Skip to content
బిజినెస్ వార్తలు

కృత్రిమ మేధ యుగం, మానవీయ శాస్త్రాల భవిష్యత్తు

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
కృత్రిమ మేధ యుగం, మానవీయ శాస్త్రాల భవిష్యత్తు

కృత్రిమ మేధ యుగం, మానవీయ శాస్త్రాల భవిష్యత్తు

మంచాల కిరణ్‌ కుమార్‌

కృత్రిమ మేధ కేవలం ఒక సాంకేతిక ఆవిష్కరణగా మిగలకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థల నిర్మాణాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. ఏ దేశం చూసినా ఒకే సందేహం, రేపటి ఉద్యోగ మార్కెట్‌కు ఈనాటి డిగ్రీలు సరిపోతాయా అని. అయితే ఈ సందేహానికి జవాబు వెతికే పద్ధతి దేశాన్ని బట్టి పూర్తిగా భిన్నంగా ఉంది. కొన్ని దేశాలు కోర్సులను తొలగించే కఠిన మార్గం ఎంచుకుంటే, మరికొన్ని ఉన్న కోర్సులకే ఏఐను జోడించే సున్నిత మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ రెండు మార్గాల మధ్య మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల భవిష్యత్తు ఏమిటన్నది అసలైన చర్చనీయాంశం.

2021 నుంచి 2025 మధ్య చైనా తన అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో పన్నెండు వేల రెండు వందలకు పైగా కోర్సులను రద్దు చేసి, పది వేల రెండు వందలకు పైగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా మొత్తం డిగ్రీ కోర్సుల్లో ముప్పు శాతానికి పైగా ప్రభావితం చేసింది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ అనువర్తనాలు, ఎంబాడీడ్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో కొత్త కోర్సులు వచ్చాయి. రద్దుల్లో ఎక్కువ భాగం భాషలు, కళలు, మానవీయ శాస్త్రాలకే పరిమితం కావడం గమనార్హం.

చైనా విద్యా మంత్రిత్వ శాఖ 2023లోనే ఇరవై శాతం విశ్వవిద్యాలయ మేజర్లను 2025 నాటికి పునర్వ్యవస్థీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సెమీకండక్టర్లు, కృత్రిమ మేధలో అమెరికాతో పోటీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యూహాత్మక నిర్ణయం. చైనాలో మానవీయ శాస్త్రాల గ్రాడ్యుయేట్ల ప్రారంభ వేతనాలు సాంకేతిక గ్రాడ్యుయేట్ల కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయని మైకోస్‌ సంస్థ నివేదిక చెబుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల నెలవారీ వేతనం విజువల్‌ డిజైన్‌ గ్రాడ్యుయేట్ల కంటే దాదాపు ముప్పు శాతం ఎక్కువగా ఉంది.

అమెరికాలో కృత్రిమ మేధ ప్రభావం వేరే రూపంలో కనిపిస్తోంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో మానవీయ, కళా విభాగాల విద్యార్థుల నిష్పత్తి గత దశాబ్దంలో పదిహేనున్నర శాతం నుంచి పన్నెండున్నర శాతానికి పడిపోయింది. ఒఇసిడి గణాంకాల ప్రకారం, సభ్య దేశాల్లో ఎనభై శాతం దేశాల్లో గత దశాబ్దంలో మానవీయ శాస్త్రాల నమోదు గణనీయంగా తగ్గింది.

బ్రిటన్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రస్సెల్‌ గ్రూప్‌కు చెందిన నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నలభైకి పైగా కోర్సుల్లో కొత్త ప్రవేశాలను నిలిపివేసింది. లీసెస్టర్‌ విశ్వవిద్యాలయం ఫిల్మ్‌ స్టడీస్‌, మోడర్న్‌ లాంగ్వేజెస్‌ విభాగాలనే పూర్తిగా మూసివేసింది. గత ఏడాది కాలంలో బ్రిటన్‌వ్యాప్తంగా నాలుగు వేలకు పైగా కోర్సులు రద్దయ్యాయి. వీటిలో ఎక్కువ భాగం సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలకు చెందినవే.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డెలాయిట్‌ సంస్థ 2026 నివేదిక ప్రకారం, కృత్రిమ మేధ వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతుండటంతో, ముఖ్యంగా అమెరికాలో మానవీయ శాస్త్రాలపై ఆసక్తి మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే యంత్రాలు చేయలేని విమర్శనాత్మక ఆలోచన, నైతిక తర్కం వంటి నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది.

