Skip to content
జాతీయం వార్తలు

పండుగ సమయంలో మాంసం తింటే పాపాత్ములా?

Prajapaksham 11 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
పండుగ సమయంలో మాంసం తింటే పాపాత్ములా?

Bageshwar Baba

అరుణ్‌ శ్రీవాస్తవ


మమతా బెనర్జీని ఓడించి, మార్పుకోసం బిజెపిని ఎన్నుకోవాలన్న నరేంద్ర మోదీ పిలుపునకు భారీగా స్పందించిన బెంగాలీలు, ముఖ్యంగా భద్రలోక్‌ (మధ్యతరగతి) ఇప్పుడు తమ ఎన్నికల నిర్ణయానికి పశ్చాత్తాపపడుతున్నారు. హిందుత్వ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి ప్రసంగాన్ని మాంసం, చేపలు తినే బెంగాలీ హిందువులు ఇప్పుడు బెంగాలీ అస్థిత్వం, సంస్కృతిని నాశనం చేసే కుట్రలో ఒక భాగంగా భావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, గుజరాత్‌ -కేంద్రీకృత బిజెపి నాయకత్వం చాలా కాలంగా దీనిని లక్ష్యంగా చేసుకున్నాయి.బాగేశ్వర్‌ బాబాగా ప్రసిద్ధి చెందిన ధీరేంద్ర, తరచుగా ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయాలను వినిపిస్తుంటారు. ప్రజానాడిని తెలుసుకోవడానికి బిజెపి ఆయనను వాడుకుంటున్నాయి. భారతదేశం ఇప్పటికే హిందూ దేశం అయ్యిందన్న బాగేశ్వర్‌ వాదన ఇందుకు తాజా ఉదాహరణ.
బాగేశ్వర్‌ తనను తాను ఒక దైవాంశసంభూతుడిగా, దైవత్వాన్ని పొందిన వ్యక్తిగా భావించుకుంటారు. సహజంగానే, ఆయనకు హిందూ మతంలోని వివిధ శాఖలు, మార్గాల గురించి తెలిసి ఉండాలని ఆశిస్తారు. దుర్గా, కాళీ దేవతలకు మేక, చేపలను భోగ్‌ (పవిత్ర నైవేద్యం)గా సమర్పించే శాక్త సంప్రదాయానికి తన సలహా విరుద్ధమని ఆయనకు ఎలా తెలియదు? ఈ ఆచారాలను కపటమైనవి గా పిలవడం అనేది బెంగాల్‌ విశిష్టమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరస్కరించే కుట్ర మాత్రమే కాదు, బెంగాలీ సంస్కృతిని, గుర్తింపును తుడిచిపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం కూడా.
ఇంతకు శాస్త్రి ఏమన్నాడు? హౌరాలో ఇటీవల జరిగిన హనుమాన్‌ కథా కార్యక్రమంలో, దుర్గా పూజ పండాల్‌లకు మాంసాహార దుకాణాలను దూరంగా పెట్టాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్‌ జారీ చేసిన సూచనకు ఆయన గట్టి మద్దతు తెలిపారు. పండుగ సమయంలో మాంసాహారం తీసుకునే వారిని పాఖండీ(పాపాత్ములు) అని పిలవడం ద్వారా, ఆ అలవాటును అపవిత్రమైనదిగా, ‘సనాతన’ నియమాలకు విరుద్ధమైనదిగా పేర్కొనడం ద్వారా విహెచ్‌పి సందేశాన్ని శాస్త్రి ముందుకు తీసుకెళ్లారు. శాస్త్రి ప్రధానంగా మధ్యప్రదేశ్‌ కేంద్రంగా పనిచేస్తారు. ఉత్తర/మధ్య భారత ప్రజలకు తన సేవలను అందిస్తారు. ఈ ప్రాంతాలలో, నవరాత్రి తొమ్మిది రోజులు ఉపవాసం, కఠినమైన శాకాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసానికి పూర్తిగా దూరంగా ఉండటంతో ముడిపడి ఉంటాయి. వైష్ణవ, శాక్త సంప్రదాయాల మధ్య ఘర్షణ వివిధ వర్గాలు ఆరాధించే విభిన్న పద్ధతులను ఎత్తి చూపుతుంది. తూర్పు భారతదేశంలో శాక్త హిందూ మతం (దేవతను అత్యున్నత శక్తిగా ఆరాధించడం) విస్తృతం గా ఆచరణలో ఉంది. శాక్త సంప్రదాయాలలో, మాచ్‌ (చేపలు), పాఠా(మేక మాంసం) ‘అపవిత్రమైనవి’ లేదా పాపపూరితమైనవిగా పరిగణించబడవు. ముఖ్యంగా, హిందూ ప్రవర్తనకు సంబంధించి ఒకే విధమైన నియమావళిని (యూనిఫామ్‌ కోడ్‌) సమర్థించడానికి శాస్త్రి తరచుగా
బహిరంగ వేదికలను ఉపయోగిస్తుంటారు.
