My Home Group: అసెంబ్లీ సాక్షిగా మైహోం భూదందా బయటపెట్టిన సీఎం…ఒక్క శంషాబాద్ లోనే 2500 ఎకరాలు..
My Home Group: తెలంగాణ అసెంబ్లీలో 22ఏ భూములు, ధరణి వ్యవహారంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మై హోమ్ గ్రూప్‌కు సంబంధించిన భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. శంషాబాద్ నుంచి మేళ్లచెరువు వరకు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, ఎవాక్యూ ప్రాపర్టీలకు సంబంధించిన భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మైహోం రామేశ్వరరావు భూముల లోగుట్టు విప్పారు.. ఒక్క శంషాబాదులోనే 2,463 ఎకరాల భూమి ఉందని. ఎయిర్పోర్ట్ ను ఆనుకొని, మరో ఏయిర్ పోర్ట్ కట్టేంత స్థలం ఇందులో ఉందని పేర్కొన్నారు. ఇందులో 100 ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు, పేదోళ్ల భూములు వీళ్ళు తీసుకున్నారు. మై హోమ్ శంషాబాద్ మండలంలోని ఐదు గ్రామాలలో భూములు కొనుగోలు చేసింది. ఈ ఆస్తులు 28 కంపెనీల పేరు మీద, అదేవిధంగా ఎనిమిది గ్రామాల్లో టోటల్ గా ఉన్నాయని పేర్కొన్నారు.
ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమి? సర్వే నంబర్ల లెక్కలు:
“ఇందులో వీళ్ళు శంషాబాద్ ముచ్చింతల్లో, అదేవిధంగా శంషాబాద్ పాల్మార్కుల మండలంలో, శంషాబాద్ మదనపల్లిలో, పెద్ద తూపురా, సాగిడి, గొల్లూరు, అమీర్పేట, నాగారం, నందపల్లి, కాల్వకోల్, తూపుర, సుభాన్పూర్, వెంకన్నగూడ… వీటన్నిట్లల్లా ఈరోజు గ్రామం పేరు, భూముల ఎకరాలు, ప్రజా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ముడిపడి ఉన్న సర్వే నంబర్లలో కొనుక్కున్న మొత్తం రికార్డు ఈరోజు మీకు ఇస్తున్న అధ్యక్ష.” అని సీఎం పేర్కొన్నారు.
“దాదాపుగా ఈరోజు ఈ గొల్లూరు గ్రామంలో 1994 నుండి 2004 సంవత్సరం వరకు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ల నుండి 301.07 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2014 లో సదరు సర్వే నెంబర్లను జీవో 52498 (తేదీ 25-03-2014) ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించారు, డినోటిఫై చేశారు! అలాగే నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 195లో నిషేధిత జాబితాలో ఉన్న భూములను మొత్తం 315 ఎకరాలు అధ్యక్ష! ఒక వ్యక్తికి ఎయిర్పోర్ట్ కానుకొని ఎయిర్పోర్ట్ అంత స్థలం ఉంది అధ్యక్ష! ఎవరి బినామీ అధ్యక్ష? 2,645 ఎకరాల భూమి ఒకటే ఒక దగ్గర ఉంది అధ్యక్ష! ఇది ఎవరి సంపాదన? ఎవరి సొమ్ము? ఎవరిని కొల్లగొట్టిరు? ఏ ప్రజల సొమ్ము ఇది? ఏ ప్రజల సొమ్మును మీరు కొల్లగొట్టి మీ బినామిల పేర్ల మీద పెట్టినరు? ఈ ఆస్తులు ఈ ప్రజలని కొల్లగొట్టినయి కాదా?” అని సీఎం తూర్పార పట్టారు.
కాప్రాలో ఎవాక్యూ ప్రాపర్టీ కబ్జా:
మేడ్చల్ జిల్లా కాప్రాలోని శరణార్థుల (ఎవాక్యూ) ఆస్తులపైనా సీఎం సంచలన విషయాలు బయటపెట్టారు. “కాప్రాలో కూడా ఎవాక్యూ ప్రాపర్టీ అధ్యక్ష! మేడ్చల్ జిల్లా కాప్రాలో మై హోమ్ ది మరో భూదంతం… ఎవాక్యూ ప్రాపర్టీ! ‘నమస్తే తెలంగాణలోనే ఇది ఎవాక్యూ ప్రాపర్టీ, ప్రభుత్వ భూమి అని పెద్ద పెద్ద పేపర్లలో రాశారు. నమస్తే తెలంగాణ పేపర్లో ‘ఈ భూమి అంతా అవాక్యూ ప్రాపర్టీ, ప్రభుత్వ భూమి కొల్లగొడుతురు, ఆంధ్రోళ్ళు వచ్చి మా భూములను కొల్లగొడుతురు’ అని వరుసగా కథనాలు రాశారు. ఆ తర్వాత వాళ్ళని భయపెట్టించి ఆ భూములు మొత్తం మై హోమ్ కు బదిలీ జరిగింది. ఇది వివరాలు అధ్యక్ష! ఈరోజు ఈ రకంగా తెలంగాణను కొల్లగొట్టారు.” అంటూ సీఎం రేవంత్ దుయ్యబట్టారు.
మేళ్లచెరువులో భూదాన్ భూములు స్వాహా:
ఈ అక్రమాలు శంషాబాద్, కాప్రా ప్రాంతాలతోనే ఆగలేదు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కూడా భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా వచ్చిన పేదల భూములను మై హోమ్ ఇండస్ట్రీస్ అక్రమంగా ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మై హోమ్ ఇండస్ట్రీస్ పేరిట దాదాపు 242 ఎకరాల భూమి ఉంది. అయితే, ప్రాథమిక విచారణ లెక్కల ప్రకారం అందులో 113 ఎకరాలు స్వచ్ఛమైన భూదాన్ భూములే! అంటే, ప్రస్తుతం వారు నడుపుతున్న మేళ్లచెరువు సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కట్టిన స్థలంలో 113 ఎకరాలు పేదలకు చెందాల్సిన భూదాన్ భూమి అని తేలింది. అంటే మై హోమ్ రామేశ్వరరావు గారు అనుకుంటే భూదాన్ భూములైనా, అసైన్డ్ భూములైనా, వక్ఫ్ భూములైనా.. ఏవైనా సరే వేల ఎకరాల్లో ఆక్రమించేసుకోవచ్చా? ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఎవరి ఆస్తులు? ఏ రకమైన అక్రమాలు, దోపిడీలు వీళ్లను ఈ స్థాయిలో అపర కుబేరులుగా మార్చాయి?” అంటూ సీఎం దుయ్యబట్టారు.
బెదిరింపులతో 1,000 కోట్ల విలువైన భూమి బదిలీ:
గతంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రికలోనే కాప్రా పరిధిలోని శరణార్థుల (ఎవాక్యూ) భూమి గురించి ఒక సంచలన వార్త ప్రచురించారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జిపిఏ హోల్డర్ మదనానికి ఎలాంటి హక్కులూ లేవు.. రూ. 1,000 కోట్ల విలువైన 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కుట్ర జరుగుతోంది’ అని ఆ పత్రిక కథనాలు రాసింది.అయితే, ఆ వార్త వెనుక ఉన్న అసలు వ్యూహం వేరే ఉంది. ఆ వార్తల ద్వారా భూ యజమానులను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించి రంగంలోకి దించారు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా, ఆ మొత్తం సర్వే నంబర్లలోని విలువైన భూములను చివరకు ‘మై హోమ్’ సంస్థ పేరిట బదిలీ చేయించారు. ఎక్కడ ఖరీదైన ప్రభుత్వ భూమి కనిపించినా, గద్దల కంటే ఘోరంగా వాలిపోయి తెలంగాణ ప్రజల ఆస్తులను ఈ రకంగా దోచుకున్నారు.”
లక్ష కోట్ల భూ దోపిడీపై ‘సిట్’ విచారణ:
ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి పరిశీలన ప్రారంభించే సమయానికి దిగ్భ్రాంతికర విషయాలు బయటికొస్తున్నాయి. అసలు ఈ వివరాలన్నీ బయటికొస్తే బాధ్యులందరూ జైలుకు వెళ్లక తప్పదు. సభలో మనం ఇప్పుడు లెక్క తేల్చిన భూములే కాకుండా, ఇంకా వెలుగు చూడనివి ఎన్నో ఉన్నాయి! మొత్తంగా కనీసం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టి రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించారు.
చర్చను అడ్డుకునేందుకు విపక్షాల యత్నం:
ఈ భూ అక్రమాలపై సభలో చర్చ జరుగుతుందని ముందే ఊహించి, దాన్ని అడ్డుకోవడానికే విపక్షాలు సభలోకి రాకుండా గందరగోళం సృష్టిస్తున్నాయి. అధికారులను, మహిళలను దూషిస్తూ, ప్రభుత్వంపై దాడి చేస్తూ, స్పీకర్ స్థానాన్ని కూడా గౌరవించకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైఖరిని సభ అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.
ధరణి స్థానంలో ‘భూ భారతి’ రాక:
అసెంబ్లీలో నేను లేవనెత్తిన అంశాలనే కాకుండా, జరిగిన ప్రతి భూ దోపిడీపై నిజాలు నిగ్గు తేలుస్తాం. ధరణి నిర్వహణ గత పాలకుల చేతుల్లోనే ఉండటం వల్ల మనం వెంటనే కొత్త సాఫ్ట్‌వేర్ తెచ్చుకోలేకపోయాం. ధరణి డేటా మొత్తం విదేశాల్లో ఉన్న సర్వర్లలో ఉంది; మనం ఏమాత్రం తొందరపడినా ఒక్క క్లిక్‌తో ఆ సమాచారాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే కొంత సంయమనం పాటించి, నెలన్నర రోజుల పరిశోధన తర్వాత ఇప్పుడు ధరణి స్థానంలో ‘భూ భారతి’ అనే కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నాం.
అక్రమార్కులకు కాలమే శిక్ష విధిస్తుంది:
ఇంత దోపిడీ జరిగినప్పుడు అక్రమార్కులను వెంటనే ఎందుకు జైల్లో పెట్టడం లేదని మా మిత్రుడు మహేష్ గారు ప్రశ్నించారు. పురాణాల్లో శిశుపాలుడికి కూడా 99 తప్పుల వరకు సమయం ఇచ్చాకే నూరో తప్పు దగ్గర శిక్ష పడింది. రావణాసురుడికి కానీ, బకాసురుడికి కానీ మొదటి రోజే ముగింపు రాలేదు; ఏ దుర్మార్గుడికైనా శిక్ష పడే సమయం, సందర్భం అంటూ ఒకటి వస్తాయి.
న్యాయపరమైన చర్యలు తప్పవు:
కేవలం ప్రజలు ఇచ్చే రాజకీయ తీర్పే కాకుండా, కోర్టుల ద్వారా కూడా వీరికి తప్పక శిక్ష పడేలా చేస్తాం. లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిన ఈ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి పేదలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. 22ఏ (నిషేధిత భూముల) నిబంధనలను అడ్డుపెట్టుకుని మాపై దాడి చేస్తూ, వెనుక నుంచి పైరవీలు చేయాలని చూస్తే కుదరదు. ఈ భూములకు సంబంధించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే బయటపెడతాను.