Audi Price Hike: జనవరి 1 నుంచి ఆడి కార్ల ధరల పెంపు.. లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్..
audi car
Audi Price Hike: కొత్త ఏడాదిలో విలాసవంతమైన ‘ఆడీ’ (Audi) కారును సొంతం చేసుకోవాలని భావిస్తున్న కొనుగోలుదారులకు గట్టి షాక్ తగిలింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఆడీ ఇండియా తమ అన్ని మోడళ్ల ధరలను గరిష్ఠంగా 2 శాతం వరకు పెంచుతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పెరిగిన ముడిసరకు ఖర్చులు, తయారీ వ్యయం , దీర్ఘకాలిక వ్యాపార మనుగడను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. సవరించిన ఈ కొత్త ధరలు 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను , పెరుగుతున్న ముడిసరకుల వ్యయాన్ని తట్టుకునేందుకే ఈ స్వల్ప ధరల పెంపు తప్పనిసరైందని ఆడీ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ స్పష్టం చేశారు. అయితే, కస్టమర్లకు అందించే ప్రీమియం అనుభూతి , సేవల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, బ్రాండ్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు.
దేశీయ ఆటోమొబైల్ రంగంలో తయారీ, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతుండటంతో కేవలం లగ్జరీ కార్ల సంస్థలే కాకుండా సామాన్య, మధ్యతరగతి కార్ల తయారీ దిగ్గజాలు సైతం ఇప్పటికే ధరల పెంపు బాట పట్టాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్లపై సగటున 0.31 శాతం వరకు ధరలను పెంచగా, ఆ రేట్లు నవంబర్ 22 నుంచే అమల్లోకి వచ్చాయి; అంతకుముందు 2026 సెప్టెంబర్‌లోనూ మారుతి ఎంపిక చేసిన కార్లపై రూ. 20 వేల వరకు ధరలను పెంచింది. మరోవైపు టాటా మోటార్స్ సైతం తమ వాణిజ్య వాహనాలపై అక్టోబర్ 1 నుంచే 1 శాతం వరకు ధరలను పెంచి వినియోగదారులపై భారం మోపింది.