Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial: బెంగాల్‌లో ఇసి తొండాట!

Prajapaksham 20 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: బెంగాల్‌లో ఇసి తొండాట!

ఫుట్‌బాల్‌ ఆటలో తొండి జరగకుండా చూడాల్సిన బాధ్యత రెఫరీది. ఎన్నికల మైదానంలో అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది. కానీ, ‘పోదురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఇసి తన తటస్థ పాత్రను పక్కనపడేసింది. అధికార బిజెపి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఏకంగా తన భుజస్కంధాలపై ఎత్తుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.

నందిగ్రామ్‌, రెజీనగర్‌ ఉప ఎన్నికల నామినేషన్‌ ఉపసంహరణ గడువుకు రెండు రోజుల ముందు ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని, గడ్డి పూల ఎన్నికల గుర్తుపై పోటీ నిలిపివేస్తూ సెప్టెంబర్‌ 17 రాత్రిపూట ఇసి తరఫున ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉప ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా పార్టీ పేరు, ఎన్నికల గుర్తులను 14 గంటల్లో తమకు పంపాలని పార్టీ వ్యవస్థాపకురా మమతా బెనర్జీ, చీలిక వర్గ నేత రీతాబ్రత బెనర్జీకి తాఖీదులు పంపింది.

మమతా బెనర్జీ పంపిన మూడు ప్రతిపాదనల నుంచి మమతా ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును, ఫుట్‌బాల్‌తో ఆడుతున్న క్రీడాకారుడి ఎన్నికల చిహ్నాన్ని ఎన్నికల సంఘం కేటాయించింది. ప్రత్యర్థి శిబిరానికి డెమ్రొకాటిక్‌ ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరు, ఎన్వలప్‌ గుర్తును ఖరారు చేశారు.

గతంలో మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఒక వర్గానికి ఉద్దవ్‌ శివసేన, మరో వర్గానికి షిండే శివసేన అనే పేర్లు ఖరారయ్యాయ. కానీ బెంగాల్‌లో చీలిక వర్గానికి నేతృత్వం వహిస్తున్న రీతబ్రత తన పేరును పార్టీకి ముందు లేదా వెనుక పెట్టుకునే సాహసం చేయలేకపోయారు. ఇది ఆ వర్గంలో ప్రజామోదం పొందబోమనే భయాన్ని చెప్పకనే చెబుతోంది.

ఉప ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 9న ప్రారంభమై, 16 వరకు సాగింది. సెప్టెంబర్‌ 17న నామినేషన్‌ల పరిశీలన, 19న ఉపసంహరణకు గడువును విధించారు. అక్టోబర్‌ 6న పోలింగ్‌ జరగనుంది. అంటే, కొత్త గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మమతా టిఎంసికి పట్టుమని 20 రోజుల సమయం కూడా లేదు.

అయినప్పటికీ మమతా బెనర్జీ పట్ల ప్రజల్లో సానుభూతి ఉందేమోననే సందేహం బిజెపిలో నెలకొంది. ఆమె పార్టీకి కనీసం అభ్యర్థులు లేకుండా ముఖ్యమంత్రి సువేంధు అధికారి పన్నాగం పన్నారు. ఆయనతో భేటీ అయిన వెంటనే నందిగ్రామ్‌లో టిఎంసి అభ్యర్థి సంచితా ప్రధాన్‌ నామినేషన్‌ను ఉపసంహరించుకుంది.

వెంటనే కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు మమత తమ పార్టీ మద్దతును ప్రకటించారు. అయినా, సువేంధు ప్రభుత్వం పట్టువీడలేదు. 2007 నాటి నందిగ్రామ్‌ ఉద్యమంలో పెట్టిన పాత కేసును తొవ్వి మిలన్‌ ప్రధాన్‌ను అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల కస్టడీ విధించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అయింది.

మరోవైపు రెజీనగర్‌లో సైతం మమతా బెనర్జీ పార్టీ అభ్యర్థి రబీయుల్‌ ఆలం చౌధురి పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థులు కొత్త గుర్తు ప్రచారానికి సరిపడా సమయం లేదనే కారణాలతో నామినేషన్‌ ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మమతా బెనర్జీ రంగంలో దిగి ఆయనతో మాట్లాడి బరిలో ఉండేందుకు ఒప్పించారు.

ఇక ఎన్నికల కమిషన్‌ విషయానికి వస్తే, ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తోందనే ఘనత దానికి ఉండేది. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం భారత ఎన్నికల సంఘా రాష్ట్రపతి నియమిస్తారు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టి.ఎన్‌.శేషన్‌ వ్యహరించిన కాలంలో ఎన్నికల సంఘం శక్తి, ప్రభావం రాజకీయ పార్టీలకు, దేశ ప్రజలకు అర్థమైంది. అంతటి బలం కలిగిన ఎన్నికల కమిషన్‌ అధికార పక్షం చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది.

గత పార్లమెంటు ఎన్నికలకు ముందు నుంచి ఇసి తీసుకుంటున్న నిర్ణయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ప్రధాని నరేంద్ర మోదీకి వంతపాడుతున్నట్లుగా ఉన్నాయి. తానే స్వయంగా ప్రతిపక్షాల గొంతు నులిమిన సందర్భాలెన్నో. అందుకు శివసేన, ఎన్‌సిపిల చీలిక వర్గాలకే అసలు పార్టీని, ఎన్నికల చిహ్నాలను కట్టబెట్టి, ఆ పార్టీల వ్యవస్థాపకులనే పరాయివారిగా చేసిన ఉదంతాలను చూశాం.

ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ‘సర్‌’ పేరిట గంపగుత్తగా ఓట్లు తొలగించి, కాషాయ పార్టీ అప్రజాస్వామికంగా ఎన్నికలను దొంగిలిస్తున్న వైనా పశ్చిమబెంగాల్‌, అస్సోం తదితర రాష్ట్రాలలో ప్రజలకు అనుభవమే.

టిఎంసి నుంచి బైటికెళ్ళిన ఎంఎల్‌ఏలు తమదే అసలైన పార్టీ అని చెప్పుకుంటుంటే, వారితో పాటు బైటికెళ్ళిన ఆ పార్టీ ఎంపిలు అనామక ఎన్‌సిపిఐ పార్టీలో విలీనమై విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.

ఉప ఎన్నికల ముందైనా ఎవరిది అసలైన పార్టీయో తేల్చి, పార్టీని, గుర్తును వారికి కేటాయించాలని మమతా బెనర్జీ మొర పెట్టుకుంది. ఇవేవి కనపడకుండా, వినపడకుండా ఎన్నికల కమిషన్‌ కళ్ళూ, చెవులు మూసుకుంది.

స్వయంగా ప్రతిపక్షాల కాళ్ళలో కట్టెలు పెడుతున్న ఎన్నికల సంఘం తొండాటను దేశ ప్రజలు మరిచిపోరు.

ట్యాగ్‌లు: editorial