ఒక పరిణామం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బిహార్‌, యుపి నుండి వచ్చిన బెంగాలీయేతర ఇబిసి, ఒబిసి వలసదారులు, గుజరాతీలు, మార్వాడీల మద్దతుతో పాటు, టిఎంసి, కాంగ్రెస్‌ నుండి బిజెపిలో చేరిన వారి మద్దతు కూడా శాస్త్రికి ఉంది. టిఎంసి నుంచి వచ్చిన సువేందు అధికారి ఆయనకు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. పూజ సమయంలో మాంసాహారం తింటున్నందుకు బెంగాలీ హిందువులను శాస్త్రి విమర్శించిన వేదికను అధికారి కూడా పంచుకున్నారు. స్థానిక హిందూ ఓటర్లకు ఈ ప్రచారం దూరం కాకుండా చూసేందుకు, బెంగాల్‌ బిజెపి త్వరగానే శాస్త్రి ఆదేశాల నుండి దూరం జరిగింది. ఇటీవల ప్రముఖ స్థానిక బిజెపి నాయకులు శాస్త్రికి ఘన స్వాగతం పలకడం తో, ఈ పరిస్థితి రాజకీయంగా ప్రమాదకరంగా మారింది.
పండుగల్లో చేపలు, మాంసం బెంగాలీల ఆచారం
బెంగాల్‌లోని రాజకీయ వర్గాలన్నింటిలోనూ, బాగేశ్వర్‌ వ్యాఖ్యను తమదైన సుస్థిరమైన, విభిన్నమైన ఆచారాలు కలిగిన ప్రాంతంపై ఒక బయటి మత నాయకుడు ఉత్తర-భారత, కఠినమైన శాకాహార మత వ్యవస్థలను రుద్దడానికి చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు. ప్రాథమికం గా, స్థానిక వంట సంప్రదాయాల ను గౌరవించిన స్వామి వివేకానంద వంటి చారిత్రక వ్యక్తులను ఉదహరిస్తూ, బెంగాలీల ఆహారపు అలవాట్ల ను నిర్దేశించే హక్కు మత లేదా రాజకీయ నాయకులకు లేదని నొక్కిచెబుతూ, పశ్చిమ బెంగాల్‌ బిజెపి నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆయన ప్రకటన నుంచి బహిరంగంగా తమను తాము దూరం చేసుకోవడానికి ఇదే కారణమైంది.కాళీఘాట్‌, దక్షిణేశ్వర్‌, తారాపీఠ్‌ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దేవతలకు సాంప్రదాయ జంతుబలి (బలి), మాంసం లేదా చేపలను భోగ్‌గా (పవిత్ర నైవేద్యం గా) సమర్పించడం అనేది ఒక పురాతన ఆచారం. కాబట్టి బెంగాలీ హిందూ ఆచారాలను కించపరిచేందు కు బాగేశ్వర్‌ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్య పట్ల అన్ని రాజకీయ వర్గాలకు చెందిన బెంగాలీలు ఒకే రీతిలో ఆగ్రహంతో ఉన్నారు. బెంగాల్‌ రాజకీయ చరిత్రలో ఉత్తర భారత సన్యాసి చేసిన అనుచిత వ్యాఖ్యలను విమర్శించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఏ మత లేదా రాజకీయ నాయకుడు కూడా మాంసాహారం తినే బెంగాలీలను ‘పాఖండీ’ (పాపులు) అని పిలవలేదు.
