Sammakka Sagar Project: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు త్వరగా ఎన్ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంను కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
Bharat Summit
Sammakka Sagar Project: తెలంగాణ సాగునీటి రంగానికి అత్యంత కీలకమైన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులను తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి, పూర్తిస్థాయి నీటి నిల్వకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కోరారు
రాబోయే రోజుల్లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో తాగు, సాగునీటి అవసరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమ్మక్క సాగర్ బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సహా ఇతర విభాగాల నుంచి రావాల్సిన పెండింగ్ అనుమతుల విషయంలోనూ తగిన సహకారం అందించాలని కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అత్యంత సానుకూలంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన ఎన్‌వోసీ జారీతో పాటు తదుపరి అనుమతుల విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతులకు మార్గం సుగమమైనట్లయింది.