Skip to content
జాతీయం వార్తలు

పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?

Prajapaksham 10 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?

పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?

రచయిత: రాజు కుమార్‌

అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్‌ కలలు కంటోంది. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు దాటినా, మన సమాజాన్ని పీడిస్తున్న ఒక అమానవీయ వాస్తవం మాత్రం ఇంకా పూర్తిగా అంతం కాలేదు. అదే మానవ మలమూత్రాలను పారిశుద్ధ్య కార్మికులు స్వయంగా చేతులతో శుభ్రపరిచే పని. ఈ పనిని చట్టం నిషేధించింది. మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను మనుషులు ప్రమాదకర పరిస్థితుల్లో శుభ్రం చేయకుండా యాంత్రీకరణ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా పారిశుద్ధ్య కార్మికులు కాలువల్లోకి దిగి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

ఒకవైపు దేశంలోని అన్ని జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో మానవ మలమూత్రాలను చేతులతో శుభ్రం చేసే ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, జమ్మూ కశ్మీర్‌లలో కనీసం 46 జిల్లాల్లో ఇప్పటికీ పొడి మరుగుదొడ్లలోని మలాన్ని చేతులతో తొలగిస్తున్నారని సఫాయి కర్మచారి ఆందోళన్‌ (ఎస్‌కెఎ) చెబుతోంది. ప్రభుత్వ గణాంకాలకు, కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవానికి మధ్య భారీ వ్యత్యాసం అనేకానేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. సమస్యను నిర్మూలించామా? లేక గణాంకాల్లో కనిపించకుండా చేశామా? అనేది ప్రధాన ప్రశ్న.

ఢిల్లీలో ఎస్‌కెఎ ప్రారంభించిన ‘ఇండియా @ 80: ఎండ్‌ మాన్యువల్‌ స్కావెంజింగ్‌’ ప్రచారంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు తమ అనుభవాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన 70 ఏళ్ల మూసీదేవి తన జీవితంలో దాదాపు మొత్తం ఈ పనిలోనే గడిచిపోయిందని చెప్పారు. వయసు మీదపడినా ఇప్పటికీ మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి తనను పిలుస్తున్నారని ఆమె వెల్లడించారు.

ఈ వాంగ్మూలాలపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధూలియా స్పందించారు. ఈ ఆచారం పూర్తిగా నిలిచిపోయిందని, ఇప్పుడు అసలు కొనసాగడం లేదని ప్రభుత్వ అధికారులు చెప్పడమే ఈ సమస్యపై పోరాటంలో అతిపెద్ద అవరోధాల్లో ఒకటని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు మరో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి. లోకూర్‌ కూడా ప్రభుత్వ యంత్రాంగం సమస్య ఉనికినే నిరాకరించడం తీవ్రమైన అంశమని అన్నారు. ఇప్పటికీ ఎక్కడైనా పొడి మరుగుదొడ్లు ఉంటే వాటిని తొలగించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండాలని, స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో ఇది కీలక భాగం కావాలని ఆయన సూచించారు.

చట్టాలు చేయడం ఒక్కటే ఈ సమస్యను పరిష్కరించదని, ఈ పనిని కొనసాగించేలా చేస్తున్న కుల ఆధారిత సామాజిక ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం, సమాజం రెండూ మార్చుకోవాలని పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అంజనా ప్రకాశ్‌ అన్నారు.

నిజానికి మలమూత్రాలను కార్మికులు స్వయంగా శుభ్రపరిచే పనిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం 1993లోనే చట్టం తీసుకొచ్చింది. 2013లో మరింత సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చి మానవ మలం శుభ్రపరిచే పనిని నిషేధించింది. ఈ పనికి మనుషులను నియమించడాన్ని శిక్షార్హమైన నేరంగా కూడా ప్రకటించింది.

2013లో, ఆ తర్వాత 2018లో నిర్వహించిన ప్రభుత్వ సర్వేల్లో దేశవ్యాప్తంగా 58,098 మంది మాన్యువల్‌ స్కావెంజర్లను గుర్తించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కొత్త సర్వేను తెరపైకి తెచ్చి, అలాంటి పనులు చేసే పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరు కూడా కనిపించలేదని చెబుతోంది. అదే సమయంలో ఆ పనిలో ఉన్నామని కార్మికులు స్వయంగా చెబుతున్నారు. మరి అసలు సమస్య ఎక్కడుంది?

అసలు చట్టం ఉందా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న కాదు. చట్టాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారు? ప్రభుత్వ సర్వేలు నేలమీద ఉన్న వాస్తవ పరిస్థితిని ఎంతవరకు నమోదు చేస్తున్నాయి? అన్నదే కీలక ప్రశ్న.

ఎస్‌కెఎ జాతీయ కన్వీనర్‌ బెజవాడ విల్సన్‌ మూడు దశాబ్దాలకు పైగా ఈ సమస్యపై పోరాడుతున్నారు. ఈ కాలంలో పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చినప్పటికీ, పొడి మరుగుదొడ్లను చేతులతో శుభ్రం చేసే పని ఇంకా కొనసాగుతోందని ఆయన చెబుతున్నారు. సంస్థ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా ప్రభుత్వం మరోసారి సమగ్ర సర్వే నిర్వహించి, ఈ ఆచారం ఎక్కడ కొనసాగుతున్నా అక్కడ నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

మాన్యువల్‌ స్కావెంజింగ్‌ సమస్యకు మరో అత్యంత విషాదకరమైన కోణం ఉంది. మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ ఎంతోమంది పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 జనవరి నుంచి 2026 జూన్‌ వరకు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేస్తూ 332 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారు.

మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను ఒక కేటగిరీగా, ప్రమాదకర పరిస్థితుల్లో మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయడాన్ని మరో కేటగిరీగా కేంద్రం పరిగణిస్తోంది. కొత్తగా మాన్యువల్‌ స్కావెంజింగ్‌ కేసులు కనిపించలేదని వాదిస్తున్నది.

మలమూత్రాలను శుభ్రం చేసే క్రమంలో పలువురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందడంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. డాక్టర్‌ బలరాం సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా 2026 జులై 27న జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాలువల్లో మరణాలు కొనసాగుతుండటంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టు ముందు ఉంచిన పార్లమెంటరీ గణాంకాల ప్రకారం 2024లో 54 మంది, 2025లో 46 మంది మరణించారు. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలని ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాధ్యతను కాంట్రాక్టర్లపైకి నెట్టడం ద్వారా రాష్ట్రాలు తమ జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేవని కూడా కోర్టు స్పష్టం చేసింది.

ఇది అత్యంత కీలకమైన అంశం. ‘సదరు విభాగం కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టర్‌ కార్మికుడిని పంపించాడు. ప్రమాదం జరిగింది. ఇందులో కాంట్రాక్టర్‌దే బాధ్యత’ అని చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటే, ప్రాణం కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి న్యాయం ఎక్కడ లభిస్తుంది?

2023 అక్టోబరులోనే సుప్రీంకోర్టు మురుగునీటి కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులను ప్రమాదకర పద్ధతుల్లో శుభ్రం చేయడాన్ని అరికట్టేందుకు అనేక ఆదేశాలు జారీ చేసింది. కాలువ శుభ్రం చేస్తూ ఒక కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

పరిహారం అవసరం. కానీ పరిహారం అనేది ఒక ప్రాణానికి విలువ కట్టే పద్ధతి కాదు. మరణం సంభవించిన తర్వాత కుటుంబానికి డబ్బు ఇవ్వడం కంటే, ఆ మరణం సంభవించకుండా చూడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఒక కార్మికుడు కాలువలోకి దిగాల్సిన అవసరమే లేకుండా వ్యవస్థను రూపొందించాలి.

2023-24లో ప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ఫర్‌ మెకనైజ్డ్‌ శానిటేషన్‌ ఎకోసిస్టమ్‌ (ఎన్‌ఎఎంఎస్‌టిఇ/ నమస్తే) పథకాన్ని ప్రారంభించింది. ప్రమాదకరమైన మానవ శ్రమ స్థానంలో యాంత్రీకృత పారిశుధ్య వ్యవస్థను తీసుకురావడం, పారిశుద్ధ్య కార్మికుల భద్రతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం.

అయితే, పథకాలు రూపొందించడం ఒక దశ మాత్రమే. వాటిని ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మురుగునీటి కాలువ వద్ద అమలు చేయడం అసలు పరీక్ష. కాలువలోకి మనిషిని పంపకుండా యంత్రంతో శుభ్రం చేయగల సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు, ఇంకా మనుషులను ఎందుకు పంపుతున్నారు? పరికరాలు ఉన్నా వాటిని ఉపయోగించడం లేదంటే ఎందుకు? కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ ఎవరిది? భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యత ఎవరిది? ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం.

భారత్‌ స్వాతంత్య్రం సాధించి ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతోంది. ఈ సమయంలో దేశం అంతరిక్షంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది.

అయితే, అదే దేశంలో ఒక మనిషి మరో మనిషి మలాన్ని చేతులతో తొలగించాల్సి వస్తే, లేదా మురుగునీటి కాలువలోకి దిగి ప్రాణాలు కోల్పోతే, మన అభివృద్ధి నమూనాను మరోసారి పరిశీలించక తప్పదు.

ఇప్పుడు చర్చ కేవలం ప్రభుత్వ గణాంకాల్లో ఎంతమంది మాన్యువల్‌ స్కావెంజర్లు ఉన్నారనే అంశంపై కాకుండా, ఎన్ని జిల్లాలు ఈ ఆచారం నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకున్నాయనే విషయంపై చర్చ జరగాలి. పారిశుద్ధ్య కార్మికులతో ప్రభుత్వం నేరుగా మాట్లాడాలి. ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలి. పొడి మరుగుదొడ్లు ఎక్కడైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి. మానవ మలాన్ని చేతులతో తొలగించే పనికి శాశ్వతంగా ముగింపు పలకాలి.

ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, ముందుగా మానవుడి మానవ మలాన్ని చేతులతో శుభ్రం చేయించే ఈ అమానవీయ వ్యవస్థకు ముగింపు పలకాలి.

(ఐపిఎ సౌజన్యంతో)

ట్యాగ్‌లు: Indian Politics