kallakurichi collector: మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపుల ఆరోపణలు.. కల్లకురిచ్చి టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్‌పై కేసు నమోదు..
kallakurichi collector: Kallakurichi MLA Faces Harassment Allegations; FIR Registered
kallakurichi collector: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్లకురిచి నియోజకవర్గ తమిళగ వెట్రి కజగం (TVK) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్ పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేసినట్లు తమిళనాడు పోలీసులు మంగళవారం (నవంబర్ 24, 2026) మద్రాస్ హైకోర్టుకు అధికారికంగా తెలియజేశారు. బాధిత మహిళా అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. కోర్టు సూచనల మేరకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) ఆర్. జాన్ సత్యన్ అత్యంత చురుకుగా వ్యవహరించి తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని విచారణ సందర్భంగా జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ప్రశంసించారు.
ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాలంటూ మహిళా న్యాయవాది ఆర్. త్రిశూలి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఆ సమయంలో బాధిత ఐఏఎస్ అధికారిణి నుంచి ప్రధాన కార్యదర్శికి గానీ, పోలీసులకు గానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్పీపీ కోర్టుకు తెలపడంతో.. సంబంధిత అధికారి ఫిర్యాదు లేకుండా కేసు ఎలా నమోదు చేయగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అనంతరం ఆ మహిళా అధికారిణిని సంప్రదించి, ఆమె అభిప్రాయం తెలుసుకుని మరుసటి రోజు కోర్టుకు నివేదించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీని ప్రకారం మంగళవారం విచారణ ప్రారంభమైన వెంటనే, ఎస్పీపీ సదరు మహిళా అధికారితో జరిపిన సంభాషణ వివరాలతో కూడిన లిఖితపూర్వక లేఖను , నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు సమర్పించారు.
ఎఫ్ఐఆర్ , లేఖను పరిశీలించిన జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్.. ఈ వ్యవహారంలో మీడియా సదరు మహిళా అధికారి గుర్తింపును ఎలా బయటపెట్టగలిగిందని తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే, మహిళా ఐఏఎస్ అధికారి తరఫు న్యాయవాది డి. నాగశైల వాదనలు విన్న తర్వాత, ఆ అధికారిణికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అభ్యంతరకర సందేశాలను తొలగించేందుకు సైబర్ క్రైమ్ విభాగం తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ క్రిమినల్ కేసుకు సరైన దర్యాప్తు, పర్యవేక్షణ ఉండేలా చూడటంతో పాటు, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం , పరిష్కార) చట్టం, 2013’ (POSH Act) కింద ఒక ఉన్నత స్థాయి అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరినీ రక్షించే ప్రయత్నం చేయవద్దని, అలాంటి అభిప్రాయం కలగకూడదని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తేల్చిచెప్పిన న్యాయమూర్తి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వాటి పూర్తి వివరాలను త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు.