Skip to content
జాతీయం వార్తలు

New Censor Board Panel: కేంద్ర సెన్సార్ బోర్డులో భారీ ప్రక్షాళన.. శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో కొత్త పాలకమండలి ఏర్పాటు

Krishna Rao 16 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
New Censor Board Panel: కేంద్ర సెన్సార్ బోర్డులో భారీ ప్రక్షాళన.. శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో కొత్త పాలకమండలి ఏర్పాటు

New Censor Board Panel: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ (CBFC)ను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించింది. ప్రముఖ మీడియా, సినీ రంగ నిపుణుడు శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో 18 మంది సభ్యులతో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. కొత్తగా నియమితులైన సభ్యులు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కొత్త పాలకమండలిలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ప్రీతి జింటా, నటులు పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీకి స్థానం కల్పించారు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు రికీ కేజ్ కూడా కొత్త కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధి, ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కూడా పాలకమండలిలో చోటు దక్కింది. నటి రూపాలీ గంగూలీ, నటుడు మనోజ్ జోషి, గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, అభిషేక్ జైన్, వినోద్ అనుపమ్, యతీంద్ర మిశ్రా తదితరులు కొత్త సభ్యులుగా నియమితులయ్యారు.

ఇద్దరికి మాత్రమే పునర్నియామకం
గత పాలకమండలిలో సభ్యులుగా ఉన్నవారిలో రంగస్థల దర్శకుడు వామన్ కేంద్రే, రచయిత రమేశ్ పతంగేలకు మాత్రమే కొత్త కమిటీలో మరోసారి అవకాశం లభించింది. మరోవైపు నటి విద్యా బాలన్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటి గౌతమి, నటి జీవితా రాజశేఖర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు భైచుంగ్ భూటియా తదితరుల పదవీకాలం ముగిసింది.

తొమ్మిదేళ్ల తర్వాత పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ
CBFC పాలకమండలిని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించడం ఆగస్టు 2017 తర్వాత ఇదే తొలిసారిగా జరుగుతోంది. కొత్త పాలకమండలిలో సినీ పరిశ్రమతో పాటు సంగీతం, సాహిత్యం, రంగస్థలం, మీడియా తదితర రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పించడం విశేషంగా మారింది. ఈ మార్పులతో సినిమాల సర్టిఫికేషన్ ప్రక్రియలో కొత్త పాలకమండలి కీలక పాత్ర పోషించనుంది.

ట్యాగ్‌లు: movie news