Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీళ్లు లేవు..రైతులు వరి పంట వేయవద్దు.. తాగునీటికే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీ నరసింహమూర్తి

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
నీళ్లు లేవు..రైతులు వరి పంట వేయవద్దు.. తాగునీటికే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీ నరసింహమూర్తి

నీళ్లు లేవు..రైతులు వరి పంట వేయవద్దు.. తాగునీటికే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీ నరసింహమూర్తి

రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి అవసరాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని ఆరుతడి పంటల వైపు మళ్లాలని ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి స్పష్టం చేశారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గిందని.. రాష్ట్ర వ్యాప్తంగా 51 శాతం, కృష్ణా డెల్టా పరిధిలో 49 శాతం వర్షపాత లోటు నమోదైందని తెలిపారు.

ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, తుంగభద్రలో 70 టీఎంసీల మేర ‘కుషన్’ మట్టాలు ఉండటంతో, అవి నిండితేనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి ప్రవాహం సాధ్యమవుతుందన్నారు. నాగార్జునసాగర్‌లోనూ కుషన్ మట్టాలు పూరిస్తే తప్ప దిగువకు నీరు విడుదల చేయలేమని వివరించారు. ఈ పరిణామాల దృష్ట్యా 2027 జూన్ వరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని.. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని 60 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాల కోసం పులిచింతల నీటిని భద్రపరిచామని వెల్లడించారు.

మరోవైపు గోదావరిలోనూ ప్రవాహాలు తగ్గిపోయాయని.. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలు లేక ఎగువ జలాశయాలు నిండలేదని చెప్పారు. సీలేరు నీటి లభ్యత కూడా తగ్గడంతో, ప్రతి ఏటా 100 నుండి 125 రోజులు ఉండే గోదావరి ప్రవాహం ఈసారి 60 నుండి 70 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పట్టిసీమలోని అన్ని పంపులను ఒకేసారి నడపడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు.

కృష్ణా డెల్టా సాగుకు 150 టీఎంసీలు అవసరం కాగా.. ప్రస్తుతం అంత నీటి లభ్యత లేదని ఈఎన్‌సీ స్పష్టం చేశారు. నీళ్లు లేని సమయంలో వరి సాగు చేస్తే పంట మధ్యలో ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ఆ ఆర్‌ఎంసి (RMC) కాల్వ నుంచి అనధికారికంగా పంపులు పెట్టి నీటిని తోడవద్దని, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగితే వ్యవసాయ శాఖతో చర్చించి తగిన ప్రణాళిక ప్రకటిస్తామని.. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే ఆరుతడి పంటలకు నీటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ బి. రాంబాబు, ఎస్‌ఈ జె. సుగుణాకర్ పాల్గొన్నారు.