Skip to content
తెలంగాణ › వార్తలు

ప్రయాణీకుల దాడులు బెంబేలెత్తుతున్న ఆర్‌టిసి ఉద్యోగులు

Prajapaksham 24 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ప్రయాణీకుల దాడులు బెంబేలెత్తుతున్న ఆర్‌టిసి ఉద్యోగులు

Free RTC Bus Row

ఆర్‌టిసి డ్రైవర్‌, కండక్టర్లపై అనేక సంవత్సరాలుగా ప్రయాణీకులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడులను నివారించటానికి యాజమాన్యం కొన్ని ప్రయత్నాలు చేసినా, అవి సఫలం కాలేదు. డ్రైవర్‌, కండక్టర్లు తమ విధిని నిర్వహిం చు సందర్భంలో ఎప్పుడు ఎవరు తమపై దాడి చేస్తారో అనే భయంతో వణికిపోతున్నారు. ఈ దాడులకు కారణం డ్రైవర్‌, కండక్టర్లంటే ప్రయాణీకులకు చిన్నచూపు. సిబ్బంది ఫిర్యాదులతో కేసులు నమోదవుతున్నా, నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. ఆర్‌టిసి ఉద్యోగులపై దాడులు జరుగుతున్నప్పుడు ప్రజలు, ప్రయాణీకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. తప్పులు చేసినవారు శిక్షల నుండి తప్పించుకు తిరుగుతుంటే, ఆ దాడిలో గాయపడిన డ్రైవర్‌, కండక్టర్లు అంగవైకల్యంతో బ్రతుకు భారంగా గడుపుతున్నా రు. సిబ్బంది ప్రవర్తన విషయంలో ప్రయాణీకులకు ఏవైనా అభ్యంతరాలుంటే ఆర్‌టిసి అధికారులకు ఫిర్యాదులు చేయాలే తప్ప దాడులకు దిగవద్దని, దాడులకు పాల్పడితే ప్రభుత్వం తీవ్రంగా స్పందించి బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించటం కొంత ఊరట నిచ్చింది.

ఖమ్మం రీజియన్‌ మణుగూరు డిపోకు చెందిన 24 సంవత్సరాల జి.ప్రవళిక 25.-10-.2026న తన కండక్టర్‌ విధులను నిర్వర్తిస్తుండగా, బానోతు మౌనిక అనే ప్రయాణీకురాలికి టికెట్‌ వెనకాల వ్రాసిన చిల్లర కోసం ఆ ప్రయాణీకురాలు కండక్టర్‌తో గొడవ పడింది. ఆ గొడవ కారణంగా కండక్టర్‌ బస్సును పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ప్రయాణీకురాలు రన్నింగ్‌ బస్‌ నుండి కండక్టర్‌ను కిందకు తోసివేసింది. కండక్టర్‌ బస్సులో నుండి కిందపడటం, టైర్లు ఆమె కాళ్ళమీద నుండి పోవడం ఒకేసారి జరిగాయి. కాళ్ళ కండరాలు, నరాలు నుజ్జు నుజ్జు కావడంతో ఆమెకు మొదట భద్రాచలంలోని హాస్పిటల్‌లో చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. ఈ దాడి సంఘటన జరిగిన వెంటనే రవాణాశాఖ మంత్రి స్పందించి సాయి సంజీవని హాస్పిటల్‌ కు వచ్చి ఆ కండక్టర్‌ కు, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రమాదం జరిగిన రోజు నుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హాస్పిటల్‌ డాక్టర్లను సంప్రదించి స్పెషల్‌ కేస్‌ కింద ట్రీట్మెంట్‌ చేయాలని కోరారు.

ఓ పక్క ప్రభుత్వం, యాజమాన్యం, మరోప్రక్క ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నిరంతరం ఈ కేసులో ఆమెను బ్రతికించటం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నించినా 3-1.1.-2026న ఆమె మృత్యువు ఒడిలోకి చేరుకోవటం బాధాకరం. ఉస్మానియా ఆస్పత్రిలో జరుగుతున్న పోస్టుమార్టమ్‌కు కూడా రవాణాశాఖామాత్యులు, ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ హాజరు కావటం జరిగింది. ఆమె మరణంతో కార్మికవర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో ఎంప్లాయీస్‌ యూనియన్‌ జెఎసి ఖమ్మం రీజియన్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ జరుగుతుండగా రవాణాశాఖామంత్రి జోక్యం చేసుకుని రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, యాజమాన్యాల పరంగా ఈ కేసులో ఆమె కుటుంబానికి అందించాల్సిన సహాయం అందించారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకత్వం ఆమె బాడీతో పాటు మణుగూరు వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ కేసులో ప్రయాణీకురాలు చేసిన తప్పిదానికి అతి చిన్న వయస్కురాలైన కండక్టర్‌ జీవితం బుగ్గిపాలైంది.