పారని పాచిక
బాగేశ్వర్‌ వ్యాఖ్యపై బెంగాలీలు ఎంతగా ఆగ్రహంతో ఉన్నారంటే, రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై కనీసం పది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కాంగ్రెస్‌ వంటి రాజకీయ పార్టీ లు సైతం ఆయన బెంగాలీల మనోభావాలను దెబ్బతీశారని, సామాజిక అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పరువు నష్టం కేసులు దాఖలు చేశాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌కు ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు షామిక్‌ భట్టాచార్య స్వాగతించినప్పటికీ, తాజాగా శాస్త్రి ఆదేశాన్ని గట్టిగా తిరస్కరిస్తూ, ‘బెంగాలీలు ఏమి తినాలో ఏ బాబా గానీ, ఏ రాజకీయ పార్టీ గానీ నిర్ణయించలేదు. మేము అష్టమి నాడు లూచీ, నవమి నాడు మటన్‌ తింటాము, ఇకపైనా అలాగే తింటాము… స్వామి వివేకానంద కంటే గొప్ప బాబా ఎవరూ లేరు’ అని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి), వామపక్ష నాయకులు కూడా ఆయనను తీవ్రంగా విమర్శించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు ఏకీకృత అఖిల భారత హిందూ జాతీయవాద అస్థిత్వాన్ని విస్తరించడానికి పశ్చిమ బెంగాల్‌ పై తీవ్రంగా దృష్టి సారిస్తున్నాయి. ఇది సాంప్రదాయ బెంగాలీ బహుళత్వాన్ని, లౌకికవాదాన్ని పునర్నిర్మించి, అధిగమించే ప్రయత్నం. భారతదేశమంతటా హిందూ నాగరికతను ఏకీకృతం చేయాలన్న తమ లక్ష్యానికి, పశ్చిమ బెంగాల్‌లోని సామాజిక- రాజకీయ స్థానాన్ని చేజిక్కించుకోవడం అత్యంత కీలకమని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోం ది. బెంగాల్‌ సాంస్కృతిక, రాజకీయ రంగాలను తమవైపు తిప్పుకోవడం విస్తృత హిందుత్వ ప్రణాళికకు ఒక ప్రధాన మైలురాయి అవుతుందని వ్యూహకర్తలు పేర్కొన్నారు.
స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటోపాధ్యాయ, సుభాష్‌ చంద్ర బోస్‌ వంటి పూజ్య బెంగాలీ ప్రముఖులను తీవ్ర హిందూ జాతీయవాద కథనంలోకి చేర్చడానికి ఈ కాషాయ వ్యవస్థ చురుకుగా ప్రయత్నిస్తోంది. ఆసక్తి
కరంగా, ఇది బెంగాల్‌ సంస్కరణవాద, లౌకిక చరిత్రను మతతత్వ మెజారిటీవాద చట్రానికి సరిపోయేలా పునర్‌ వ్యాఖ్యానిస్తోంది. చారిత్రకంగా, మధ్యతరగతి బెంగాలీ భద్రలోక్‌, ప్రాంతీయ మేధావు లు ఒక విలక్షణమైన, సమ్మిళిత సాంస్కృతిక నీతిని (సూఫీ, బౌల్‌, మానవతావాద సంప్రదాయాలను కలుపుకొని) కలిగి ఉన్నందుకు గర్వపడుతుంటారు. ఇది ఉత్తరాది తరహా సంకుచిత మెజారిటీ రాజకీయాలను చాలావరకు ప్రతిఘటించింది. జాతీయ ప్రధాన కార్యాలయాల నుండి వెలువడే కేంద్రీకృత, హిందీ- హిందూ రాజకీయ పదజాలంపై ఏ విధమైన నొక్కిచెప్పి నా, అది తరచుగా బెంగాలీ అస్థిత్వంలో అంతర్లీనంగా ఉన్న భాషాపరమైన, లౌకిక ఆత్మగౌరవంతో విభేదిస్తుంది.
