Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడది స్థిరమైన అడుగుజాడ

Prajapaksham 21 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడది స్థిరమైన అడుగుజాడ

తెలుగు సాహిత్యంలో ఆధునికతను కేవలం కొత్త ప్రక్రియల ప్రవేశంగా కాకుండా, జీవితాన్ని చూసే కొత్త దృష్టిగా స్థాపించిన రచయితల్లో గురజాడ అప్పారావు అగ్రగణ్యుడు. 1862 సెప్టెంబర్‌ 21న జన్మించి, 1915 నవంబర్‌ 30న మరణించిన గురజాడ జీవితం సుమారు 53 సంవత్సరాలే. కానీ ఆ స్వల్ప కాలంలో ఆయన తెలు భాష, సాహిత్యం, రంగస్థలం, సామాజిక ఆలోచన, జాతీయ చైతన్యం వంటి అనేక రంగాలపై శాశ్వతమైన ప్రభావం చూపాడు.

విజయనగరం ఆయన విద్యాభ్యాసానికి, ఉద్యోగ జీవితానికి, సాహిత్య వికాసానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. మహారాజా ఆనంద గజపతితో ఆ యనకు ఏర్పడిన పరిచయం తరువాతి జీవితంలో కీలకమైంది. విజయనగరం సంస్థానంలో శాసన పరిశోధకుడి గా పనిచేయడంతో పాటు, ఎంఆర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా కూడా పనిచేశాడు. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యుడయ్యాడు. 1913లో విశ్వవిద్యాలయం ఆయనను ఫెలోగా గౌరవించింది.

గురజాడ పుట్టిన తేదీ విషయంలో ఒకప్పుడు రెం డు తేదీలు ప్రచారంలో ఉన్నాయి. 1861 నవంబర్‌ 30 అని కొందరంటే, కాదు, 1862 సెప్టెంబర్‌ 21 అని మరికొందరి వాదన. అయితే ఆయన వారసులు 1862 సెప్టెంబర్‌ 21నే జన్మదినంగా అంగీకరించారని లభ్యమైన జీవితచరిత్ర ఆధారాలు సూచిస్తున్నాయి.

గుజరాడకు ఆంగ్ల సాహిత్యంపై గాఢమైన పట్టు ఉండేది. ‘సారంగధర’ వంటి ఆంగ్ల రచనలతో ఆయన తొలినాళ్లలోనే రచయితగా గుర్తింపు పొందాడు. తరువాత తెలుగు ఆయన సృజనకు ప్రధాన భాషగా మారింది. ‘కన్యాశుల్కం’, ‘ముత్యాల సరాలు’, ‘నీలగిరి పాటలు’, ‘పూర్ణమ్మ’, ‘లవణరాజు కల’, ‘మనీషి’, ‘కాసులు’, ‘కొండుభట్టీయం’, ‘బిల్హణీయం’ వంటి రచనలు ఆయన సాహిత్య పరిధిని తెలియజేస్తాయి.

‘ముత్యాల సరాలు’ తెలుగు కవిత్వంలో కొత్త లయను, కొత్త భాషా స్వరాన్ని ముందుకు తెచ్చింది. సంప్రదాయ ఛందోబద్ధతకు భిన్నంగా ప్రజల మాటకు దగ్గరైన కవితా వ్యక్తీకరణకు అది మార్గం వేసిం ది. అయితే గురజాడను కేవలం కవి లేదా నాటకకర్తగా నిర్వచించడం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే అవుతుంది. ఆయన అసలు విశిష్టత సాహిత్యాన్ని జీవితంతో అనుసంధానించడంలో ఉంది.

సమాజంలో కనిపించే అ న్యాయాన్ని దూరం నుంచి పరిశీలించి వ్యాఖ్యానించలే దు. దానిని పాత్రలుగా, సంభాషణలుగా, వ్యంగ్యంగా, కవిత్వంగా సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. అందువల్ల ఆయన రచనలు ఒక కాలానికి సంబంధించిన చారిత్రక పత్రాలుగానే కాకుండా, సామాజిక మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ఆధారాలుగా కూడా నిలిచాయి.

