Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

టిఫిన్ సెంటర్ స్టైల్ స్పాంజీ ఇడ్లీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

Krishna Rao 25 Nov 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
టిఫిన్ సెంటర్ స్టైల్ స్పాంజీ ఇడ్లీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..

ఇడ్లీలు దూది పింజల్లా మెత్తగా రావాలా? అయితే పిండిని ఇలా తయారు చేయండి.. ప్రతి సారి సూపర్ సాఫ్ట్ ఇడ్లీలు మీ కోసం..

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వేడి వేడి ఇడ్లీ ఉంటే ఆ మజానే వేరు. అయితే కొన్ని ఇళ్లలో పిల్లలు, పెద్దలు ఇడ్లీ తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వారికి ఒక్కసారి టిఫిన్ సెంటర్లలో దొరికే స్పాంజీ ఇడ్లీ చేసి పెట్టండి. మెత్తగా, తెల్లగా, తినేకొద్దీ మరిన్ని తినాలనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా తిరుపతి టిఫిన్ సెంటర్లలో లభించే ఇడ్లీ తరహాలో వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

స్పాంజీ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపగుళ్లు – 1 కప్పు
ఇడ్లీ బియ్యం – 4 కప్పులు
మెంతులు – 1 టీస్పూన్
రాళ్ల ఉప్పు – 1 టేబుల్ స్పూన్
ఇడ్లీ ప్లేట్లకు సరిపడా నూనె లేదా నెయ్యి
తగినన్ని నీళ్లు

స్పాంజీ ఇడ్లీ తయారీ విధానం
స్టెప్ 1: మినపగుళ్లు నానబెట్టుకోవాలి
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్లు తీసుకోవాలి. ఇందులో ఒక టీస్పూన్ మెంతులు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి సరిగ్గా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం నానబెట్టాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2: ఇడ్లీ బియ్యం నానబెట్టుకోవాలి
మరో గిన్నెలో నాలుగు కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకోవాలి. ఇడ్లీ బియ్యం సాధారణ బియ్యం కంటే చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. ఇవి సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపగుళ్లు, బియ్యం రెండింటినీ వేర్వేరు గిన్నెల్లో నానబెట్టాలి.

స్టెప్ 3: మినపగుళ్లను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఐదు గంటల తర్వాత మినపగుళ్లను నీళ్ల నుంచి వేరు చేసి గ్రైండర్‌లో వేసుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లన్నీ ఒకేసారి పోయకుండా, పిండి గ్రైండ్ అవుతున్నప్పుడు అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా కలుపుకోవాలి. మినప్పిండి ఎక్కడా బరకగా లేకుండా స్పాంజీలా, తేలికగా ఉండాలి.

స్టెప్ 4: పిండి మెత్తగా గ్రైండ్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి
ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా గ్రైండ్ చేసిన మినప్పిండిని వేయాలి. పిండి నీళ్లపై తేలితే సరిగ్గా గ్రైండ్ అయినట్లు అర్థం. ఒకవేళ అడుగుకు చేరితే పిండి ఇంకా మెత్తగా గ్రైండ్ కాలేదని గుర్తించాలి. అలాంటప్పుడు మరికొంత సమయం గ్రైండ్ చేసుకోవాలి.

స్టెప్ 5: ఇడ్లీ బియ్యాన్ని రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి
ఇప్పుడు ఐదు గంటల పాటు నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యాన్ని గ్రైండర్‌లో కొద్దికొద్దిగా వేసుకోవాలి. అవసరమైనంత నీళ్లు కలుపుతూ గ్రైండ్ చేయాలి. అయితే బియ్యాన్ని మినపగుళ్ల మాదిరిగా పూర్తిగా మెత్తటి పేస్ట్‌లా చేయకూడదు. కొంచెం సన్న రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే ఇడ్లీలు రబ్బర్‌లా సాగుతూ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా బరకగా ఉండేలా చూసుకోవాలి.

స్టెప్ 6: రెండు పిండులను కలపాలి. బియ్యం గ్రైండ్ అయిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న మినప్పిండిని కలపాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకోవాలి. గ్రైండర్‌ను మరో రెండు నిమిషాల పాటు ఆన్ చేసి రెండు పిండులు, ఉప్పు బాగా కలిసేలా చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. పిండి మరీ చిక్కగా లేదా పల్చగా కాకుండా ఇడ్లీ పిండికి తగిన కన్సిస్టెన్సీలో ఉండాలి.

స్టెప్ 7: పిండిని ఎనిమిది గంటలు పులియనివ్వాలి. గ్రైండ్ చేసిన పిండిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి. గది ఉష్ణోగ్రత వద్ద సుమారు ఎనిమిది గంటల పాటు పులియనివ్వాలి. పిండి గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పులిసిన తర్వాత పిండి పరిమాణం పెరిగి, లోపల గాలి బుడగలు ఏర్పడతాయి.

స్టెప్ 8: ఇడ్లీ ప్లేట్లను సిద్ధం చేసుకోవాలి. పిండి బాగా పులిసిన తర్వాత ఒకసారి కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి బాగా మరిగించాలి. మరోవైపు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి సిద్ధం చేసుకోవాలి.

స్టెప్ 9: ఇడ్లీ పిండిని ప్లేట్లలో వేయాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లను పాత్రలో పెట్టాలి. ప్రతి ఇడ్లీ గుంటలో ముప్పావు వంతు వరకు పిండిని వేయాలి. ఇడ్లీలు ఉడికేటప్పుడు కొద్దిగా పొంగుతాయి కాబట్టి పూర్తిగా నింపకూడదు.

స్టెప్ 10: ఇడ్లీలను ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్‌పై 8 నుంచి 10 నిమిషాల పాటు ఇడ్లీలను ఉడికించాలి. ఎనిమిది నిమిషాల తర్వాత ఒకసారి పరిశీలించాలి. చేతిని నీళ్లతో తడిపి ఇడ్లీని తాకినప్పుడు పిండి అంటుకోకపోతే ఉడికినట్లు అర్థం. ఉడికిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటకు తీసి రెండు నిమిషాల పాటు పక్కన పెట్టాలి. వెంటనే ఇడ్లీలను తీస్తే ముక్కలయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పూన్‌ను నీళ్లతో తడిపి నెమ్మదిగా ఇడ్లీలను బయటకు తీయాలి. అంతే.. టిఫిన్ సెంటర్ స్టైల్‌లో స్పాంజీ ఇడ్లీలు సిద్ధం!