Skip to content
జాతీయం వార్తలు

Bihar Floods: గంగానది ఉగ్రరూపం.. బీహార్‌ను ముంచెత్తిన వరదలు.. 15 జిల్లాల్లో 47 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితం..

jagan 12 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bihar Floods: గంగానది ఉగ్రరూపం.. బీహార్‌ను ముంచెత్తిన వరదలు.. 15 జిల్లాల్లో 47 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితం..

Bihar Floods

Bihar Floods: వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా బిహార్‌ను వరద కష్టాలు వీడటం లేదు. గంగానది ఉగ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊళ్లు, ప్రధాన రహదారులు, వేలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగి ప్రజల దైనందిన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భాగల్‌పూర్ జిల్లా సుల్తాన్‌గంజ్ వద్ద గంగానది నీటిమట్టం సెప్టెంబర్ 11 ఉదయానికి 36.62 మీటర్లకు చేరి.. ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే 2.12 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, పలుచోట్ల రక్షణ కట్టలు దెబ్బతినడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈసారి బిహార్‌లో జూన్ 1 నుండి సెప్టెంబర్ 8 వరకు సాధారణం కంటే 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ రాష్ట్రం ముంపునకు గురికావడానికి గంగా ఎగువ పరీవాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్ (ప్రయాగ్‌రాజ్, వారాణసి)లో కురిసిన భారీ వర్షాలు, నేపాల్ హిమాలయ ప్రాంతాల నుండి ప్రవహించే కోసి, గండక్, బాగ్మతి నదుల నుండి వచ్చి పడిన అదనపు ప్రవాహాలే ప్రధాన కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గంగా నది నీటిమట్టం పెరగడంతో ఉపనదుల నీరు వెనక్కి తన్నే (Backwater) ప్రభావం ఏర్పడి ముంపు తీవ్రత మరింత పెరిగింది.

ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 88 బ్లాకులు, 561 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 46.88 లక్షల మంది వరద బారిన పడ్డారు. భాగల్‌పూర్ సహా పలు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF) బృందాలతో పాటు దాదాపు 700 ప్రభుత్వ పడవలను రంగంలోకి దించారు. రవాణా మార్గాలు దెబ్బతినడంతో పడవలే ప్రాథమిక ఆధారంగా మారాయి. బాధితుల కోసం 1,194 కమ్యూనిటీ కిచెన్ల ద్వారా నిరంతరం ఆహారాన్ని అందిస్తూ, అత్యవసర వైద్య సేవల కోసం బోటు అంబులెన్సులను వినియోగిస్తున్నారు.

మరోవైపు, సుమారు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అది జూలై చివర్లోనే యూట్యూబ్‌లో ప్రత్యక్షమైన పాత దృశ్యాలని నిర్ధారణ అయ్యింది. ఏటా పునరావృతమవుతున్న ఈ వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపాలంటే నదుల్లో సిల్ట్ (మట్టి) తొలగింపు, రక్షణ కట్టల బలవర్ధనం మరియు శాస్త్రీయ రీతిలో దీర్ఘకాలిక వరద నిర్వహణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు నొక్కిచెబుతున్నారు.