ఇంటర్ విద్య విలీనం.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తుందా?
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2027 విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..
విద్య అనేది ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకునే ప్రయోగశాల కాకూడదు. విద్యారంగంలో తీసుకొ చ్చే ప్రతి విధానం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా ఉండాలి. కొత్త విధా నాన్ని అమలు చేయడానికి ముందు దాని వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది? విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాం టి ప్రభావం ఉంటుం ది? అనే అంశాలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇప్పటివరకు ప్రత్యేక శాఖలుగా, స్వతంత్ర వ్యవస్థలుగా కొనసాగుతున్నాయి. 1969- విద్యాసంవత్సరంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఇలాంటి ప్రత్యేక విద్యా వ్యవస్థను ఎలాంటి సమగ్ర అధ్యయనం, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, సంబంధిత వర్గాల అభిప్రాయాలు తీసుకోకుండా హడావుడిగా పాఠశాల విద్యలో విలీనం చేయడం భవిష్యత్తు తరాల విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావడం అవసరమే. అయితే ఆ మార్పులు కేవలం శాఖల విలీనం, పాలనాపరమైన సంస్కరణలకే పరిమితం కాకూడదు. ముందు గా విద్యారంగ బడ్జెట్‌ను పెంచి, ప్రభుత్వ విద్యాసంస్థలకు అధిక నిధులు కేటాయించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
10వ తరగతి అనంతరం విద్యార్థులు చదువుకు దూరం కాకుండా డ్రాపౌట్లను తగ్గించడమే విలీనం వెనుక ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నప్పటికీ, తెలంగాణలో పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యకు వెళ్లే విద్యార్థుల్లో డ్రాపౌట్ల శాతం కేవలం 1.7శాతమేనని గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలోనే తక్కువ డ్రాపౌట్ల శాతం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షలు రాసిన సుమారు 25 లక్షల మంది విద్యార్థుల్లో ఇంటర్మీడియట్ స్థాయికి చేరుకునే నాటికి సుమారు 7లక్షల మంది తగ్గుతున్నట్లు పేర్కొనబడుతోంది.ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యేక వ్యవస్థగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న విద్యార్థులు, తల్లిదండ్రు లు, అధ్యాపకులు, విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలలపై మరింత భారం..
రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల కొరత, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు వంటి మౌలిక సదుపాయాల లేమి తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా పాఠశాలల్లో విలీనం చేస్తే అదనపు తరగతి గదు లు, ప్రయోగశాలలు, అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాం టి ప్రణాళిక రూపొందించింది?
రాష్ట్రంలో 26,106 ప్రభుత్వ పాఠశాలలు, 426 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 1,292 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే 370 కెజిబివిలు, సుమారు 700 గురుకులాలు, 194 మోడల్ స్కూళ్లలో కూడా ఇంటర్మీడియట్ విద్య కొనసాగుతోంది. ఇంత విస్తృతమైన విద్యా వ్యవస్థలో విలీన ప్రక్రియను అమలు చేయడానికి అవసరమైన వసతులు, సిబ్బంది, నిధులపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలి.
సరైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలు కల్పించకుండా 10+2 విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వ విద్యాసంస్థలపై తీవ్ర ఒత్తిడి పడటమే కాకుండా విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడితే విద్యార్థులు ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పటికే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు 9,10,11, 12 తరగతులను ఒకే చోట నిర్వహించే విధానాన్ని ఆసరాగా చేసుకుని, 9, 10 తరగతుల నుంచే జెఇఇ, నీట్ కోచింగ్ అందిస్తామంటూ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాయి. అయితే తక్కువ ఫీజులతో విద్యను అందించే బడ్జెట్ జూనియర్ కళాశాలలు ఈ మార్పుల నేపథ్యంలో ఎలాంటి విధానాన్ని అనుసరించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించకపోతే కొత్త విధానం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. చివరకు పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యా ఖర్చుల ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది.
జూనియర్ లెక్చరర్ల భవిష్యత్తుపై స్పష్టత ఏది?
ఇంటర్మీడియట్ విద్యాశాఖలో పనిచేస్తున్న వేలాదిమంది జూనియర్ లెక్చరర్ల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. విలీన ప్రక్రియ వల్ల వారి సర్వీస్ రూల్స్, పదోన్నతులు, బదిలీలు, ఉద్యో గ భద్రత, బోధనా విధానాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?అనే అంశాలకు సమాధానం చెప్పాలి.
ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇప్పటివరకు కొనసాగుతున్న అకడమిక్ విధానాన్ని ఎలా పరిరక్షిస్తారు? అధ్యాపకుల హక్కులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు? వారి సర్వీస్ నిబంధనలను ఎలా అమలు చేస్తారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సరైన విధానం కాదు.
ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యం కావాలి!
10వ తరగతి అనంతరం విద్యార్థులు చదువుకు దూరం కాకుండా డ్రాపౌట్లను తగ్గించాలనే ప్రభు త్వ లక్ష్యాన్ని ఎఐఎస్ఎఫ్ స్వాగతిస్తుంది. అయితే ఆ లక్ష్యం పేరుతో దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రత్యేక విద్యా వ్యవస్థను బలహీనపరిచే నిర్ణయాల ను ఎఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తుంది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. అందుకోసం ప్రభుత్వ విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలి.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే నిర్ణయంపై పునరాలోచించాలి. విద్యార్థి సంఘా లు, ఉపాధ్యాయ సంఘా లు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, ప్రజాస్వామికవాదులతో సమగ్ర చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు, పాఠశాల విద్య లో విలీనం వంటి కీలక నిర్ణయాలపై ప్రభుత్వం తన విధానాలను స్పష్టంగా ప్రకటించాలి. వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రజల ముందుంచాలి. అప్పుడే ప్రభుత్వ నిర్ణయాల పై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో విశ్వాసం ఏర్పడుతుంది.
తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా దోపిడీని అరికట్ట డం కోసం విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయు లు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఐక్యంగా గొంతెత్తాలని ఎఐఎస్ఎఫ్ పిలుపునిస్తోంది.