Punjab Politics: పంజాబ్ ఎన్నికలు.. ఆరేళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన బీజేపీ, అకాలీదళ్.. 2027 ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా సమక్షంలో కీలక ప్రకటన..
Punjab Politics
Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా ఉండి మధ్యలో విడిపోయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మళ్లీ చేతులు కలిపాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఈ రోజు నుంచి శిరోమణి అకాలీదళ్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)లో అధికారిక భాగస్వామిగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమిత్ షా, అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ, అకాలీదళ్ బీజేపీకి అత్యంత పాత, నమ్మకమైన మిత్రపక్షమని, ప్రకాశ్ సింగ్ బాదల్ నాయకత్వంలో తాము ఎన్నో ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని గుర్తుచేసుకున్నారు. మధ్యలో తమ బంధం తెగిపోయినా, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించబడుతుండటం ఎంతో సంతోషంగా ఉందని, అకాలీదళ్ రాకతో ఎన్డీఏ కూటమి పరిపూర్ణమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలతో ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కూటమి ప్రధాన లక్ష్యాలను అమిత్ షా స్పష్టంగా వివరిస్తూ, పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, అవినీతిని సమూలంగా నిర్మూలించడం , రాష్ట్రంలో జాతీయవాద శక్తులను బలోపేతం చేయడం తమ ప్రథమ కర్తవ్యాలని పేర్కొన్నారు. ముఖ్యంగా 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా లేకుండా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పంజాబ్‌కు సంబంధించిన కీలక అంశాలపై తమ ఉమ్మడి వైఖరిని స్పష్టం చేస్తామని ఇరు పార్టీల నేతలు తెలిపారు. ఈ తాజా పొత్తుతో రాబోయే ఎన్నికల్లో పంజాబ్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.