Skip to content
తెలంగాణ › వార్తలు

Indiramma Sarees Distribution: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు.. అచ్చంపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

jagan 24 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Indiramma Sarees Distribution: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు.. అచ్చంపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

Indiramma Sarees Distribution

Indiramma Sarees Distribution:తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ‘ఇందిరమ్మ చీరల’ను కానుకగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను అందజేయనున్నారు.

మహిళల అభిరుచులకు అనుగుణంగా ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో, అత్యుత్తమ నాణ్యత మరియు మన్నికకు ప్రాధాన్యమిస్తూ ఈ చీరలను ప్రత్యేకంగా రూపొందించారు. ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను ప్రభుత్వం సిద్ధం చేయించింది; ఇందులో 6.30 మీటర్ల పొడవుతో 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవుతో 5 లక్షల పాలీకాటన్ చీరలు ఉన్నాయి. ఒకవైపు ఆడపడుచులకు గౌరవప్రదమైన కానుకను అందిస్తూనే, మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న స్థానిక నేత కార్మికుల చేతనే ఈ చీరలను నేయించడం ద్వారా వారికి నిరంతర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

రాష్ట్రంలో రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు) కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ ఈ చీరలను పొందేందుకు అర్హులు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాలు మరియు పట్టణాల్లోని వార్డుల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ (SERP) సిబ్బంది వీటిని పంపిణీ చేస్తారు. అర్హులైన మహిళలు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను తీసుకోవచ్చు; పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండేలా ప్రత్యేక మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయనున్నారు.

ట్యాగ్‌లు: CM Revanth Reddy Congress Telangana