Skip to content
ఎడిట్ పేజి వార్తలు

EDITORIAL: ఆధిపత్యాన్ని బ్రిక్స్‌ బద్దలు కొట్టేనా?

Prajapaksham 13 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
EDITORIAL: ఆధిపత్యాన్ని బ్రిక్స్‌ బద్దలు కొట్టేనా?

BRICS Summit 2026

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికాలతో కూడిన ‘బ్రిక్స్‌’ ను పశ్చిమ దేశాల ఆధిపత్య ధోరణికి గండి కొట్టే ఒక వేదికగా అందరూ ఆకాంక్షిస్తున్నారు. సంపద దోపిడీకి గురవుతున్న దక్షిణార్థ గోళంలోని అధిక అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో భాగస్వామి కావడమే ఇందుకు కారణం. రష్యా, చైనాలు పశ్చిమ దేశాలకు దీటుగా నిలుస్తుండగా, భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ దేశాలు అపారమైన సహజ వనరులు, జనాభా కలిగిన దేశాలు. బలీయమైన అంతర్జాతీయ శక్తులు ఎదిగే అవకాశముంది. బ్రిక్స్‌లో ఈ ఐదు దేశాలే కాకుండా మరో 6 సభ్యదేశాలు కలిపి, ప్రపంచంలో 49 శాతం జనాభా, 40 శాతం జిడిపికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందుకే అమెరికా, సహా పశ్చిమ దేశాలకు బ్రిక్స్‌ సమావేశాలపట్ల పైకి ఆసక్తి లేనట్లు కనిపించినా, ఏమి జరుగుతోందో ఒక కన్నేసి ఉంటాయి.


బ్రిక్స్‌ అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీ. ఈ ప్రతిపాదనను బ్రిజిల్‌ అధ్యక్షుడు లులా ద సిల్వా బలంగా ముందుకు తీసుకువస్తుంటారు. అలాగే శతకోటీశ్వరులుపై 2 శాతం సంపద పన్ను విధించాలనే ప్రతిపాదన కూడా నలుగుతోంది. ఈ అంశాలు బ్రిక్స్‌ అనుబంధ ఫోరమ్స్‌లలో చర్చకు వచ్చాయి. బ్రిక్స్‌ కామన్‌ కరెన్సీ సాకరమవుతుందేమోననే భయం అమెరికాకు వెంటాడుతూనే ఉంది. అందుకే రియో డి జెనిరోలో జరిగిన గత బ్రిక్స్‌ సదస్సు సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రయత్నాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా డాలర్‌ను పక్కనబెట్టే ఎలాంటి కరెన్సీని అంగీకరించబోమని, అలా చేస్తే ఆయా దేశాలపై టారిఫ్‌ను వంద శాతం పెంచేస్తామని హూంకరించారు ట్రంప్‌. అయితే, బ్రిక్స్‌ కామన్‌ కరెన్సీ ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కి అనే మాదిరిగానే సాగుతోంది.


ఈసారి బ్రిక్స్ కు అధ్యక్షత స్థానంలో ఉన్న భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో 18వ సమావేశం ప్రారంభమైంది. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌లు ఇక్కడకు చేరుకున్నారు. తమ నేలపై బాంబుల వర్షం కురిపిస్తున్నా అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలకు ఎదురొడ్డి నిలుస్తున్న ఇరాన్‌ దేశం అధ్యక్షుడు మౌసూద్‌ పెజిష్కియాన్‌ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఢిల్లీ సదస్సు ఉమ్మడి ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రిక్స్‌ సభ్యదేశాలతో ముడిపడి ఉన్న రష్యా -ఉక్రేన్‌ యుద్ధం, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం, ఇరాన్‌ సౌదీ అరేబియా సంబంధాలు తదితర అంశాల నేపధ్యంలో సదస్సు ప్రాధాన్యత సంతరించుకున్నది. గత సమావేశాల్లో రష్యా దాడుల విషయంలో అనేక తర్జన భర్జనలు జరిగాయి.


పాతికేళ్ల క్రితం మొగ్గ తొడిగిన ఆలోచనతో ఏర్పాటైన బ్రిక్స్‌ 18 ఏళ్లుగా ప్రస్థానాన్ని సాగిస్తున్నది. జి 7 జి 21 శిఖరాగ్ర కూటములకు భిన్నంగా మానవత, సమతా దృక్పథంతో ఈ కూటమి పని చేస్తుంది. వెన్న వెంటనే ప్రపంచ రాజకీయ చిత్రపటంలో మార్పులు ఆశించడం అత్యాశే అయినప్పటికీ బ్రిక్స్‌ ఒక సానుకూల వేదిక. పరస్పర సహకారం, అసమాన ఎగుమతి దిగుమతుల అంతరాల తగ్గింపు, డాలర్‌ రహిత వాణిజ్య ప్రోత్సాహం, సాంకేతిక మార్పిడి, బహుళ ధృవ ప్రపంచ గమనం లో బ్రిక్స్‌ ఒక ఉత్తమ వేదిక. ఇది సరైన మార్గంలో ముందుకు సాగితే ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ సాధ్యమే. అగ్ర రాజ్యాల వివక్షా పూరిత ఆధిపత్యానికి చెక్‌ పెట్టే ఒక సాధనం ఈ కూటమి.

ట్యాగ్‌లు: editorial