తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం
రచయిత: జె.జె.సి.పి. బాబూరావు
నిజాం నిరంకుశత్వానికి, దొరల దాష్టీకాలకు మరియు భూస్వాముల ఆగడాలను వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం 1946 నుండి 1951 వరకు కొనసాగిన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ ప్రపంచ చరిత్రలోనే ప్రముఖ స్థానాన్ని సముపార్జించుకుని నిత్యనూతన చైతన్య స్రవంతిగా వెలుగొందుతూనే ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదం మార్మోగిపోయింది. ‘బాంచెన్ దొరా & నీ కాళ్లు మొక్కుతా’ అన్న పీడిత ప్రజానీకం ఆయుధాలు చేబూని దొరల, భూస్వాముల, పెత్తందారుల అరాచకాలను అంతమొందించారు. వేలాది గ్రామాలు వెట్టి చాకిరీ నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంపిణీ చేయబడ్డాయి. కాని ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులు కావడం కడు విషాదకరం.
తెలంగాణ సాయుధ పోరాటయోధులలో ఒకరుగా నిలిచిన మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని (ప్రస్తుత సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ‘స్వరాజ్’ అనే నినాదం పట్ల ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రభావితులై, ఆ స్వరాజ్యోద్యమ కాలాన్ని గుర్తుచేసే విధంగా ఆమెకు ‘స్వరాజ్యం’ అని పేరు పెట్టడాన్ని చాలా సృష్టిగా గమనించవచ్చు.
మల్లు స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో జన్మించినా ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమసమాజం వైపుగా పయనింపజేశాయి. ఆమె తన సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బి.ఎన్. రెడ్డి) అడుగుజాడల్లో నడిచి క్రమంగా ఆమె తెలంగాణ సాయుధ పోరుబాట దిశగా ముందుకు సాగారు. స్థానిక భూస్వామ్యుల, జమీందారుల నిరంకుశత్వానికి, వెట్టిచాకిరి విధానానికి వ్యతిరేకంగా మరియు రజాకారుల అరాచకాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం పదమూడేళ్లకే తుపాకీ పట్టి తెలంగాణ ఉద్యమానికి ‘సాయుధ దన్ను’గా నిలిచి ఉద్యమించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా మల్లు స్వరాజ్యం మహిళా కమాండర్‌గా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఉద్యమాలు నిర్వహించారు. 1947లో రజాకార్లు తన ఇంటిని తగులబెట్టినా, నిజాం ప్రభుత్వం తనని పట్టించిన వారికి పదివేల రూపాయల జరిమానాను ప్రకటించినా ఏ మాత్రం అధైర్యపడకుండా మరింతగా ముందుకు సాగి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ఒక వ్యక్తిగా కాకుండా ‘ప్రజాశక్తి’గా ప్రజ్వలించి చివరి దశ వరకు వీరోచిత పోరాటం సాగించారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తరపున ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం రెండు పర్యాయాలు (1978, 1983-1984) శాసనసభ్యురాలుగా కొనసాగారు. కార్మిక-కర్షక సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ఆయా సమస్యల పరిష్కారాల దిశగా ఉద్యమించారు.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)లో రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా మల్లు స్వరాజ్యం అనేక మహిళా సమస్యల పరిష్కారాలకోసం అహర్నిశలు ఉద్యమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన నిషేధ వ్యతిరేక పోరాటంలోనూ ఆమె క్రియాశీలకంగా ఉద్యమించారు.
‘నా మాటే తుపాకీ తూటా’ అన్న పేరుతో మల్లు స్వరాజ్యం ఆత్మకథ వెలువడి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకంగా నిలిచింది. పీడిత ప్రజానీకానికి పోరాట స్ఫూర్తిని రగిలించిన మల్లు స్వరాజ్యం తన 91 సంవత్సరాల వయసులో 2022, మార్చి 19నాడు మరణించారు.