గురజాడ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘కన్యాశుల్కం’. ఈ నాటకానికి తొలి రూపం 1892లో రంగస్థలంపైకి వచ్చింది. 1897లో అది పుస్తకరూపంలో వెలువడింది. తెలుగు రంగస్థల చరిత్రలో సామాజిక స మస్యలను ఆధునిక దృష్టితో నేరుగా పరిశీలించిన ముఖ్యమైన తొలి నాటకాల్లో ఇది ఒకటి.

‘కన్యాశుల్కం’ అనే ప దమే ఆ కాలంలోని ఒక దురాచారాన్ని సూచిస్తుంది. వివాహ సమయంలో వధువు కుటుంబం వరుడికి కట్నం ఇచ్చే పద్ధతికి భిన్నంగా, కొన్ని వర్గాల్లో వరుడు వధువు కుటుంబానికి డబ్బు చెల్లించే ఆచారం ఉండేది. ఈ ఆచారం చివరకు బాలికను ఒక సామాజిక వస్తువుగా మార్చే స్థితికి చేరింది. వయసు మళ్లిన పురుషులు చిన్న వయసున్న బాలికలను వివాహం చేసుకోవడం, ఆర్థిక లావాదేవీల కోసం బాల్యాన్ని తాకట్టు పెట్టడం, ఆ వివాహాల తరువాత బాలవితంతువుల సంఖ్య పెరగడం వం సమస్యలు ఆ కాలపు సమాజంలో తీవ్రంగా కనిపించేవి.

గురజాడ ఈ వ్యవస్థను ఉపన్యాసం ద్వారా కాకుం డా, నాటకీయ వ్యంగ్యం ద్వారా సమాజం ముందుంచా డు. అయితే, ఈ నాటకంలోని గొప్పతనం దాని సామాజిక అంశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఘనత పాత్రల నిర్మాణంలో ఉంది.

గిరీశం వంటి పాత్ర ద్వారా విద్య, సంస్కరణ, ఆధునికత వంటి పదాలను స్వార్థ ప్ర ఉపయోగించుకునే కపట మేధావి స్వభావాన్ని ఆయన వ్యంగ్యంగా చూపించాడు. మరోవైపు మ ధురవాణి పాత్రను కేవలం వేశ్య అనే సామాజిక గుర్తింపులో బంధించకుండా, ఆ పాత్రకు తెలివి, పరిశీలన, మానవత్వం, నిర్ణయశక్తి ఇచ్చాడు. ఆ కాలపు నైతిక ప్ర మాణాలను తలకిందులు చేసే విధంగా ఈ పాత్రను ని ర్మించడం గురజాడ సామాజిక దృష్టిలోని సంక్లిష్టతను వెల్లడిస్తుంది.

వ్యక్తి వృత్తి లేదా సామాజిక గుర్తింపు కంటే అతని ప్రవర్తన, మానవత్వం, నైతికతకు ప్రాధాన్యం ఇ వ్వాలనే భావన ఇందులో కనిపిస్తుంది. బాల్యవివాహాల సమస్యపై ఆయన వ్యతిరేకత ‘పూర్ణమ్మ’ వంటి రచనల్లో మరింత హృదయస్పర్శిగా నిలుస్తుంది. చిన్న వయసులో నే వివాహ బంధంలోకి వెళ్లాల్సి వచ్చిన ఓ బాలిక జీవితా న్ని విషాదంగా చిత్రించడం ద్వారా, సామాజిక ఆచారం వెనుక దాగిన వ్యక్తిగత విషాదాన్ని గురజాడ చూపించా డు.

స్త్రీని కుటుంబ గౌరవానికి, ఆర్థిక లావాదేవీకి, పురుషాధిక్య వ్యవస్థకు పరిమితమైన వ్యక్తిగా చూసే దృష్టిని ప్రశ్నించాడు. కులవ్యవస్థపై కూడా గురజాడ ఆలోచన మానవతావాదమే కేంద్రంగా నిలిచింది. మనుషుల ను జన్మ ఆధారంగా విభజించడం కంటే మంచితనం, చె డుతనం అనే నైతిక ప్రమాణాలతో చూడాలనే భావన ఆ యన కవిత్వంలో వ్యక్తమవుతుంది.

‘మంచి చెడ్డలు మనుజులందున / ఎంచి చూడగ రెండే కులములు’ అనే ప్రసి ద్ధ పంక్తులు ఈ దృష్టిని స్పష్టంగా చెబుతాయి. ‘మనీషి’ కవితలో ఆయన మానవుడిని విగ్రహం కంటే తక్కువగా చూడే మతాచారాలపై ప్రశ్నలు సంధించాడు. దేవుడిని దూరంలోని కొండల్లో వెతకడం కంటే మనిషిలోని మానవత్వాన్ని గుర్తించాలనే భావన ఆయన రచనల్లో పదేపదే కనిపిస్తుంది.

ఇక్కడే గురజాడ సంస్కరణవాదానికి ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన సంప్రదాయాన్ని మొత్తం తిరస్కరించలేదు. సంప్రదాయంలో ఏర్పడిన అన్యాయాన్ని, అహేతుకతను, కపటత్వాన్ని నిలదీశాడు. సమాజాన్ని మార్చడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు. సాహిత్యానికి సామాజిక బాధ్యత ఉందనే భావన ఆయన రచనా తత్వానికి కేంద్రబిందువు.

భాష, జాతీయత, మానవతావాదం

గురజాడ ఆధునికతలో మరో కీలక అంశం భాష. ఆయనకు భాష అనేది పాఠకుడిని చేరుకునే ప్రధాన సాధనం. సంస్కృత ప్రభావంతో బరువెక్కిన గ్రాంథిక భాష సామా న్య పాఠకుడికి దూరంగా ఉందని ఆయన గుర్తించాడు. అందుకే, ఆ రోజుల్లో ప్రజలు మాట్లాడే భాషను సాహిత్యంలోకి తీసుకువచ్చాడు.

‘కన్యాశుల్కం’లోని సంభాషణలు దీనికి అత్యంత శక్తివంతమైన ఉదాహరణ. విజయనగరం ప్రాంతపు వ్యవహారిక భాషకు దగ్గరగా పాత్రలు మాట్లాడటం వల్ల నాటకం సహజత్వాన్ని సాధించింది. తెలుగు రంగస్థలానికి వ్యవహారిక భాష సరిపోదనే అభిప్రాయాన్ని కూడా ఈ నాటకం సవాలు చేసింది.

భాషను సరళీకరించడం అంటే సాహిత్య ప్రమాణాలను తగ్గించ కాదని గురజాడ రచనలు నిరూపించాయి. దీనికి వి రుద్ధంగా, జీవితం నుంచి వచ్చిన భాష పాత్రలకు మరిం త విశ్వసనీయతను అందించింది. హాస్యం, వ్యంగ్యం, వ్యావహారిక ప్రయోగాలు, స్థానిక నుడికారాలు ఆయన నాటకానికి జీవం పోశాయి. ఈ మార్పు తరువాతి తెలు గు కథ, నాటకం, కవిత్వంపై గణనీయమైన ప్రభావం చూపింది.

తెలుగు ఆధునిక సాహిత్యంలో మాట్లాడే భాషకు గౌరవం పెరగడానికి గురజాడ రచనలు ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. జాతీయత విషయంలో కూడా ఆయన దృష్టి ప్రత్యేకమైనది. ‘దేశభక్తి’ లేదా ‘దేశమును ప్రేమించుమన్నా’ కవితలో దేశాన్ని కేవ లం భూభాగంగా కాకుండా ప్రజల సమాహారంగా చూ డాలని ఆయన చెప్పాడు.

‘దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’ అనే భావనలో ఆయన జాతీయతకు మానవతా పునాది కనిపిస్తుంది. దేశభక్తి అంటే నినాదాలు చేయడం కాదని, ‘ప్రజల జీవన ప్రమాణాల ను మెరుగుపరచడం.. శ్రమించడం.. జ్ఞానం సంపాదించడం.. కళలను అభివృద్ధి చేయడం.. సమాజానికి ఉపయోగపడే పని చేయడం’ అని ఆయన కవిత్వం చెబుతుంది.

