Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్‌కు అధికారం దక్కడం కలే.. ఇంకా వారు ఊహల్లోనే బతుకుతున్నారు.. భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
Bhatti vikramarka
Telangana Politics: తెలంగాణలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడుతుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు అధికారం అనేది ఇక పగటి కలేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వాస్తవ పరిస్థితులకు దూరంగా ఊహా ప్రపంచంలో బతుకుతున్నారని, కేవలం సోషల్ మీడియా లోకంలోనే విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం తమ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గతంలో నీటి విషయంలో రాష్ట్రానికి నష్టం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు, ఇప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ‘దొంగే దొంగ’ అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయని, తాము అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని వెతికి మరీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. పార్టీలో విభేదాలే లేనప్పుడు వాటిపై చర్చ ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జితో కేవలం పార్టీ సంస్థాగత బలోపేతం (ఆర్గనైజేషన్) గురించే చర్చించామని ఆయన వివరించారు.