BRICS Summit 2026: BRICSను మరింత బలోపేతం చేయాలి.. 10 పాయింట్ల సంస్కరణల రోడ్‌మ్యాప్ ప్రతిపాదించిన మోదీ
Modi
BRICS Summit 2026: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి ప్రభావం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను రక్షించేందుకు సమష్టి చర్యలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల వార్షిక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
ప్రపంచ సంక్షోభాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు ముందువరుసలో ఉంటున్నప్పటికీ.. అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వాటికి తగిన ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఈ పరిస్థితిని మార్చి గ్లోబల్ సౌత్‌ను కేవలం నిర్ణయాల ప్రభావిత ప్రాంతంగా కాకుండా ‘నియమాలను రూపొందించే శక్తి’గా మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
బ్రిక్స్ కూటమి.. ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును సాధించిందని మోదీ పేర్కొన్నారు. ఈ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకంగా పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక అసమానతలు, భద్రతా సవాళ్ల మధ్య అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంలో బ్రిక్స్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ప్రస్తుత ప్రపంచ పాలనా వ్యవస్థలో అధికారం, నిర్ణయాలు తీసుకునే శక్తి కొన్ని దేశాల వద్దనే కేంద్రీకృతమైందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవస్థను ‘ప్రత్యేకాధికారాల పిరమిడ్’గా అభివర్ణించిన ఆయన.. దానిని ‘భాగస్వామ్య వేదిక’గా మార్చాలని అన్నారు. ప్రతి దేశానికి తన గొంతు వినిపించే అవకాశం, ప్రతి సభ్య దేశానికి నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం, మానవాళి అభివృద్ధికి ప్రాధాన్యం ఉండేలా అంతర్జాతీయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో వచ్చే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నాటికి ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించిన 10 ప్రతిపాదనలను రూపొందించి, వాటిని బ్రిక్స్ సంస్కరణల రోడ్‌మ్యాప్‌గా అభివృద్ధి చేయాలని మోదీ ప్రతిపాదించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంస్థలు, భద్రత, అభివృద్ధి వంటి రంగాల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఈ ప్రతిపాదనలు ఉండాలని ఆయన సూచించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల అంశాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. యూఎన్ఎస్సీ సంస్కరణలను ఇకపై ఆలస్యం చేయడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక వాస్తవాలు మారిపోయినప్పటికీ, అంతర్జాతీయ సంస్థల నిర్ణయ వ్యవస్థలు మాత్రం పాత నిర్మాణంలోనే కొనసాగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభా, ఆర్థిక వ్యవస్థలో భారీ వాటా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తదితర నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. యూఏఈ, ఇథియోపియా, ఈజిప్ట్, వియత్నాం తదితర దేశాల నాయకులు కూడా సదస్సులో పాల్గొన్నారు.
అంతర్జాతీయ భద్రత విషయంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం పెంచేందుకు భారత ప్రధాని మోదీ మరో ప్రతిపాదన చేశారు. సభ్య దేశాల నావికుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక నావికుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రత, నావికుల రక్షణ, సమాచార మార్పిడి వంటి అంశాల్లో పరస్పర సహకారం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
క్లుప్ంగా చెప్పాలంటే మోదీ ప్రసంగం బ్రిక్స్‌ను మరింత ప్రభావవంతమైన బహుళపక్ష వేదికగా మార్చడం, గ్లోబల్ సౌత్‌కు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో మరింత ప్రాధాన్యం కల్పించడం, ప్రపంచ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాల చుట్టూ సాగింది. పశ్చిమాసియా యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు.
- CM Revanth Reddy: 25 ఏళ్ల క్రితమే పుప్పాలగూడ, కోకాపేటను ఏలిన.. రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Aadarsha Kutumbam Teaser: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేసింది.. చిట్టిబాబుగా విక్టరీ విశ్వరూపం!
- Botsa Satyanarayana Crying Video: మరోసారి వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స…గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో కంటతడి
- BRICS New Delhi Declaration: UN సంస్కరణల నుంచి ఉగ్రవాదం వరకు.. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కీలక తీర్మానాలు ఇవే..
- CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్… ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు.. అసెంబ్లీలో సీఎం స్పష్టీకరణ