Andhra Pradesh Weather Today: ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఐఎండీ అలర్ట్
శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. జూలై 25న ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరోవైపు విపత్తు నివారణ శాఖ వర్ష సూచన చేసింది. శ్రీకాకుళం, మన్యం, విశాఖ, విజయనగరం, అల్లూరి, అనకాపల్లితో పాటు ఏలూరు, కృష్ణా, వైఎస్సార్ కడప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే వీలుంది. వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతంలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజుల్లో (జూలై 28-30) విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. తొలి రెండు రోజుల్లో (జూలై 24-26) ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు (40-50 కిలో మీటర్లు) వీస్తాయని అంచనా వేస్తున్నారు. వారం చివర్లో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండటంతో పాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడవచ్చు.
రాయలసీమ:
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ (కడప), అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండటంతో పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. కర్నూలు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మొదటి రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాకుండా, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.