Skip to content
ఎడిట్ పేజి వార్తలు

తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరిపేందుకు బెరుకెందుకు?

Prajapaksham 17 Sep 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
తెలంగాణ విలీనాన్ని అధికారికంగా జరిపేందుకు బెరుకెందుకు?

Telangana Merger Day

నిజాం హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం ఒక చారిత్రక ఘట్టం. ఫ్యూడల్‌ పదఘట్టనల నుంచి ఆ స్వాతంత్య్ర మహోదయాన్ని అధికారికంగా స్మరించుకొని గర్వపడటం తెలంగాణ ప్రజల హక్కు. బ్రిటీష్‌ వలస పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు15న స్వాతంత్య్రం పొందితే నైజాం సంస్థాన ప్రజలు మరో సంవత్సరం తర్వాతగాని స్వేచ్ఛావాయువులు పీల్చుకోలేదు. ఎందుకని? ఈ వాస్తవాన్ని భావితరాలు గుర్తుచేసుకోవలదా? భారత స్వాతంత్య్ర దినాన్ని జరుపుకుంటూ తమ సొంతగడ్డ చరిత్రను మరిచిపోవలసిందేనా? ఇక్కడ మరో విచిత్రం చూస్తాం. నైజాం సంస్థానంలో భాగమైన కర్నాటక జిల్లాలు (కల్యాణ కర్నాటక), మహారాష్ట్రలోని మరాఠ్వాడా జిల్లాలు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన (1948 ) సెప్టెంబర్‌ 17వ తేదీని ఎప్పటినుంచో విలీనదినంగా అధికారిక ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ సంస్థాన కేంద్రమైన తెలంగాణలో ఆ చారిత్రక ఘట్టాన్ని అధికారికంగా జరిపేందుకు ఇంతవరకు ఏ ప్రభుత్వం సిద్ధపడలేదు. చరిత్రను ఎంతకాలం తొక్కిపెట్టగలరు?
చరిత్ర గమనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావం, ఆంధ్రతో విలీనంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ మళ్లీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి కెసిఆర్‌ ప్రభుత్వం 2021 నుంచి భారత యూనియన్‌లో విలీన దినాన్ని సమైక్యతాదినం అంటూ తెలంగాణ వీర చరిత్రను మరుగుపరిచే ప్రయత్నం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ సెప్టెంబర్‌ 17ను ‘ప్రజాపాలన దినోత్సవం’గా జరుపుతోంది. ఈ దోబూచులాటలకు కనిపించే కారణం సుస్పష్టం భారత యూనియన్‌లో తెలంగాణను అంతర్భాగం చేసేందుకు ఆనాటి ఫ్యూడల్‌ భూస్వామ్య అణచివేత పరిస్థితులనుబట్టి రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించిందీ, అపారమైన త్యాగాలు చేసిందీ కమ్యూనిస్టులు. దాన్ని గుర్తుచేయటం దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. రెండు, ముస్లిం పాలకునికి వ్యతిరేకంగా పోరాటం; తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ముస్లిం లు లక్షల్లో ఉన్నందున వారికి ఆగ్రహం కలుగుతుందేమోనన్న సందేహం. ముస్లింలకు రాజకీయంగా నాయకత్వ శక్తిగా ఉన్న ఎంఐఎం అలనాటి పరిస్థితుల్లో, రజాకార్‌ ఖాసిం రజ్వీ ఏర్పాటు చేసిన సంస్థ పేరును స్వీకరించినప్పటికీ, ఇప్పటి నాయకత్వం ఆ వారసత్వానికి ప్రతినిధిగా చెప్పుకుంటుందని భావించలేము. వారు ప్రజాస్వామ్య స్రవంతిలో భాగమైనారు. భారత రాజ్యాంగాన్ని శిరసావహిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వారితో కూడా మాట్లాడి సెప్టెంబర్‌ 17ను విలీన దినంగా అధికారికంగా నిర్వహించవచ్చు. ఎందుకంటే, అది చారిత్రక వాస్తవం గనుక. ఆనాటి తెలంగాణ పోరాటంతో ఏ మాత్రం సంబంధంలేని ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి వారు ‘విమోచన’ దినమంటూ, అధికారికంగా జరపాలంటూ ముస్లిం వ్యతిరేక మత విభజన ప్రచారానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఈనాడు ఎన్నో విభాగాలుగా చీలిపోయి, పాత ప్రాభవం, ప్రజాదరణ కోల్పోయినప్పటికీ ‘విముక్తి లేదా విలీన దినం’గా అధికారికంగా జరపాలంటున్నారు. కాంగ్రెస్‌ నోరు మెదపదు. ఇది ఏడు దశాబ్దాలకుపైబడి జరుగుతున్న ఎడతెగని పంచాయతీ. పేరు ఏదైనాకాని సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరిపి తెలంగాణ ఆత్మగౌరవ చరిత్రను చాటిచెప్పాలి.
అంతర్జాతీయ పోరాటాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ వారసత్వంగా కలిగిన కమ్యూనిస్టులు ఎప్పుడూ చరిత్ర పునశ్చరణే కాకుండా కమ్యూనిస్టు ఉద్యమం ఈనాటి పరిస్థితి గూర్చి లోతుగా చర్చించాలి, గుణపాఠాలు తీసుకోవాలి. ప్రపంచంలో, దేశంలో మితవాద ప్రాబల్యం పెచ్చుపెరుగుతున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు, వామపక్ష ప్రభావం సన్నగిల్లుతున్న వాస్తవం పునరాలోచనను పురికొల్పాలి. వివిధ పేర్లతో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపుల్లో పనిచేస్తున్న నాయకుల నిబద్ధతను, నిజాయితీని ఎవరూ శంకించలేరు. కాని కొత్త తరాలను గణనీయంగా ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు. మన దేశంలో వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక, మధ్యేమార్గ శక్తుల ప్రభావం తరుగుతూ హిందూ మతోన్మాద శక్తులు ప్రాబల్యం పెంచుకుంటూ అధికారం చెలాయిస్తున్నాయి, విస్తరించుకుంటున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ చెప్పుచేతల్లోకి తీసుకుని భవిష్యత్‌కు పునాదులు పటిష్టం చేసుకుంటున్నాయి. దీన్ని ఎదుర్కోవటం, వెనక్కి కొట్టటం ఎలా? ఇది నేడు కమ్యూనిస్టు ఉద్యమం ముందున్న ప్రధాన ప్రశ్న. దీనికి సమష్టి కృషి అవసరం. ఉదాహరణకు 10 బోర్డులు విడివిడిగా ఉంటూ, అప్పుడప్పుడూ ఉమ్మడి ప్రకటనలు, మొక్కుబడి ఆందోళనలు చేసేకన్నా అందరూ ఒకే బ్యానర్‌ కిందకు వచ్చి ఒకే పిడికిలి బిగించటం శక్తిమంతం కాదా? విడివిడిగా ఉన్న ప్రజాసంఘాలు, కేడర్లు ఒకే సంఘం కింద చెట్టాపట్టాలేసుకుని ఉద్యమించటం కేడర్లలోనే కాదు, శ్రామికవర్గ ప్రజారాసుల్లోనూ ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం ఇనుమడింపజేయదా? ఇవి ఇప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ స్రవంతులు లోతుగా ఆలోచించాల్సిన అంశాలు. కాలం ఎంతో మారింది, టెక్నాలజీ ప్రతిముంగిటికీ చేరి ఆల్పా జీ నుంచి జన్‌ జీ వరకు ప్రభావితమవుతున్నారు. కాని సిద్ధాంత మూలాలు లేని సమీకరణలు తాత్కాలిక ఆకర్షణలు కావచ్చుగాని శాశ్వత ప్రత్యామ్నాయ శక్తి కాలేవు. వారిని భిన్నమార్గాల్లో ఆకట్టుకుని మార్కిస్టు లెనినిస్టు సిద్ధాంతం సరళమైన పరిభాషలో వారికి సుబోధకం చేయవలసిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉంటుంది. అందువల్ల వార్షికోత్సవాలు, సంస్మరణ సభలు, అడపాదడపా ఆందోళనలు ఈ కాలం వేగాన్ని అందుకోలేవు. కాబట్టి కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణలకు పరిమితం కాకుండా ఐక్యత గూర్చి గంభీరంగా ఆలోచించాలి. అదే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయోత్సవం 78వ వార్షికోత్సవం సందర్భంగా శపథం కావాలి!

ట్యాగ్‌లు: editorial Telangana Telangana news