Skip to content
తెలంగాణ వార్తలు

HYDRAA: హైడ్రాకు సుప్రీంకోర్టులో భారీ షాక్.. కంటోన్మెంట్ 40 ఎకరాల భూమి కేసులో ఎదురుదెబ్బ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత..

jagan 15 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
HYDRAA: హైడ్రాకు సుప్రీంకోర్టులో భారీ షాక్.. కంటోన్మెంట్ 40 ఎకరాల భూమి కేసులో ఎదురుదెబ్బ.. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత..

Supreme Court

HYDRAA: హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని 40 ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించిన కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ దీపంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో ఈ భూమికి సంబంధించి తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు కొనసాగనుంది.

కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమిపై శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమి తమదేనని శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థ వాదించగా.. అది ప్రభుత్వ భూమి అని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. వివాదాస్పద భూమి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందినదేనని గతంలో తీర్పు ఇచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ దాఖలులో 219 రోజుల జాప్యం జరిగినట్లు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. పిటిషన్‌ను ఆలస్యంగా దాఖలు చేయడంపై సంతృప్తికరమైన కారణాలు లేవని భావించిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే ప్రభుత్వ ప్రయత్నానికి బ్రేక్ పడింది.

ఇదిలా ఉంటే ఇదే భూమికి సంబంధించిన మరో అంశం హైడ్రాపై కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉండగానే శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన భూమిలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారనే అంశంపై న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్రంగా స్పందించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే అభియోగాల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే మంజూరు చేసింది.

తాజాగా 40 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు కొనసాగనుంది. శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా, న్యాయవాదులు అల్లంకి రమేష్, మహమ్మద్ జీషన్, మమత ఆర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.