Godavari Pushkaralu 2027: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు.. ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం..
Minister Uttam Announces Additional ₹200 Crore for Siddhapur Reservoir
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 ను తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రపంచానికి చాటేలా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సోమవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో (JNAFAU) పుష్కరాల లోగో, నినాదం రూపకల్పనపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న ఈ మహా పుష్కరాల కోసం ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం , ఇతర భక్తుల వసతుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,115 కోట్లతో పనులు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘దక్షిణ గంగ’గా భక్తులు కొలిచే గోదావరి తీరం వెంబడి ఉన్న బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు లక్షలాదిగా భక్తులు పోటెత్తనున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆలయాల సమగ్రాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని, ముఖ్యంగా బాసర ఆలయ అభివృద్ధికి రూ. 324 కోట్లు, భద్రాచలం ఆలయానికి రూ. 276 కోట్లు, కాళేశ్వరం క్షేత్రానికి రూ. 198 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.
పుష్కరాల ఆధ్యాత్మిక విశిష్టత, గోదావరి నది పవిత్రత , తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించే లోగో, నినాదం పోటీల్లో విద్యార్థులు, కళాకారులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోటీలో వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు సభ్యుల బృందంగా పాల్గొనవచ్చని, లోగో , నినాదాన్ని కలిపి ఒకే ఎంట్రీగా నవంబర్ 30వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.
సృజనాత్మకత, ప్రత్యేకత, పుష్కరాల భావానికి అనుగుణంగా ఉండటంతో పాటు వివిధ ప్రచార మాధ్యమాల్లో ఉపయోగించుకునే వీలు వంటి అంశాల ఆధారంగా రాష్ట్రస్థాయి కమిటీ ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేస్తుందని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతిగా రూ. 50 వేలు, మూడో బహుమతిగా రూ. 25 వేల నగదు పురస్కారాలను అందించడంతో పాటు, తొలి 100 ఉత్తమ ఎంట్రీలకు ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాల ప్రత్యేకతను కళాత్మకంగా ఆవిష్కరించాలని విద్యార్థులకు సూచించారు. ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ సదస్సులో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు తదితరులు హాజరయ్యారు.