రియల్ ఎస్టేట్ రంగానికి డోకా లేదు… గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: మంత్రి పొంగులేటి
రియల్ ఎస్టేట్ రంగానికి డోకా లేదు… గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి అసత్యాలను నమ్మాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో సుమారు 15 నుంచి 20 శాతం రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందగా, ఫ్లాట్ల విక్రయాల్లో ఏకంగా 40 శాతం వరకు వృద్ధి నమోదైందన్నారు.
గత పదేళ్ల పాలనతో పోలిస్తే ఈ రెండున్నర ఏళ్లలో రెసిడెన్షియల్ మార్కెట్ అద్భుతంగా వృద్ధి చెందిందని, రిజిస్ట్రేషన్ శాఖలో నానాటికీ పెరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్యే దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రభుత్వంపై కావాలని బురద జల్లేందుకు చేస్తున్న ప్రచారాలను పక్కనబెట్టాలని ప్రజలను ఆయన కోరారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్ర బిందువు ‘హైదరాబాద్’
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దూరదృష్టి కారణంగానే ఐటీ, ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి నిర్మాణాలు జరిగి హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారని, నగరం పెట్టుబడుల ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు.
రూ.7 వేల కోట్లతో ‘మూసీ’ ప్రాజెక్ట్ టెండర్లు
హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోందని మంత్రి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణకు రూ.7 వేల కోట్ల అంచనాతో చేపడుతున్న మూసీ ప్రాజెక్ట్ తొలి విడత (28 కిలోమీటర్లు) పనులకు వారం, పది రోజుల్లో టెండర్లు ఆహ్వానిస్తామని చెప్పారు. మెట్రో విస్తరణలో భాగంగా పాతబస్తీని కలుపుతూ రూ.24 వేల కోట్ల వ్యయంతో 76 కిలోమీటర్ల మేర రెండో విడత మెట్రో విస్తరణ చేపట్టనున్నామన్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్‌ను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయన్నారు.
భూభారతి చట్టం, పేదల ఇళ్లకు ప్రాధాన్యం
భూములకు భద్రత కల్పించేందుకు ‘భూభారతి’ చట్టాన్ని తీసుకొచ్చామని, అందులోని చిన్నపాటి సాఫ్ట్‌వేర్ సమస్యలను 15–20 రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం ఇస్తూనే, లక్ష ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణతో పాటు, రియల్ ఎస్టేట్ ప్రతినిధుల కోరిక మేరకు ఫాస్ట్‌ట్రాక్ అనుమతుల సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.