Pinarayi Vijayan: బాత్రూమ్లోకి కూడా నాతో వస్తారా.. మీడియాపై పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు..
Pinarayi Vijayan
Pinarayi Vijayan: కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుకు సంబంధించి ప్రశ్నలు అడిగేందుకు విలేకరులు ఆయనను వెంటాడటంతో సహనం కోల్పోయిన విజయన్.. తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. నేను ఎక్కడికి వెళ్లినా అక్కడికి వస్తారా? నేను బాత్రూమ్‌లోకి వెళ్లినా నన్ను వదలరా?’’ అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం చంగనచేరికి వెళ్తున్న పినరయి విజయన్ మార్గమధ్యంలో కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. విజయన్ అక్కడికి వస్తున్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అప్పటికే రెస్ట్ హౌస్ వద్ద వేచి ఉన్నారు. ఆయన కారు నుంచి దిగగానే విలేకరులు చుట్టుముట్టి ఈడీ కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అయితే విజయన్ వారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా రెస్ట్ హౌస్‌లోకి వెళ్లిపోయారు.
అయితే మీడియా ప్రతినిధులు అక్కడితో ఆగలేదు. విజయన్‌ను అనుసరిస్తూ రెస్ట్ హౌస్‌లోకి వెళ్లి మరోసారి ఈడీ కేసుపై ప్రశ్నలు సంధించారు. ఒక గదిలోకి వెళ్లే సమయంలో ఆయన వెనక్కి తిరిగి మీడియా ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కలవడానికి కాదని స్పష్టం చేసిన ఆయన.. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తారా? బాత్రూమ్‌లోకి వెళ్లినా వదలరా? అంటూ ప్రశ్నించారు. అనంతరం ఆయన గదిలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన విజయన్ మీడియాతో మాట్లాడకుండానే తన వాహనంలో చంగనచేరి వైపు వెళ్లిపోయారు.
పినరయి విజయన్‌ను మీడియా ప్రశ్నించడానికి ప్రధాన కారణం తాజాగా ఈడీ తీసుకున్న చర్యలే. విజయన్‌తో పాటు ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు, ఎమ్మెల్యే పి.ఎ. మహమ్మద్ రియాస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఈడీ రాష్ట్ర పోలీస్ చీఫ్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రకారం తమ దర్యాప్తులో సేకరించిన వివరాలు, ఆధారాలను ఈడీ పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై విజయన్ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే మీడియా పట్ల పినరయి విజయన్ కఠినంగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వారపు కేబినెట్ సమావేశం అనంతర మీడియా సమావేశాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. 2017లో తిరువనంతపురంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సమావేశానికి వెళ్లిన సమయంలో కూడా మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లండి అంటూ గట్టిగా మందలించిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఈడీ కేసుపై ప్రశ్నలు ఎదురైన సమయంలో మరోసారి మీడియాపై విజయన్ ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయంగా, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా కీలక రాజకీయ పదవుల్లో ఉన్న నేతలు మీడియా ప్రశ్నలకు ఎలా స్పందించాలనే అంశంపై కూడా ఈ ఘటన మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది. ఈడీ దర్యాప్తు, తదుపరి పోలీసుల చర్యలు, ఈ కేసులో విజయన్ కుటుంబ సభ్యులపై వచ్చే పరిణామాలు ఇకపై కేరళ రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది.
- AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్.. పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల..
- Pinarayi Vijayan: బాత్రూమ్లోకి కూడా నాతో వస్తారా.. మీడియాపై పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు..
- Telangana Politics: కేసీఆర్ చావు డప్పు వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. బీఆర్ఎస్ నేతల అసభ్యకర వ్యాఖ్యల వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆవేదన..
- Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో బ్యాంక్ పనులు ఉంటే జాగ్రత్త..
- Telangana PRC Update: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు..