Skip to content
ఎడిట్ పేజి వార్తలు

భరోసా లేని ప్రైవేటు ఉపాధ్యాయుడి భవిష్యత్తు

Prajapaksham 11 Sep 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
భరోసా లేని ప్రైవేటు ఉపాధ్యాయుడి భవిష్యత్తు

అక్షర శిల్పులకు అర్హత సెగ

భారతదేశం విద్యారంగంలో వేగంగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు విస్తరిస్తున్నాయి. విద్య ఒక ప్రజాసేవ మాత్రమే కాకుండా భారీ ఆర్థిక రంగంగా కూడా మారింది. కోట్లాది కుటుంబాలు తమ పిల్లల చదువుకోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యతోపాటు విద్యాసంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. విద్యా మార్కెట్‌ విస్తరిస్తోంది. కానీ ఈ విస్తరణకు వెన్నెముకగా నిలుస్తున్న ఉపాధ్యాయుడి ఉద్యోగం, ప్రత్యేకించి ప్రైవేటు టీచర్ల ఉద్యోగ భద్రత మాత్రం చాలాచోట్ల ఇంకా అస్థిరంగానే ఉంది.
ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల సంక్షేమం, సామాజిక భద్రత, పదవీ విరమణ అనంతర రక్షణ కోసం దేశవ్యాప్తంగా సమగ్ర జాతీయ విధానం, చట్టబద్ధ వ్యవస్థ రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారణకు స్వీకరించడం కీలకమైన పరిణామం. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను నాలుగు వారాల తర్వాత విచారణకు తీసుకోనుంది. ఇది తీర్పు కాదు. ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ వెంటనే పెన్షన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సందర్భం కూడా కాదు. అయితే న్యాయస్థానం దేశవ్యాప్త సమస్యగా ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరడం మాత్రం ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన అడుగు. ఇంతకాలం రాష్ట్రాలవారీగా, సంస్థలవారీగా, ఉద్యోగ ఒప్పందాలవారీగా విడిపోయిన సమస్య ఇప్పుడు జాతీయ స్థాయి చర్చలోకి వస్తోంది. ఈ సమస్య పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి విద్యా వ్యవస్థ గణాంకాలే చాలు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారతదేశంలో 14.72 లక్షల పాఠశాలలు, సుమారు 98 లక్షల మంది ఉపాధ్యాయులు, 24.8 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు సుమారు 69 శాతం ఉండగా, ప్రైవేటు పాఠశాలల వాటా 22.5 శాతం. అయితే ప్రైవేటు పాఠశాలలు 32.6 శాతం మంది విద్యార్థులకు విద్య అందిస్తూ, మొత్తం ఉపాధ్యాయుల్లో సుమారు 38 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అంటే ప్రైవేటు విద్యా రంగాన్ని విద్యా వ్యవస్థకు వెలుపల ఉన్న చిన్న భాగంగా చూడటం వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. పిటిషన్‌లో పేర్కొన్న లెక్కల ప్రకారం గుర్తింపు పొందిన ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే 37,30,047 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సంక్షేమ వ్యవస్థ లేకపోవడం తీవ్రమైన విధాన లోపం. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు, ప్రైవేటు పాఠశాలలో అదే అర్హతతో అదే వయస్సు పిల్లలకు అదే సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుడు మధ్య అంతులేని వ్యత్యాసం. ఇద్దరి పనికి సామాజిక విలువలో తేడా లేదు. కానీ వారి ఉద్యోగ భద్రత, వేతనం, సెలవులు, పదోన్నతి, ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాల్లో మాత్రం విపరీతమైన తేడాలున్నాయి. ఇది కేవలం ఉద్యోగ సంబంధిత అసమానత కాదు… విద్యా నాణ్యతను కూడా ప్రభావితం చేసే సమస్య. తెల్లవారితే ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని ఉపాధ్యాయుడి నుంచి దీర్ఘకాలిక నిబద్ధతను ఎలా ఆశించగలం?
ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని, మేధో సామర్థ్యాన్ని, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే తన జీవన భద్రత గురించి ప్రతిరోజూ ఆందోళన చెందాల్సి వస్తే బోధనలో స్థిరత్వం ఎలా వస్తుంది? ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య హక్కులను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒక విద్యాసంస్థను నిర్వహించడానికి ఆర్థిక స్వాతంత్య్రం, పరిపాలనా స్వేచ్ఛ అవసరం. కానీ ఆ స్వేచ్ఛకు ఒక హద్దు ఉంటుంది. విద్యాసంస్థను నిర్వహించే హక్కు, అక్కడ పనిచేసే మనుషుల ప్రాథమిక హక్కులను హరించే అధికారం కాదు. దేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ ఫీజులతో సంస్థలు భవనా లు నిర్మిస్తాయి, సాంకేతిక వసతులు ఏర్పాటు చేస్తాయి, విస్తరణ చేపడతాయి. అదే సమయంలో ఆ సంస్థలను నడిపించే ఉపాధ్యాయుల వేతనాలు, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కూడా సంస్థ బాధ్యతలో భాగం కావాలి. విద్యా సంస్థ లాభదాయకమైన వ్యాపార నమూనాగా పనిచేస్తే, అందులో పనిచేసే మనుషుల హక్కులను కూడా వ్యాపార వ్యయంగా పరిగణించి తగ్గించడం సమర్థనీయం కాదు. రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 21 ఎ’ పిల్లలకు విద్యా హక్కును హామీ ఇస్తుంది. ఆ హక్కును అమలు చేయడానికి ప్రభుత్వం విద్యా ప్రమాణాలను నిర్ణయిస్తుంది. ఉపాధ్యాయుల అర్హతలను నిర్దేశించేందుకు ఎన్‌సిటిఇ వంటి సంస్థలు పనిచేస్తాయి. విద్యా నాణ్యతపై నియంత్రణ ఉంటుంది. పాఠశాలల గుర్తింపు కోసం నిబంధనలు ఉంటాయి. కానీ ఒక సంస్థ గుర్తింపు పొందిన తర్వాత అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడి దీర్ఘకాలిక సామాజిక భద్రతకు దేశవ్యాప్తంగా స్పష్టమైన వ్యవస్థ లేకపోతే ఆ నియంత్రణలో భారీ లోపంగానే ఉండిపోతుంది. ఇటీవల ఉపాధ్యాయుల అర్హతలు, ఉపాధ్యాయ విద్యా సంస్థల నాణ్యతపై కూడా సుప్రీంకోర్టు దృష్టి సారించింది.
నాణ్యమైన విద్యకు నాణ్యమైన ఉపాధ్యాయులు అవసరమని న్యాయస్థానం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. అర్హతలు, శిక్షణ, పనితీరు విషయంలో ఉపాధ్యాయుల పై బాధ్యతలు విధించే వ్యవస్థ ఉంటే, వారి ఉద్యోగ జీవితానికి కనీస భద్రత కల్పించే వ్యవస్థ కూడా సమాంతరంగా ఉండాలి. ఉపాధ్యాయుడి నుంచి బాధ్యత కోరుతూ, అతని హక్కుల విషయంలో మాత్రం వ్యవస్థ మౌనం వహించడం న్యాయసమ్మతం కాదు. కేంద్రం విద్యను జాతీయ అభివృద్ధికి పునాదిగా ప్రకటిస్తోంది. రాష్ట్రాలు విద్యా రంగాన్ని తమ ప్రధాన ప్రజా బాధ్యతల్లో ఒకటిగా చెబుతున్నాయి. ప్రైవేటు రంగాన్ని విద్యా విస్తరణలో భాగస్వామిగా ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయి. అయితే అదే భాగస్వామ్య రంగంలో పనిచేసే లక్షలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత విషయం లో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం బాధ్యతను బదిలీ చేసుకునే పరిస్థితి కొనసాగకూడదు. అందుకే, దేశవ్యాప్తంగా కనీస సేవా ప్రమాణాలను నిర్ణయించాలి. నియామక పత్రం తప్పనిసరి చేయాలి. వేతన చెల్లింపులకు పారదర్శక వ్యవస్థ ఉండాలి. ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ ప్రయోజనాల అమలును కట్టుదిట్టం చేయాలి. ఉద్యోగాన్ని అకస్మాత్తుగా తొలగించే పద్ధతులకు నియంత్రణ అవసరం. ఉపాధ్యాయులకు స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఉండాలి. పదవీ విరమణ తర్వాత కనీస సామాజిక భద్రత కల్పించే విధానాన్ని రూపొందించాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెరగ డం ఉన్నత విద్య విస్తరణకు సంకేతం కావచ్చు. కానీ వాటిలో పనిచేసే ఉపాధ్యాయుడు రేపటి గురించి భయపడుతుంటే ఆ అభివృద్ధి అసంపూర్ణమవుతుంది. అందుకే, నేటి సుప్రీం కోర్టు నిర్ణయం కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.

ట్యాగ్‌లు: editorial Teachers Telangana