సింగపూర్‌ డిగ్రీ నిర్మాణాన్ని పూర్తిగా మార్చకుండా, స్కిల్స్‌ఫ్యూచర్‌ పథకం ద్వారా జీవితకాల నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెడుతోంది. 2026 మేలో ప్రకటించిన కొత్త విధానం ప్రకారం, 2027 నాటికి అన్ని విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లలో చేరే ప్రతి విద్యార్థికి ప్రాథమిక ఏఐ నైపుణ్యాలు నేర్పించే మాడ్యూళ్లు తప్పనిసరి అవుతాయి. అయితే ఇవి ఆయా విద్యార్థుల ప్రధాన సబ్జెక్టుతో పాటుగానే బోధించబడతాయి తప్ప, దానికి బదులుగా కాదు.

దక్షిణ కొరియా కృత్రిమ మేధ నైపుణ్యాభివృద్ధిని జాతీయ మనుగడ వ్యూహంగా ప్రకటించి, 2027 నాటికి తమ కోర్సుల్లో ముప్పు శాతాన్ని ఏఐతో అనుసంధానించే విశ్వవిద్యాలయాలకు అదనపు పరిశోధన నిధులు ఇస్తూ, చేయని సంస్థలకు నిధులు తగ్గించే ప్రోత్సాహక విధానాన్ని అనుసరిస్తోంది. బలవంతపు కోర్సు రద్దులు కాదు.

జపాన్‌ వైఖరి మరింత ఆసక్తికరం. సొసైటీ 5.0 విధానం కింద ఆర్థిక శాస్త్రం చదివేవారు కోడింగ్‌ నేర్చుకోవడం, సాహిత్యం చదివేవారు డేటాను అర్థం చేసుకోవడం అనే హైబ్రిడ్‌ గ్రాడ్యుయేట్‌ నమూనాను ప్రోత్సహిస్తున్నారు తప్ప, మానవీయ శాస్త్రాలను తొలగించడం లేదు. జపాన్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా డిజిటల్‌ హ్యుమానిటీస్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టి, సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాల విద్యార్థులకే ఏఐ పరికరాలను తమ పరిశోధనలో ఉపయోగించే నైపుణ్యాన్ని అందిస్తున్నారు. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చైనా నమూనాను నిశితంగా పరిశీలిస్తూ కోర్సు సమీక్షల తొలిదశలో ఉన్నాయి. కానీ చైనా తరహా కఠిన తొలగింపులు మాత్రం ఎక్కడా అమలు చేయలేదు.

ఈ ప్రపంచ నేపథ్యంలో భారత్‌ ఎంచుకున్న మార్గం, ఇప్పటికే ఉన్న కోర్సుల చుట్టూ ఏఐ నైపుణ్యాన్ని జోడించడం. కేంద్ర బడ్జెట్‌ 2026- విద్యా రంగానికి లక్షా ముప్పు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించి, అందులో యాభై ఐదు వేల ఏడు వందల కోట్లకు పైగా ఉన్నత విద్యకు కేటాయించడం, మూడో తరగతి నుంచే ఏఐ, కంప్యూటేషనల్‌ థింకింగ్‌ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చాలన్న నిర్ణయం ఈ దిశలో ముందడుగే.

అయితే మెర్సర్‌ మెటల్‌ సంస్థ ఇండియా గ్రాడ్యుయేట్‌ స్కిల్‌ ఇండెక్స్‌ ప్రకారం దేశవ్యాప్తంగా నలభై రెండున్నర శాతం గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో తెలంగాణ మొత్తం ఉపాధి యోగ్యత దాదాపు నలభై ఏడున్నర శాతంగా నమోదైంది. నాన్‌ టెక్నికల్‌ విభాగంలో ఇది యాభై ఒక్క శాతం దాటినా, సాంకేతిక ఉద్యోగాల ఉపాధి యోగ్యతలో దక్షిణాది రాష్ట్రాలేవీ మొదటి పది స్థానాల్లో లేకపోవడం గమనార్హం.

టీజీ ఈఏపీసెట్‌ 2025లో కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ అనుబంధ కోర్సులకు తొంభై ఒక్క శాతం సీట్ల భర్తీ నమోదు కావడం, పన్నెండు వేలకు పైగా ఏఐ అండ్‌ ఎంఎల్‌ సీట్లు, ఇరవై ఆరువేలకు పైగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉండటం విద్యార్థుల మొగ్గు ఎటువైపో చూపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీలో ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీ కోసం ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని, దేశంలోనే తొలి అంకిత ఏఐ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది. ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం కోడ్‌మిత్ర వేదిక ద్వారా ఏఐ అక్షరాస్యత కార్యక్రమాన్ని ఇరవై లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విస్తరించడం, పది జిల్లా కేంద్రాల్లో ఏఐ, నైపుణ్యాధారిత మైనారిటీ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పునాది స్థాయి నుంచే సంస్కరణ మొదలుపెట్టాలన్న అవగాహనను చూపిస్తున్నాయి. అయితే ఇవి ఇంకా ప్రయోగాత్మక ప్రాజెక్టులుగానే ఉన్నాయి తప్ప, రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత ప్రమాణంగా మారలేదు.

