ED Raids Rekha Naik’s Residences: రూ.40.96 కోట్ల సీఎంఆర్ కుంభకోణంలో ఈడీ దూకుడు.. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ నివాసాల్లో ఏకకాలంలో ముమ్మర సోదాలు.. ఖానాపూర్‌లో భారీగా పోలీసు బలగాల మోహరింపు..
Rekha Naik
ED Raids Rekha Naik’s Residences: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఖానాపూర్‌లోని ఆమె నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇళ్లపై ఈడీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. స్థానిక పోలీసు, విజిలెన్స్ బలగాల పటిష్ఠ భద్రత నడుమ అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఖానాపూర్ మండలం సత్తెనపల్లి వద్ద మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చెందిన ‘ఏఆర్‌ఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్’ (ARS Agro Industries) రైస్ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ నిమిత్తం పెద్ద ఎత్తున ధాన్యాన్ని కేటాయించింది. అయితే, 2022–23, 2023–24, , 2024–25 రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా భారీ మొత్తంలో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా అక్రమంగా మళ్లించిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.40.96 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు లెక్కగట్టారు.
గత ఆగస్టు నెలలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సత్తెనపల్లిలోని రైస్ మిల్లులో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు స్పష్టమైంది. దీనిపై నిర్మల్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, ఇందులో భారీ ఎత్తున నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానించిన ఈడీ అధికారులు తాజాగా రంగంలోకి దిగి సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఖానాపూర్‌లోని రేఖానాయక్ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించగా, తనిఖీలు , విచారణ పూర్తయిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.