Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం

jagan 16 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం

Hyderabad Water Crisis

Hyderabad Water Crisis: వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు భూగర్భ జలాల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆశించిన స్థాయిలో లేకపోవడం.. మరోవైపు నగరంలో రోజురోజుకూ నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి.

భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో సగటు భూగర్భ జలమట్టం 11.20 మీటర్ల లోతుకు చేరింది. గతేడాది (2025) ఇదే సమయానికి ఇది 6.36 మీటర్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 4.84 మీటర్ల మేర లోతుకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సాధారణంగా ఆగస్టు చివరి నాటికి నగరంలో 460 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం 360 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షపాతంతో పోలిస్తే దాదాపు 22 శాతం లోటు ఏర్పడింది. వర్షాలు తగ్గడంతో ఒకవైపు భూగర్భ జలాల రీచార్జ్ ఆగిపోగా.. మరోవైపు గృహ ఇతర అవసరాల కోసం బోరు బావులపై ఆధారపడటం విపరీతంగా పెరిగింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం ప్రాంతాల్లో దాదాపు 73 శాతం భాగంలో భూగర్భ జలాలు 10 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళిపోయాయి. నగరంలోనే అత్యంత దారుణంగా ఇక్కడ నీటిమట్టం దాదాపు 40 మీటర్ల లోతుకు పడిపోయింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బాచుపల్లి, శేరిలింగంపల్లి, దుండిగల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో నీటిమట్టాలు 15 నుండి 20 మీటర్లకు పైగా లోతుకు వెళ్లాయి.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు కొంతవరకైనా రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది. పెరిగిన జనాభా, అడ్డూ అదుపూ లేని నిర్మాణాల నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసిపట్టే ‘రైన్ వాటర్ హార్వెస్టింగ్’ (ఇంకుడు గుంతలు) నిర్మించుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని అధికారులు, పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.