Skip to content
బిజినెస్ › వార్తలు

Cash Advance in Property Deal: ప్రాపర్టీ అమ్మకంలో నగదు తీసుకున్న విక్రేతకు ఊరట.. పన్ను శాఖ విధించిన రూ.6.75 లక్షల పెనాల్టీని రద్దు చేసిన ఐటీఏటీ

jagan 24 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Cash Advance in Property Deal: ప్రాపర్టీ అమ్మకంలో నగదు తీసుకున్న విక్రేతకు ఊరట.. పన్ను శాఖ విధించిన రూ.6.75 లక్షల పెనాల్టీని రద్దు చేసిన ఐటీఏటీ

Law

Cash Advance in Property Deal: ఆస్తి అమ్మకం లావాదేవీలో భాగంగా కొంత మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించిన విక్రేతకు ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ITAT) భారీ ఊరట కల్పించింది. విక్రేతపై ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 6.75 లక్షల జరిమానాను రద్దు చేస్తూ చెన్నై ఐటీఏటీ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. లావాదేవీలో పూర్తి పారదర్శకత ఉండటంతో పాటు, నగదు స్వీకరించడానికి విక్రేత చెప్పిన కారణం సహేతుకంగా ఉండటంతో ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నైకి చెందిన వెట్రిచెల్వన్ విజయసారథి తన నివాస గృహాన్ని రూ. 32 లక్షలకు విక్రయించగా, అందులో రూ. 6.75 లక్షలను అడ్వాన్స్‌గా నగదు రూపంలో తీసుకుని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతా ద్వారా పొందారు. విరుగంబాక్కం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందిన సమాచారంతో ఈ లావాదేవీని పరిశీలించిన ఆదాయపు పన్ను అధికారి, స్థిరాస్తి అమ్మకంలో రూ. 20 వేలకు మించి నగదు స్వీకరించడం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించి, సెక్షన్ 271D కింద రూ. 6.75 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయసారథి ఐటీఏటీని ఆశ్రయించి, తనకు అత్యవసరంగా ఇంటిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెల్లూరుకు చెందిన ఒక సీనియర్ సిటిజన్ ఇంటిని చూసి వెంటనే కొనుగోలుకు అంగీకరించారని వివరించారు. ఆ సమయంలో కొనుగోలుదారు వద్ద రూ. 6.75 లక్షల నగదు ఉందని, అంత డబ్బుతో తిరిగి ప్రయాణించడం ఇష్టం లేక అక్కడికక్కడే అడ్వాన్స్ ఇస్తానని చెప్పడంతో సదుద్దేశంతోనే ఆ నగదును స్వీకరించానని ట్రైబ్యునల్‌కు తెలిపారు.

విక్రేత వాదనలను, కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఐటీఏటీ బెంచ్, ఈ వ్యవహారంలో లావాదేవీని దాచిపెట్టే ప్రయత్నం ఎక్కడా జరగలేదని స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ సేల్ డీడ్‌లో పూర్తి అమ్మకం విలువను చూపించడం, ఆదాయపు పన్ను రిటర్నులలో ఈ వివరాలను వెల్లడించి మూలధన ఆదాయ పన్ను చెల్లించడం, స్వీకరించిన నగదును వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేసి మిగిలిన మొత్తాన్ని బ్యాంకింగ్ మార్గాల ద్వారానే పొందడం వంటివి విక్రేత నిజాయతీని బలపరిచాయని ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సెక్షన్ 269SS నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 273B కింద ‘సహేతుకమైన కారణం’ చూపినందున విక్రేతకు రక్షణ లభిస్తుందని తీర్పు చెప్పిన ట్రైబ్యునల్, అసెసింగ్ అధికారి విధించిన రూ. 6.75 లక్షల జరిమానాను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.