Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP Weather Update: నెల్లూరు జిల్లాను కుమ్మేసిన వర్షం.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

jagan 25 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Weather Update: నెల్లూరు జిల్లాను కుమ్మేసిన వర్షం.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

Andhra Pradesh Rains

AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని.. పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. బుధవారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురుస్తాయని ఆయన వివరించారు. వర్షాలతో పాటు మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇక మంగళవారం సాయంత్రం మూడు గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యధికంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా.. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కావలిలో 34.2 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా మారెళ్లలో 33.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో 27.9 మిల్లీమీటర్లు, నెల్లూరులో 27.5 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా ములుకుదురులో 26 మిల్లీమీటర్లు, నెల్లూరు రూరల్ ప్రాంతంలో 25.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.