Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ప్రభుత్వం మెడలు వంచిన ‘కాక్రోచ్‌ల’ ఆందోళన

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ప్రభుత్వం మెడలు వంచిన ‘కాక్రోచ్‌ల’ ఆందోళన

ప్రభుత్వం మెడలు వంచిన ‘కాక్రోచ్‌ల’ ఆందోళన

పట్టువిడవని నవతరం జన్‌ జీ విద్యార్థుల ప్రజాస్వామ్యయుత ఆందోళన కేంద్ర సర్కార్‌ మెడలు వంచింది. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజికి జవాబుదారీగా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ను తిరస్కరిస్తూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ విధిలేని పరిస్థితిలో శనివారం మధ్యాహ్నం ఆయన చేత రాజీనామా చేయించారు. ఇది యువశక్తికి విజయంగా, ప్రజాస్వామ్య విజయంగా జంతర్‌మంతర్‌లో కేరింతలు కొట్టిన కాక్రోచ్‌ జనతాపార్టీ (సిజెపి) నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకోగా, ‘కాక్రోచ్‌లు గెలిచాయి, ప్రజాస్వామ్యం గెలిచింది’ అని ప్రకటించిన సిజెపి ఆన్‌లైన్‌ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, అంబేద్కర్‌ చిత్రపటాన్ని, రాజ్యాంగాన్ని చేబూని, ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమకు రాజకీయాలు అవసరం లేదన్నారు.

ప్రధాన్‌ రాజీనామాకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌పై రాజీలేదని, ఆయన రాజీనామా చేస్తేనే ఈ రోజు (శనివారం మధ్యాహ్నం) చర్చలకు వస్తామని, లేనిపక్షంలో ప్రధాన్‌ బదులు ప్రధానమంత్రి రాజీనామా కోరాల్సి ఉంటుందని సిజెపి ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టినట్లు ఉదయాన్నే టీవీలు స్క్రోలింగ్‌ మోసుకొచ్చాయి. విద్యార్థులను సంతృప్తిపరిచేందుకై ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి వేరే శాఖకు మార్చవచ్చన్న ప్రచారానికి జవాబుగా వారు ఆ ట్వీట్‌ చేశారు.

కాక్రోచ్‌ల మహిళా బృందం, కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని కలిసి తమ డిమాండ్‌లకు ఆయన మద్దతు కోరారు. విద్యార్థులు ప్రధాన్‌ రాజీనామా కోరుతున్నారని, వారి కోర్కెలను తాము బలపరుస్తున్నామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు.

మోదీ ప్రభుత్వం ఒకవైపు సిజెపి ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే, మరోవైపున వారి ఆందోళనపై బురద జల్లేందుకు సంఘ వ్యతిరేకులు, దేశద్రోహులు, విదేశీ శక్తులు ఉద్యమంలో చేరారనే ప్రచారం చేస్తూనే వచ్చింది. పోలీసులు కూడా అదే ప్రచారం చేస్తూ పాత నేరస్థులను గుర్తించేందుకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారు. ఎన్‌టిఏలో ప్రక్షాళన చర్యలతోపాటు లీకేజీలకు పాల్పడేవారికి కఠిన శిక్షలకోసం చట్టసవరణను కేంద్రమంత్రివర్గం శుక్రవారమే ఆమోదించి ఆ నిర్ణయాలకు ప్రచారం ఇచ్చింది. వాంగ్‌చుక్‌ చేత 26 రోజుల నిరాహారదీక్షను మంత్రులు శుక్రవారం విరమింపజేశారు. అయితే ఈ ప్రయత్నాలేవీ సిజెపి నాయకత్వాన్ని బుజ్జగించలేకపోయాయి. ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌ను వారు సడలించలేదు.

రోజులు గడిచేకొలది విద్యార్థి ఉద్యమం వివిధ రాష్ట్రాల్లోని పట్టణాలకు విస్తరిస్తున్నది. సోమవారం పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. కాబట్టి, ఇంకా రచ్చ నష్టదాయకమని భావించిన ప్రభుత్వ ముఖ్యులు బహుశా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశంపై ధర్మేంద్ర ప్రధాన్‌ చేత రాజీనామా చేయించారు. పోలీసులు జంతర్‌మంతర్‌ దగ్గర అవరోధాలు తొలగించారు. సెంట్రల్‌ ఢిల్లీలో కొన్ని రోజులుగా మూసివేసిన 16 మెట్రో స్టేషన్‌లు తిరిగి తెరిచారు.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్రమంత్రులు జె.పి. నడ్డా, జితేంద్ర సింగ్‌ సిజెపి అధికార ప్రతినిధులు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ మధ్య చర్చలు పునఃప్రారంభమైనాయి. కాక్రోచ్‌ల మిగతా రెండు కోర్కెలకు విద్యార్థులపై పెట్టిన కేసుల ఎత్తివేత, నీట్‌ లీకేజి తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం అంగీకరించింది.

ఇది తిరుగులేదనుకునే నరేంద్ర మోదీకి మూడో ఎదురుదెబ్బ. తొలిటర్మ్‌లో భూసేకరణ పరిహారాలు తగ్గించటానికి ఆయన తెచ్చిన ఆర్డినెన్స్‌లను రైతాంగం వ్యతిరేకించటంతో ఉపసంహరించుకున్నారు. రెండో టర్మ్‌లో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మోదీ తెచ్చిన మూడు నల్లచట్టాలను ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సంవత్సరంపాటు బైఠాయింపు ఆందోళన జరిపి, ఎముకలు కొరికే చలిలో 100 మందికిపైగా చనిపోయాక ప్రధాని మోదీ (యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు) దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నారు. మూడో టర్మ్‌లో విద్యార్థుల ఆగ్రహానికి గురయ్యారు.

ఏ దేశ యువత భవిష్యత్‌కైనా సమాజ అవసరాలకు తగిన విద్యావ్యవస్థ అత్యంతావశ్యకం. అయితే శాస్త్రం కన్నా సనాతన ధర్మంలో విశ్వాసం కలిగి ఉన్న బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సనాతన ధర్మ ఛాయల్లో విద్యార్థుల ఆలోచనను ప్రభావితం చేయటం పనిగా పెట్టుకుంది. పాఠ్యపుస్తకాల్లో అది చేస్తున్న మార్పులు చేర్పులు ఇందుకు నిదర్శనం. ఉన్నతవిద్యను కేంద్రీకరణ చేస్తున్నది. రెండోవైపున నిరుద్యోగం తాండవిస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానంతో 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఆ మాట మరిచిపోయారు. విద్య ప్రైవేటీకరణ పెరుగుతుండటంతో అది సామాన్యులకు ప్రతిభ ఉన్నా ఆర్థికంగా మోయలేని భారమైంది. అన్ని పైచదువులకూ పోటీ పరీక్షలు ప్రవేశపెట్టటంతో కోచింగ్‌ సెంటర్‌లు విద్యార్థుల కుటుంబాలను పిండుకుంటున్నాయి. మాఫియాలుగా ఏర్పడి ప్రశ్నాపత్రాలతో చీకటి వ్యాపారం చేస్తున్నాయి. ఆ దొంగ వ్యాపారం కొనసాగింపే నీట్‌ 2026 ప్రశ్నాపత్రం లీకేజి. 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ బాధ్యుల్లో చలనం లేదు.

ఎక్కడో అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్‌ దీప్కే అనే విద్యార్థి చలించాడు. అప్పుడే నిరుద్యోగుల గురించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ చేసిన ‘కాక్రోచ్‌లు’ అన్నట్లు చెప్పబడుతున్న వ్యాఖ్యను వ్యంగ్యంగా తీసుకుని ఆన్‌లైన్‌లో ఆ పేరుతో పార్టీ ప్రకటించాడు. మూడు రోజుల్లోనే ఐదారు లక్షల మంది ఫాలోవర్లు చేరటంతో బెదిరిపోయిన మన ఘనత వహించిన మోదీ ప్రభుత్వం సామాజిక మాధ్యమం నుంచి ఆ సైట్‌ను నిషేధింపజేసింది. దీప్కే ఆ తర్వాత స్వదేశం వచ్చాడు. హిందూత్వ దురహంకారులు అతని పర్యటనలను అడ్డుకున్నారు. వారి భయపెట్టే ప్రయత్నాలు ఫలించలేదు. అతడు నెలరోజుల్లోనే జంతర్‌మంతర్‌ చేరాడు. సోషల్‌ మీడియా ద్వారా ఉద్యమం నిర్మించాడు. ఇది మన దేశంలో కొత్త. దాని పరిణామాలు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌లో చూశాం. ఇంతటి సువిశాల దేశంలో, పాలకపార్టీ బలంగా వేళ్లూని ఉండగా ఆ తరహాలో ప్రభుత్వ మార్పు సాధ్యం కాదని కాక్రోచ్‌లకూ తెలుసు. అందుకే నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో అసంతృప్తితో ఉడికిపోతున్న విద్యార్థులను తమ ఉద్యమానికి లక్ష్యంగా ఎంచుకున్నారు. విజయం సాధించారు.

అయితే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దేశ భవిష్యత్‌లో యువత నిజంగా పాత్ర వహించాలంటే ప్రతిపక్షాలతోపాటు సామాజిక ఉద్యమాలు డేగ కన్నుతో పనిచేయాలి. అటువంటి ఐక్యత ఫలితాలు సాధిస్తుందని కాక్రోచ్‌ల అయత్నకృత ఆందోళన నిరూపించింది.

ట్యాగ్‌లు: editorial