఎలా నమోదు చేయాలి? అనే విషయాలపై కూడా కార్యకర్తలకు అవగాహన కల్పించనున్నారు.

అంబేడ్కర్, గాంధీ విగ్రహాల వద్ద నుంచి ర్యాలీలు

నవంబర్ 26న నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ కొన్ని సూచనలు చేసింది. రాష్ట్ర రాజధానుల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లేదా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నుంచి ర్యాలీలను ప్రారంభించాలని తెలిపింది.

ముందుగా ఆయా నేతల విగ్రహాలకు నివాళులర్పించి, రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదవాలి. రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేసిన అనంతరం మరో ముఖ్యమైన ప్రాంతం వరకు ర్యాలీగా వెళ్లాలని సూచించింది.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలు, పార్టీ అనుబంధ సంఘాలు, వివిధ విభాగాలకు బాధ్యతలు అప్పగించనున్నారు. సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, బూత్ పర్యటనలు, ర్యాలీలు, గ్రామసభలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అదే రోజు సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కూడా పార్టీ నేతలకు సూచించింది.

ఇండియా కూటమి ర్యాలీ తర్వాత మరింత దూకుడు

ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతీకాత్మకంగా ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.

ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్‌కు ఓటు రక్షక్‌ను నియమించడం, తొలగించిన ఓట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన, గ్రామాల్లో ప్రజా సమావేశాల నిర్వహణ ద్వారా ఈ అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది.

ట్యాగ్‌లు: Congress