Skip to content
తెలంగాణ › వార్తలు

‘Congress Is Guaranteed 100 Seats’: నా ప్లాన్ అమలు చేస్తే కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం..

jagan 23 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
‘Congress Is Guaranteed 100 Seats’: నా ప్లాన్ అమలు చేస్తే కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం..

Komatireddy Venkat Reddy

‘Congress Is Guaranteed 100 Seats’: తెలంగాణలో మరోసారి అధికార పీఠం తమదేనని రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 90 సీట్లు ఖాయమని, తన అంచనా ప్రకారం 100 స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలక మలుపుగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం లేదని, టెండర్లను మూడుసార్లు వాయిదా వేసిందని ఆరోపించారు.

ప్రమాదాలకు నిలయంగా మారిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం లభించినా కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెట్టిందని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను రాబట్టడంలో నిర్లక్ష్యం వహించిందని, ఇప్పుడు తాము అన్ని అనుమతులు సిద్ధం చేసినా బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేశారని కేంద్ర నేతలు అమిత్ షా, నితిన్ నబిన్, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నిస్తూ, రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు.

మరోవైపు, గాంధీ భవన్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను ఏడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తన శాఖలో అద్భుతమైన పనులు జరుగుతున్నాయని, ఒక్కరోజు కాదు.. ఒక్క గంట కూడా విరామం లేకుండా ప్రజాసేవలో పనిచేస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలనలో మాటలు ఎక్కువ, పనులు తక్కువగా ఉండేవని, కానీ తమ ప్రభుత్వంలో మాటలు తక్కువ, పనులు ఎక్కువగా ఉంటున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ మాటలేనని విమర్శించిన ఆయన, కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేస్తూ, తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో అత్యంత వేగంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.