సిరిసిల్ల డిపో డ్రైవర్‌ విధి నిర్వహణలో ఉండగా ఒక కారు యజమాని తనకు సైడ్‌ ఇవ్వలేదని డ్యూటీలో ఉన్న డ్రైవర్‌ని తన్నటంతో పాటు గాయపరిచాడు. కారు యజమానిపై కేసు రిజిస్టర్‌ చేసి రిమాండుకు పంపారు. ఈ దాడిలో డ్రైవర్‌ విపరీతంగా గాయపడటం జరిగింది. ఫారూఖ్‌ నగర్‌ డిపోకు చెందిన రమేష్‌ అనే కండక్టర్‌ పై దుండగులు దాడి చేసి తీవ్రంగా హింసించటంతో అతను డ్యూటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆయనను అవుటాఫ్‌ డిజిగ్నేషన్‌ డ్యూటీలో తీసుకోవాలని కండక్టర్‌ కోరినా యాజమాన్యం స్పందించకపోవడంతో జీవనోపాధి లేక ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి కేసుల్లో ఆర్‌టిసి యాజమాన్యం మానవత్వాన్ని చాటాల్సిన అవసరం ఉంది. యాదగిరి గుట్ట డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకురాలు తను ఆపమన్న చోట బస్సు ఆపలేదని, తన భర్తకు, కుమారుడికి ఫోన్‌ చేసి పిలిపించి డ్రైవర్‌, కండక్టర్లపై విచక్షణా రహితం గా దాడి చేయించింది. ఈ దాడిలో వారు గాయపడినా, దాడి చేసిన వారిపై ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు.

హయత్‌ నగర్‌ డిపోకు చెందిన ఓ డ్రైవర్‌ను మహిళా ప్రయాణీకురాలు మెడమీద కొట్టడంతో ఆ డ్రైవర్‌ మెడికల్‌ అన్‌ఫిట్‌ అయ్యాడు. దిల్సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన డ్రైవర్‌, కండక్టర్లపై ఒక మహిళా ప్రయాణీకురాలు పాములు, మందు సీసాలను విసిరింది. అదృష్టం బాగుండి వారు పాముకాటుకి గురికాలేదు. ఈ దాడులన్నీ డ్రైవర్‌, కండక్టర్లు డ్యూటీ చేస్తున్న సమయంలో మహిళలు, రోడ్‌ యూజర్స్‌ చేసిన దాడులే. ఇలాంటి దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్ని కేసులలో ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయటం, రిమాండుకు పంపటం జరిగినా, మరికొన్ని కేసులలో ఎటువంటి చర్యలూ లేవు. అందువల్ల డ్రైవర్‌, కండక్టర్ల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళిన మనిషి ఎలా తిరిగి వస్తాడో అని డ్రైవర్‌, కండక్టర్‌ కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ చేస్తున్న సందర్భం లో ప్రయాణీకులతో పాటు ఇతరులు దాడులు జరిపినా, వారిని భయభ్రాంతులకు గురిచేసి ఆటంకం కల్పించినా, గతంలో ఐపికి 332, 333, 353 లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ మారి భారతీయ న్యాయ సంహిత చట్టం వచ్చిన తరువాత ఆ చట్టం లోని సెక్షన్లు 121, 132 ప్రకారం నేరం రుజువైతే నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ విడుదల చేస్తూ జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది. కాని పైన ఉదహరించిన కేసులలో ఈ చట్టం అమలైన దాఖలాలు కనిపించటం లేదు.

ఆర్‌టిసి డ్రైవర్‌, కండక్టర్లపై దాడులు జరగకుండా ప్రభుత్వం, యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసి డ్రైవర్‌, కండక్టర్లకు అందుబాటులో ఉంచాలి. దాడి జరిగిన సందర్భంలో వారు ఫిర్యాదు చేసిన వెంటనే దాడిచేసిన వారిని శిక్షించే ఏర్పాట్లు చేయాలి. ఢిల్లీలో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిన తరువాత ప్రభుత్వం నిర్భయ చట్టం ఎలాగైతే తీసుకు వచ్చిందో, అలాగే ఆర్‌టిసి ఉద్యోగులపై దాడులు జరిగితే మరణించిన కండక్టర్‌ ప్రవళిక పేరుతో ఓ చట్టం తేవాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆర్‌టిసి యాజమాన్యం కూడా ఇలా దాడి జరిగి గాయపడిన వారిని గాలికి వదిలేయకుండా వారికి ఇతర డ్యూటీలు ఏవైనా కల్పించి ఉద్యోగులను ఆదుకోవాలి. ఈ దాడులన్నీ మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తరువాతే ఎక్కువగా జరుగుతున్నాయి.

మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టిన తరువాత బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది. ఈ రద్దీకి తగినన్ని బస్సుల సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది, ప్రయాణీకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సీట్ల విషయంలో కూడా ప్రయాణీకులు, ప్రయాణీకులు గొడవ పడటమే కాకుండా డ్రైవర్‌, కండక్టర్‌తో కూడా గొడవ పడుతున్నారు. సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక భద్రతా చట్టాలు తేవాలని, డిపో, బస్‌స్టాండ్‌ పరిధిలో ప్రయాణీకులు దాడులుచేస్తే వెంటనే పోలీసు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, మార్గమధ్యంలో దాడులు జరిగితే పోలీస్‌ ఎస్కార్ట్‌ ఉండాలని యూనియన్లు కోరుతున్నాయి. ఏది ఏమైనా మహిళా ప్రయాణీకుల్లో పరివర్తన తెచ్చే విధంగా ప్రభుత్వ, యాజమాన్యాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్యాగ్‌లు: Telangana