Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Prajapaksham 11 Sep 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

Chakali Ilamma

కామిడి సతీష్‌ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటంలో మడమ తిప్పని పోరాట యోధురాలు ఆమె. సెప్టెంబరు 26, 1895న జన్మించారు. చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ. వరంగల్‌ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్‌ముఖ్‌, రజాకర్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.
మల్లంపల్లి భూస్వామి కొండలరావు కు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందు లో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్‌ 10,1985న అనారోగ్యంతో మరణించింది.
(సెప్టెంబరు 10న చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా)