Bandi Sanjay: ‘బండి’ దిగడం ఖాయమేనా..? ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామాతో సంజయ్ కేంద్ర మంత్రి పదవికి సంకటం..?
'బండి' దిగడం ఖాయమేనా..? ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామాతో సంజయ్ కేంద్ర మంత్రి పదవికి సంకటం..?
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం
- సొంత పార్టీ నేతలతో నిత్య కలహాలు, కొరవడిన సమన్వయం
- కొడుకు ‘పోక్సో’ వివాదంతో పార్టీకి తీవ్ర మచ్చ.. హైకమాండ్ సీరియస్?
కేంద్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జంతర్ మంతర్ వద్ద సాగిన విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క వికెట్ పడటంతోనే ఆగకుండా.. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే (Cabinet Reshuffle) ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఢిల్లీ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంత్రి పదవి ఊడటం దాదాపు ఖాయమేనా అన్న ప్రచారం జోరందుకుంది.
కొడుకు ‘పోక్సో’ వివాదం.. పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం
బండి సంజయ్‌కి అత్యంత ప్రతికూలంగా మారిన ప్రధాన అంశం ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు. క్రిమినల్ కేసులతో పాటు తీవ్రమైన చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో, కేసులో బండి సంజయ్ పాత్రపై కూడా ఆరోపణలు మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.
ఇటీవల తెలంగాణలో పోక్సో నిందితుడు బెయిల్‌పై వచ్చి దారుణాలకు ఒడిగడుతున్న ఘటన సైతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోనే బాధ్యతల్లో ఉన్న ఒక నేత కుమారుడిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం బీజేపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాబోయే ఎన్నికల నాటికి శాంతిభద్రతలు, మహిళా భద్రత అంశాలపై ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
స్థానిక పోరు.. ఈటెల వర్గంతో పచ్చగడ్డి వేస్తే భగ్గు!
తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు ఎప్పటికప్పుడు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ శైలిపై పార్టీలోని సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఎంపీ ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలకు తీవ్ర అసంతృప్తి ఉంది. నాయకత్వ వైఖరిపై విభేదాలు: సంజయ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని, సీనియర్లను కలుపుకుని పోరనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఈటెల రాజేందర్ వర్గానికి, సంజయ్ వర్గానికి మధ్య అంతర్గత ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఈ వర్గపోరు పార్టీకి గణనీయమైన నష్టాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై కేంద్ర నాయకత్వం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది.
రీషఫుల్ గండం నెగ్గుకొస్తారా?
ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణతో ఖాళీ అయిన విద్యాశాఖను భర్తీ చేయడంతో పాటు, వివాదాల్లో ఉన్న, అంచనాలను అందుకోలేకపోయిన పలువురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోక్సో కేసు తెచ్చిపెట్టిన దెబ్బ, పార్టీలోని తీవ్రమైన అంతర్గత విబేధాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలవడం వంటి కారణాలతో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి, ఆయన స్థానంలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం ఇస్తారా లేదా పార్టీ సంస్థాగత బాధ్యతలకు పరిమితం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వేదికగా మారుతున్న సమీకరణాలను చూస్తుంటే.. ‘బండి’ కేంద్ర పదవి నుంచి దిగడం దాదాపు ఖాయమేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!