Telangana Assembly Session: సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రలు.. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana Politics
Telangana Assembly Session: శాసనసభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆయన ఫాంహౌస్‌లోనే కుట్రలు పన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికారం పోయినా అహంకారం వీడని బీఆర్ఎస్ నాయకులు పోలీసు అధికారులను, ప్రజాప్రతినిధులను దూషిస్తూ మూడు రోజుల పాటు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గురువారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సభలో అధికారులపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సభాపతిని అత్యంత తీవ్ర పదజాలంతో దూషించారని మరియు మహిళా అధికారుల ముందే టీషర్టులు విప్పి అభ్యంతరకరంగా నిరసన తెలపడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిగజారుడుతనానికి నిదర్శనమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేసి దళితులను ఘోరంగా అవమానించారని, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుండి జరిగిన ఈ ఘటనలన్నింటిపై ప్రభుత్వం తరఫున సమగ్ర విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
కాంగ్రెస్ ద్వారానే రాజకీయంగా ఎదిగిన సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు అదే పార్టీకి నష్టం చేయాలని చూడటం దారుణమని, కేటీఆర్‌కు పోలీస్ సిబ్బందిలో కూడా తన రూపమే కనిపిస్తున్నందుకే అధికారులపై ఆక్రోశంతో దాడులకు తెగబడుతున్నారని ఎద్దేవా చేశారు.
పాలనాపరంగా తమ ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. చారిత్రక భవనంలో శాసన మండలిని పునఃప్రారంభించడంతో పాటు, అసెంబ్లీలోని సెంట్రల్ హాల్‌కు మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ‘ఎస్ఐఆర్’ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించే పెద్ద కుట్ర జరుగుతోందని, దేశంలో 103 కోట్ల వయోజనుల జనాభా ఉంటే ఓటర్ల జాబితాలో కేవలం 88 కోట్లే చూపిస్తూ 15 కోట్ల ఓట్లు గల్లంతు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు పరిరక్షణపై దృష్టి పెట్టాలని, సభకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రజా సమస్యలను లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారు.
- Telangana Assembly Session: సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రలు.. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Telangana Assembly Session: 59 వేల నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన..
- Telangana Assembly Session: ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమ ప్రమాద బీమా పథకం అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- 15 ఏళ్ల నా కల ‘పంచనామా’.. ఉదయభాను
- ‘రణబాలి’ టీజర్ విడుదల