SBI Faces Daily Penalty: ఏడేళ్లుగా ఒరిజినల్ ఆస్తి పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐ.. రోజుకు రూ.5 వేల జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్..
Banking Giant SBI Agrees to Shift to Alternative Location
SBI Faces Daily Penalty: గృహ రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ, ఏడేళ్లకు పైగా ఆస్తి అసలు పత్రాలను (ఒరిజినల్ సేల్ డీడ్) తిరిగి ఇవ్వడంలో విఫలమైన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI)కు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లా వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడికి రోజుకు రూ. 5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అలీగఢ్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు గుల్వీర్‌సింగ్ చౌహాన్ 1997లో స్థానిక ఎస్‌బీఐ సిటీ బ్రాంచ్ నుంచి గృహ రుణం తీసుకున్నారు. రుణ భద్రత కోసం తన ఇంటికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్‌ను బ్యాంకు వద్ద డిపాజిట్ చేశారు. 2019 మే 13 నాటికి ఆయన తన రుణాన్ని వడ్డీతో సహా పూర్తిగా చెల్లించేశారు.
రుణ ఖాతా మూసివేసినట్లు బ్యాంకు 2020 ఫిబ్రవరి 13న ‘నో డ్యూ సర్టిఫికేట్’ (No Dues Certificate) కూడా జారీ చేసింది. అయితే బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన ఆస్తి అసలు పత్రాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. పత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదంటూ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో బాధితుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు దస్తావేజులు లేకపోవడంతో ఆస్తి యాజమాన్య హక్కులు నిరూపించుకోవడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా మరో బ్యాంకులో కొత్త రుణం పొందడం అసాధ్యంగా మారిందని పేర్కొంటూ ఆయన 2023 జూన్ 13న వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా గుల్వీర్‌సింగ్ రుణం తీసుకుని, అసలు పత్రాలను తమ వద్ద జమ చేసిన మాట వాస్తవమేనని ఎస్‌బీఐ అంగీకరించింది. రుణ ఖాతా మూసివేసినట్లు బ్యాంకు జారీ చేసిన లేఖను పరిశీలించిన కమిషన్ ఛైర్మన్ హస్నైన్ ఖురేషి, సభ్యురాలు పూర్ణిమా సింగ్ రాజ్‌పుత్‌లతో కూడిన ధర్మాసనం, పూర్తి రుణం చెల్లించిన తర్వాత కూడా ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వకపోవడాన్ని తీవ్రమైన సేవా లోపంగా (Deficiency in Service) పరిగణించింది.
కమిషన్ జారీ చేసిన ప్రధాన ఆదేశాలు:
అసలు పత్రాల అప్పగింత: బాధితుడి ఒరిజినల్ సేల్ డీడ్‌ను తక్షణమే తిరిగి ఇవ్వాలి.
రోజువారీ జరిమానా: రుణం తీరిన తేదీ (2019 మే 13) నుంచి అసలు పత్రాలను బాధితుడి చేతికి అప్పగించే రోజు వరకు రోజుకు రూ. 5,000 చొప్పున పరిహారం చెల్లించాలి.
న్యాయ ఖర్చులు: కేసు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ. 10,000 బాధితుడికి చెల్లించాలి.
గడువు & హెచ్చరిక: ఈ ఆదేశాలను అమలు చేయడానికి బ్యాంకుకు 45 రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా ఆదేశాలు పాటించకపోతే వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్ 72 కింద బ్యాంకు అధికారులపై ప్రాసిక్యూషన్ (చట్టపరమైన చర్యలు) చేపట్టాల్సి వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.