కృత్రిమ మేధ యుగంలో సాంకేతిక నైపుణ్యమే సర్వస్వం అనుకోవడం పొరపాటు అని అంతర్జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక 2025లో విడుదల చేసిన ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌ నివేదిక ప్రకారం, పది మంది యజమానుల్లో ఏడుగురు అనలిటికల్‌ థింకింగ్‌ను అత్యంత అవసరమైన నైపుణ్యంగా పేర్కొన్నారు. ఇది వరుసగా మూడో నివేదికలోనూ మొదటి స్థానంలో నిలిచింది. క్రియేటివ్‌ థింకింగ్‌ నాలుగో స్థానంలో, రెసిలియన్స్‌, లీడర్‌షిప్‌, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌ వంటి మానవ కేంద్రిత నైపుణ్యాలు తొలి ఐదింటిలో చోటు దక్కించుకున్నాయి. అంటే ఏఐ, డేటా నైపుణ్యాలతో పాటు, మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు నేర్పించే విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సామాజిక అవగాహన కూడా భవిష్యత్‌ ఉద్యోగ మార్కెట్‌కు అంతే అవసరమని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆదాయ గణాంకాలు కూడా ఈ వాదనకు మద్దతుగా నిలుస్తున్నాయి. జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయ సెంటర్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ద వర్క్‌ఫోర్స్‌ అధ్యయనం ప్రకారం, పంతొమ్మిది మానవీయ, కళా విభాగాల్లో పధ్నాలుగు విభాగాలు, స్టెమ్‌ గ్రాడ్యుయేట్ల ఆదాయంలో దిగువ పాతిక శాతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాయి. ప్రారంభ వేతనాల్లో స్టెమ్‌ గ్రాడ్యుయేట్లు ముందుండగా, కెరీర్‌ మధ్యలో ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం వంటి సామాజిక శాస్త్ర విభాగాలు జీవశాస్త్రం వంటి కొన్ని స్టెమ్‌ విభాగాలతో సమానంగా లేదా అంతకుమించి ఆదాయాన్ని అందిస్తున్నాయని ఈ అధ్యయనం చూపిస్తుంది. బ్రిటన్‌లోని రస్సెల్‌ గ్రూప్‌ గణాంకాల ప్రకారం కూడా అత్యధిక ప్రమాణాలున్న సంస్థల్లో మానవీయ శాస్త్రాల గ్రాడ్యుయేట్లలో తొంభై ఒక్క శాతం మంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అంటే మానవీయ శాస్త్రాలను తక్షణ ప్రయోజనం లేని కోర్సులుగా తీసిపారేయడం కంటే, వాటిని ఏఐ నైపుణ్యాలతో జోడించి బలోపేతం చేయడమే దీర్ఘకాలిక ప్రయోజనకరం.

ఈ ప్రపంచ అనుభవాల నుంచి భారత్‌, తెలంగాణ నేర్చుకోవాల్సింది స్పష్టంగా కనిపిస్తోంది. చైనా వేగం, అమెరికా, బ్రిటన్‌లలో ఆర్థిక ఒత్తిడితో వస్తున్న బలవంతపు కోతలు రెండూ ఆదర్శప్రాయం కావు. కృత్రిమ మేధ నైపుణ్యాన్ని ప్రతి డిగ్రీలో భాగం చేయడం అవసరమే తప్ప, దాని పేరుతో మానవీయ శాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదు. జాతీయ విద్యా విధానం 2020కి ఇప్పుడు అవసరమైంది కేంద్రీకృత ఏఐ అనుబంధమే తప్ప, కోర్సుల ఏకపక్ష తొలగింపు కాదు. ఇంజినీరింగ్‌ సిలబస్‌లు సిస్టమ్స్‌ థింకింగ్‌ చుట్టూ పునర్నిర్మించుకోవాల్సినంతే, హ్యుమానిటీస్‌ కోర్సులు డిజిటల్‌ హ్యుమానిటీస్‌గా, కల్చరల్‌ అనలిటిక్స్‌గా పరిణామం చెందాల్సిన అవసరం ఉంది. సింగపూర్‌, జపాన్‌ చూపిన సమతుల్య మార్గం, దక్షిణ కొరియా చూపిన ప్రోత్సాహక విధానం, తెలంగాణ ప్రారంభించిన పునాది స్థాయి కార్యక్రమాలను ఒక జాతీయ ప్రమాణంగా విస్తరించడం ఇప్పుడు కావాల్సింది. ప్రతి డిగ్రీ పట్టభద్రుడు ఏఐ నైపుణ్యంతో పాటు, విమర్శనాత్మక ఆలోచన, మానవీయ దృక్పథంతో బయటకు వచ్చే విద్యా వ్యవస్థను నిర్మించుకోవడమే వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యానికి నిజమైన బాట.

ట్యాగ్‌లు: Technology