Telangana Assembly Session: ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమ ప్రమాద బీమా పథకం అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Telangana Assembly Session: తెలంగాణలో పారిశ్రామిక వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం మూలంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు నాటికి 15,000 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్, ఈనెల 9వ తేదీ నాటికి ఏకంగా 19,543 మెగావాట్లకు చేరిందని తెలిపారు. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
సౌర, ఫ్లోటింగ్ సోలార్ మరియు ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరామసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, మల్లన్నసాగర్, ఎల్ఎండీ, మిడ్‌మానేరు తదితర జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, దేశీయ పరికరాలనే వాడాలన్న కేంద్ర నిబంధనల వల్ల మెగావాట్‌కు రూ. 1.30 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని, ఈ నిబంధనలను సడలిస్తే పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రాయితీ కింద ఏడాదికి రూ. 14 వేలు, గృహ జ్యోతి ద్వారా 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ. 5,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఈ రెండింటికీ కలిపి ప్రభుత్వం ఏటా రూ. 19,000 కోట్లు విద్యుత్ రాయితీగా చెల్లిస్తోందని వివరించారు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు అమ్రాబాద్ గిరిజన ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని 81 గ్రామాలను పూర్తిగా సౌరవిద్యుత్ కిందకు మార్చనున్నట్లు, అలాగే ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం ద్వారా అటవీహక్కుల భూముల్లో సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన ప్రమాద బీమా పథకం దేశంలోనే అత్యుత్తమమైనదని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వంపై గానీ, ఉద్యోగులపై గానీ ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, బ్యాంకుల ఒప్పందంతో 12.91 లక్షల మంది రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు మరియు పింఛనుదారులకు రూ. కోటి ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని తెలిపారు. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2 కోట్లు, సహజ మరణానికి రూ. 10 లక్షల వరకు బీమా అందుతుందని, ఇప్పటికే సింగరేణి, డిస్కంలలో నమోదైన క్లెయిమ్‌లు దాదాపు సెటిల్ అయ్యాయని చెప్పారు. అంతేకాకుండా, ఉద్యోగుల ఆరోగ్య కార్డుల కోసం ప్రభుత్వం రూ. 264 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఇప్పటికే కేటాయించిందని సభకు తెలియజేశారు.
- Telangana Assembly Session: సభను అడ్డుకునేందుకు కేసీఆర్ ఫాంహౌస్‌లో కుట్రలు.. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Telangana Assembly Session: 59 వేల నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నాం.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన..
- Telangana Assembly Session: ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమ ప్రమాద బీమా పథకం అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- 15 ఏళ్ల నా కల ‘పంచనామా’.. ఉదయభాను
- ‘రణబాలి’ టీజర్ విడుదల