దారి తప్పుతున్న కలాలు, శృతి తప్పుతున్న దళాలు
Protest
రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా : ఏవిఆర్
తెలంగాణ జన జీవితంలో పాట అంతర్భాగమైంది. కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా, పండగైనా, పబ్బమైనా, పుట్టుకైనా, చావైనా పాట ఉండాల్సిందే. ప్రజల జీవన విధానం, ఆలోచనలు, ఆచారాలకు అనుగుణంగా కవులు అనేక పాటలు జనంలోకి తీసుకు వచ్చారు. గాయకులు పాటలను మధురంగా అలపిస్తూ ప్రజలకు చేరువ చేసే వారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇటీవల తెలంగాణ సాధన వరకు తెలంగాణ ప్రజలను పాట తట్టి లేపింది. ఆలోచింపజేసింది. రౌద్రం నింపింది. ముందుకు నడిపించింది. దశాబ్దకాలంగా తెలంగాణ కవుల కలాలు దారి తప్పుతున్నాయి. లేని గొప్పతనాన్ని కొందరికీ అపాదించడానికి, జరగని విషయాలను జరిగిన ట్లు, ఉన్నట్లుగా భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జన సమస్యలు, ఆచర వ్యవహారాల నడుమ మధ్య పుట్టిన తెలంగాణ పాట ఇప్పుడు ఆర్థిక అవసరాలను నెరవేర్చుకునేందుకు ప్రజలను వంచించే పనిలో పడ్డది. గళాలు చైతన్యాన్ని రగిల్చిన గొంతులు ఇప్పుడు రాజకీయ నేతల సేవలో తృప్తి పొందుతున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పిలుపు ముందు తెలంగాణ సమాజ పరిస్థితి దయనీయంగా ఉండేది. బడుగు, బలహీన వర్గాల జీవితాలను శాసించే రోజుల్లో దేవునికి దండం పెట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి నుంచి ప్రశ్నించే స్థాయికి ఎదగడంలో తెలంగాణ కవులు, గాయకుల కృషి దాగి ఉంది. తెలంగాణ సాహిత్యం అనేక ప్రజా ఉద్యమాలకు పురుడుపోసి నడిపించింది. వందల పాటలు సందర్భానుసారంగా పుట్టుకొచ్చాయి. స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పాటలు కైకొట్టి పాడారు. చదువురాని బండి యాదగిరి అలపించిన
బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో వస్తావ్ కొడకో
నైజాం సర్కారోడా
నాజీలను మించినవురో అంటూ సాగిన పాట తెలంగాణ ప్రజలకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది.
చిన్న చిన్న పోరగాళ్లు
సీతయ్య జీతగాళ్లు
గొడ్లళ్లు నూరినారు,
భుజాన పెట్టినారు
అంటూ భూస్వామి సీతారామిరెడ్డికి వ్యతిరేకంగా పుట్టిన గేయం. అనేకమంది సామాన్యులను సాయుధులను చేసింది. సొంత కరెన్సీ, రైల్వేలు, రవాణా వ్యవస్థ , లక్షలాది ఎకరాలు, ప్రపంచంలో బలవంతుడైన రాజుగా పేరొందిన నిజాంకు వ్యతిరేకంగా ‘ముసలి నక్కకు రాచరికం దక్కునే’ అంటూ దశరథి గర్జించాడు.
ఒక్క రోజు కూడా
ఒక్క నిమిషం సేపు,
దుక్కి దున్నని నీకు
దిక్కు తెలియని భూములెక్కడివి అంటూ సుద్దాల హన్మంతు ప్రశ్నించాడు. అనేక మంది కవు లు నిజాం నవాబుకు వ్యతిరేకంగా గొప్ప సాహిత్యాన్ని ప్రజలకు అందించారు. మలిదశలో తెలంగాణ ఉద్యమంలో అంతకు తెలంగాణ కవులు గొప్ప విప్లవ సాహిత్యాన్ని తీసుకువచ్చి ప్రజలకు అందించారు. అనేక పాటలు ప్రజల నాలుకలపై నిలిచిపోయాయి. చెరబండ రాజు పాటలు పదును కత్తులై మెరిశాయి. గద్దర్, గూడ అంజయ్య, జయరాజు, అందెశ్రీతో పాటు అనేక మంది తెలంగాణ కవుల పాటలు గతాన్ని తెలియజేస్తూ వర్తమానాన్ని చూపుతూ భవిష్యత్తును ఆవిష్కరింపజేశాడు.
తాడేసి, తనుకేసి
పట్టణంలో కొడుకును
పై చదువు చదివిస్తే
కొలువులు దొరకకపోయేరా
కొడుకు బరువైపోయేరా
అంటూ భవిష్యత్తు నిరుద్యోగ సమస్యను 1980 దశకంలోనే గూడ అంజయ్య ఆవిష్కరింపజేశారు. ఇప్పుడు ప్రశ్నిస్తే వచ్చే నిర్బంధాలను తెలంగాణ కవులే దశాబ్దాల క్రితమే పాటల రూపంలో ప్రజల ముందు ఉంచారు. మలిదశ తెలంగాణ పోరాటం లో వందలాది పాటలు ప్రజల మదిలో గూడుకట్టుకున్నాయి. ప్రకృతిని, ప్రజలను సమాంతరంగా చూపుతూ తెలంగాణ పాటలు ఎక్కువగా వచ్చాయి. తెలంగాణ పాట కీర్తించింది, ప్రశ్నించింది.
రాతి బొమ్మలలోనా / కొలువైన శివుడా
రక్తబంధం విలువ
నీకు తెలియదురా
తెలిసి ఉంటే చెట్టంత నా
కొడుకును తెచ్చివ్వగలవాని మహిమలు
అంటూ మిట్టపల్లి సురేందర్ రాసిన పాట తెలంగాణ అంతట మారుమ్రోగింది.
ఇప్పుడు ఏమైంది తెలంగాణ పాటకు బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ తెలంగాణ కళాకారులను, కవులను వేతనాలు ఇచ్చి బందీలుగా చేశాడు. అప్పుడే దారితప్పిన కలలు మండు వేసవిలో మత్తడి తొక్కిన చెరువులంటూ అసంబద్ద గీతాలను రచిస్తే, అరువు గళాలు అలపించాయి. ఏ పాట తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచిం దో, ఏ పాట తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడిందో ఆ పాటను తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నప్పుడు
దొర కోసమే పాడాలి
దొర గురించి పాడాలా అంటూ
కొన్ని గొంతులు వినిపించాయి. కానీ తర్వాత ఏ పాట రాజ్యాధికారానికి దగ్గర చేసేందుకు దోహదపడిందో ఆ పాటను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాయి రాజకీయ పార్టీలు. ఆర్థిక ఇబ్బందుల్లో కవులు, కళాకారులకు డబ్బును ఎరగా చూపాయి.
బాల రసాల సాల
నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
ఊడల కిచ్చి అప్పుడగు
కూడు భుజించటం కన్నా సత్ కవులు,
హరికులు అయితేనేమి …
అంటూ చెప్పడానికి ఇప్పటి కవులు, కళాకారులు బమ్మెర పోతనలు కాదు. కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రశ్నించే పాట జన జీవితాలను, వారి సమస్యలను, అవసరాలను ఆవిష్కరించిన పాట ఇప్పుడు శృతించడం మొదలుపెట్టింది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను, మతోన్మాదాన్ని చూ స్తూ గడిపేస్తుంది. గొంతుకలు శృతించడానికి తప్ప మరెందుకు పనికిరాని పరిస్థితికి దిగజారాయి. పాట పుట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిలిచిన పాట అందుకు కారకులైన వారు చిరస్మరణీయులు. వారి మధ్య లేకపోవచ్చు కానీ పాట సజీవం. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల వేళ ప్రజల పక్షాన నిలిచిన కలాలకు, గళాలకు ఉద్యమాభివందనాలు. దారి తప్పిన కలా లు, గళాలు ప్రజలకోసం నిలవాలని ఆకాంక్షిద్దాం.