బెంగాలీ అస్థిత్వానికి, దాని చారిత్రకంగా బలమైన వామపక్ష ధోరణికి మధ్య ఉన్న సంబంధం ఒక ముఖ్యమైన చారిత్రక, సామాజిక చర్చనీయాంశం. ఒకటి మరొకదాని కంటే అంతర్గతంగా ‘ఎక్కువ ప్రభావవంతమైనది’ అనడం కంటే, గత శతాబ్దంలో ఈ రెండూ ఒకదానిపై ఒకటి తీవ్రంగా ప్రభావం చూపాయి, బలోపేతం చేసుకున్నాయి, కొన్నిసార్లు విభేదించుకున్నాయి. 1960ల నుండి 2000ల ప్రారంభం వరకు వామపక్ష రాజకీయాలు బెంగాలీ అస్థిత్వంలో లోతుగా పెనవేసుకుపోయాయి. బెంగాలీ సంస్కృతి సాహిత్యాన్ని, కవిత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వాతావరణంలో వామపక్ష భావజాలానికి సహజమైన నివాసం దొరికింది. వామపక్ష రాజకీయాల లౌకిక చట్రం ఈ సాంస్కృతిక వైఖరికి బాగా అనుగుణంగా ఉండి, చాలాకాలం పాటు మతపరమైన విభజనను ప్రతిఘటించింది. 20వ శతాబ్దమంతటా రాజకీయ చైతన్యం, లౌకికత్వం, సాంస్కృతికంగా చైతన్యవంతమైన బెంగాలీ అస్థిత్వాన్ని రూపొందించడంలో వామపక్ష ధోరణి అత్యంత ప్రభావవంతంగా నిరూపించబడింది. ఇది విద్య, సాహిత్యం, వ్యవసాయ సమానత్వానికివిలువనిచ్చే సమాజాన్ని పెంపొందించింది.
భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశం వామపక్షవాదాన్ని రష్యా, చైనా నుండి దిగుమతి చేసుకున్న ఆలోచనగా చూసినప్పటికీ, బెంగాలీ మనస్తత్వం వలస వ్యతిరేక పోరాటం ద్వారా బలంగా రూపుదిద్దుకోవడం, తొలితరం వామపక్ష నాయకులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడటం వలన, వామపక్షవాదాన్ని ఒక విదేశీ దిగుమతిగా కాకుండా, బెంగాలీ దేశభక్తి, తీవ్ర ధిక్కారానికి కొనసాగింపుగా చూశారు. స్పష్టంగా, బెంగాల్‌లో తన ఎదుగుదల, విస్తరణ కోసం కాషాయ శిబిరం ఇప్పటివరకు ఉన్న సమ్మిళిత బెంగాలీ సంస్కృతి, అస్థిత్వంపై దాడిచేసి, వాటిని నాశనం చేయాల్సిన అవస రం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలా చేయడానికి ప్రయత్నించింది, కానీ సఫలం కాలేకపోయింది. చివరకు అత్యంత వివాదాస్పదమైన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ద్వారా భారత ఎన్నికల సంఘం ద్వారా ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసే మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది. సర్‌ 70 లక్షలకు పైగా ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించింది. బిజెపి పన్నాగం ఫలించి, ఎన్నికల్లో గెలిచింది. అయితే, ఇప్పుడు గుజరాత్‌ కేంద్రంగా ఉన్న బిజెపి, బాగేశ్వర్‌ వంటి ఆధ్యాత్మిక గురువుల ద్వారా తీవ్రమైన దాడికి దిగింది. కాషాయ శిబిరం జాబితాలో చాలామంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. కానీ ఈ సున్నితమైన విషయంపై మరే ఇతర మత పెద్ద మాట్లాడలేదు.
వాస్తవానికి, ఈ పనికోసం విశ్వ హిందూ పరిషత్‌
(విహెచ్‌పి)బాగేశ్వర్‌ను ఉపయోగించుకుంది. ఉత్తర భారత(వైష్ణవ) సంప్రదాయాలు, తూర్పు భారత (శాక్త) సంప్రదాయాల మధ్య ఉన్న ప్రాథమిక వైరుధ్యం కారణం గా, దుర్గా పూజ సమయంలో మాంసాహార వినియోగాన్ని బహిరంగంగా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. బెంగాలీలు కానివారిపై, ముఖ్యంగా గుజరాతీలు, మార్వాడీలపై ఆయనకు గణనీయమైన ప్రభావం ఉంది.