Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో బ్యాంక్ పనులు ఉంటే జాగ్రత్త..
Bank Holidays:
Bank Holidays: దేశవ్యాప్తంగా వచ్చే వారం బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 11, 12, 13, 14 తేదీల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఐదు రోజుల పని దినాల (5-Day Work Week) విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11వ తేదీన అన్ని జాతీయ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వంతో జరిగే చర్చలు ఫలించని పక్షంలో ఆ రోజు బ్యాంకింగ్ సిబ్బంది అంతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నారు.
సమ్మెతో పాటు వరుసగా వచ్చే వారాంతపు సెలవులు, పండుగ ఈ సెలవుల సంఖ్యను పెంచాయి. 11వ తేదీన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జరగనుండగా.. 12వ తేదీన రెండవ శనివారం, 13వ తేదీన సాధారణ ఆదివారం, 14వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు రొక్కం ఉపసంహరణ, డిపాజిట్లు, ఇతర ప్రత్యక్ష బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
వరుసగా సెలవులు రానుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఖాతాదారులు, వ్యాపారులు తమ అత్యవసర బ్యాంకింగ్ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని, డిజిటల్ చెల్లింపుల మార్గాలను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.