‘ముత్యాల సరాలు’లోని ఈ కవితా దృష్టి ఆధునిక జాతీయతకు ఒక విస్తృతమైన నిర్వచనాన్ని అందిస్తుంది. గురజాడ జాతీయతలో సంకుచిత ప్రాంతీయతకు స్థానం లేదు. వివిధ మతాలు, కులాలు, వర్గాల ప్రజలు పరస్పరం సోదరభావంతో జీవించాలని ఆయన కోరాడు.

‘మతం వేరైతే ఏమోయ్‌ / మనసులొకటై మనుషులుంటే’ అనే భావన ఆయన జాతీయతకు ఉన్న విశాలతను తెలియజేస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే ప్ర జల మధ్య మనోభేదాలు తగ్గి, సామూహిక ప్రయోజనం పెరగాలని ఆయన నమ్మాడు.

మానవతావాదం, సంస్కరణవాదం, జాతీయత పరస్పరం విడిపోని మూడు ధోరణులుగా ఆయన రచనలు కనిపిస్తాయి. కులవివక్షను ప్రశ్నించడం మానవతావాదం నుంచి వచ్చింది. బాల్యవివాహాలు, స్త్రీలపై వివక్షను వ్యతిరేకించడం సంస్కరణవా దం నుంచి వచ్చింది. ప్రజలందరూ కలిసి దేశాన్ని నిర్మించాలనే ఆలోచన ఆయన జాతీయతకు పునాది అయింది.

ఈ మూడింటినీ కలిపినందువల్లే గురజాడ ఆలోచన తన కాలాన్ని దాటి ముందుకు వెళ్లింది. గురజాడకు కళ స్వ తంత్ర విలువ కలిగినదే. అయితే కళ జీవితానికి దూరం గా ఉండకూడదని ఆయన భావించాడు.

సాహిత్యం కే వలం భాషా విన్యాసంగా మిగిలిపోతే దాని సామాజిక శక్తి తగ్గిపోతుందని, సమాజంలోని అన్యాయాలను వెలుగులోకి తేవడం, నైతిక చైతన్యాన్ని పెంచడం, మనిషిని తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా చూడటానికి ప్రేరేపించడం ద్వారా మా త్రమే సాహిత్యానికి నిజమైన సార్థకత ఏర్పడుతుందని ఆయన రచనలు సూచిస్తాయి.

ఒక రకంగా ఆయ న రచనలు కాలం కంటే ముందుకు పరుగులు తీస్తా యి. మనిషి మెదడులోకి చొచ్చుకుపోయి, ఆలోచించేలా చేస్తాయి. అందుకే గురజాడను కేవలం ‘ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు’ వంటి బిరుదుల స్మరించడం సరిపోదు.

ఆయన అసలు ప్రాధాన్యం తెలుగు సాహిత్యంలోకి ఒక కొత్త మనిషిని తీసుకురావడంలో ఉంది. ఆ మనిషి కు మతం, జన్మ, వృత్తి వంటి గుర్తింపుల కంటే మానవత్వాన్ని ముందుకు పెడతాడు. మూఢనమ్మకాన్ని ప్రశ్నిస్తాడు. స్త్రీ జీవితాన్ని స్వతంత్ర మానవ సమస్యగా చూస్తాడు. ప్రజల భాషలో మాట్లాడతాడు. దేశభక్తిని కా ర్యాచరణతో కొలుస్తాడు.

సాహిత్యంలో కొత్తదనం అనేది కొత్త పదాలు లేదా కొత్త ఛందస్సులతో మాత్రమే రాదని, ప్రపంచాన్ని చూసే దృష్టి మా రినప్పుడు సాహిత్యం ఆధునికమవుతుందని ఆయన తన రచనలతో నిరూపించాడు. మనిషిని సాహిత్యానికి కేంద్రంగా పెట్టినప్పుడు అది స మాజంతో సంభాషిస్తుంది.

గురజాడ ఆ మార్పును తన కాలంలోనే ఆచరణలో చూ పించాడు. అందుకే ఆయన రచనలు ఒక శతాబ్దం దాటి నా పాతబడలేదు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికీ సమాజాన్ని నిలదీస్తునే ఉంటాయి.

ఆధునిక సాహిత్యానికి పలు విధాలుగా సరికొత్త రంగులు అద్దిన గురజాడ అడుగుజాడలు తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. రచయితలకు మార్గదర్శనం చేస్తాయి.

యువి. రత్నం