Skip to content
తెలంగాణ వార్తలు

HYDRAA: లోతుకుంట 40 ఎకరాల భూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

jagan 15 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
HYDRAA: లోతుకుంట 40 ఎకరాల భూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

HYDRAA Saves Land Valued at More Than Rs 1 Lakh Crore in Hyderabad

HYDRAA: హైదరాబాద్ లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేయడం వెనుక భూమిపై తుది తీర్పు వెలువడటం కారణం కాదని.. పిటిషన్ దాఖలుకు సంబంధించిన కాలపరిమితి ముగియడంతో సాంకేతిక కారణాల వల్లే దానిని డిస్మిస్ చేసిందని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించిన అనంతరం అన్ని భాగస్వామ్య వర్గాలతో, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

లోతుకుంట భూములపై వాస్తవ పరిస్థితులను స్పష్టంగా తెలుసుకోవడానికి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని రంగనాథ్ వెల్లడించారు. జనరల్ ల్యాండ్ రిజిస్టర్ (GLR) నంబర్ 243లో పేర్కొన్న 119 ఎకరాల భూములపై పూర్తి స్థాయిలో సర్వే చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సర్వే ద్వారా లోతుకుంట భూముల అసలు హద్దులు, భూముల ప్రస్తుత స్థితి, ప్రభుత్వ-ప్రైవేటు భూముల మధ్య ఉన్న వ్యత్యాసాలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు.

లోతుకుంటలోని భూ వివాదం కొంతకాలంగా తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో కొనసాగుతోంది. సర్వే నంబర్లు 1, 2లోని శాంతా శ్రీరాం బిల్డర్స్ లేఔట్‌కు సంబంధించి ఒకవైపు వివాదం ఉండగా.. మరోవైపు హైడ్రా పరిరక్షించిన ప్రభుత్వ భూమికి మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉందని హైడ్రా హైకోర్టుకు వివరించింది. ఈ రెండు ప్రాంతాలను ఒకే భూమిగా పరిగణించలేమని హైడ్రా వాదించింది.

అలాగే సర్వే నంబర్లు 1, 2కు సంబంధించి ప్రైవేటు భూమిపై కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులకు జనరల్ ల్యాండ్ రిజిస్టర్ నంబర్ 243, 255లో పేర్కొన్న భూములకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా పేర్కొంది. భూముల హద్దులు, రికార్డులు, వివిధ రిజిస్టర్లలో నమోదైన వివరాలను పరిశీలించిన తర్వాతే వాస్తవ పరిస్థితిని నిర్ధారించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన భూమిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టిన వ్యవహారం కూడా వివాదానికి దారితీసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా స్టే లభించింది.

తాజాగా 40 ఎకరాల భూమికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇది సాంకేతిక కారణాలతో జరిగిన డిస్మిసల్ మాత్రమేనని రంగనాథ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత వర్గాలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.

ప్రస్తుతం లోతుకుంటలోని మొత్తం 119 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, హద్దులు, వాస్తవ పరిస్థితులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న హైడ్రా వైఖరి కీలకంగా మారింది. సర్వే పూర్తయిన తర్వాతే వివాదాస్పద భూములపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో లోతుకుంట భూ వివాదంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.